తండ్రి నిను దలంచి…

బాపు, నాయనా, నాన్న ఇవన్నీ తండ్రికి పర్యాయ పదాలు. కొత్తగా వచ్చిన పదం నాన్నగారు. దాన్ని దాటివచ్చిన మరో పదం డాడీ. తల్లి గురించి పట్టించుకున్నంతంగా కవులూ సాహిత్యలోకం తండ్రి గురించి పట్టించుకోలేదు. అంతేగాని, విస్మరించారని అనలేం.  తండ్రి గురించి కవులు ఎక్కువగా రాయలేదేమో గానీ తమ మొదటి పుస్తకాలని ఎక్కువగా తండ్రికే అంకితమిచ్చారు.

అరుణ్‌ఆగర్‌ నాకు తెలియదు. కానీ ఇటీవల అతనొక మంచి కవిత రాశాడు. ‘తొలి నమస్కారం తండ్రికి’ అన్న పేరుతో. చాలామందికి ఆశ్చర్యం వేస్తుంది దీన్ని కవిత అనడం. అందరూ దీన్ని ఓ వ్యాసంలా చూసి ఉండవచ్చు. ఒక మగవాద గొంతుగా పరిగణించి వుండవచ్చు. ఎవరు ఎలా పరిగణించినా నా దృష్టిలో ఇదొక గొప్ప కవిత. తండ్రి మీద రాసిన ఈ అద్భుత కవిత మీరు చదవలేదా? దయచేసి మార్కెట్లో వున్న ‘మేల్‌ కొలుపు’ పుస్తకం కొని చదవండి.

‘నాన్న నేను నీ తాలూకు జన్యు విశేషాన్ని, నీ కొనసాగింపుని, ఈ ప్రపంచంలో నువ్వు చేసిన సంతకాన్ని’ అన్న అతని గొంతులో మీ గొంతు చూసుకోండి. అరుణ్‌సాగర్‌ ఈ పుస్తకంలో లేవనెత్తిన వాదాల వివాదాల జోలికి నేను పోదల్చుకోలేదు. అతని అభిప్రాయాలతో మనం ఏకీభవించినా ఏకీభవించకపోయిన ఫర్వాలేదు. కానీ అతని మగగొంతుకను వినాల్సిన అవసరం వుంది. అతను తండ్రి గురించి రాసిన ‘తొలి నమస్కారం తండ్రికి’ కవిత చదవాల్సిన అవసరం మరెంతో వుంది.

‘త్యాగ పరిమళం నాన్న, చెమట వాసన నాన్న, మంచి భర్త అనిపించుకోవాలి, మంచి తండ్రనిపించుకోవాలి, మగాడనిపించుకోవాలి, కష్టమొస్తే కన్నీళ్లు పెట్టకూడదు, గుండె నిండా దు:ఖం నిల్వలు పోగేసుకొని ఓ తెల్లవారుజామున కుప్పకూలిపోవాలి. నాన్ననెంత కరుకు మనిషిని చేశారు. ఏయ్‌ అల్లరి చేస్తున్నావేంటి నాన్నతో చెప్పానంటే వీపు పగలగొడతాడు. నాన్న నిన్ను చిన్నప్పుడే విలన్‌ పాత్రలో చూపించారు. నిన్ను నువ్వు అని పిలవకుండా చేశారు.’

అమ్మా! నువ్వూ నాన్నా, నామూల ధాతువులు. మీ ఇద్దరి కొనసాగింపుని కానీ కథలూ గాథలూ కావ్యాలూ కమనీయ సామెతలూ పోలికలు అన్నీ నీవే కదా, నాన్నకీ కొన్న పంచనీ, నన్నిప్పుడు నాన్న కోసం కూడా ఒక్క మొక్క నాటనీ’ అని అరుణ్‌సాగర్‌ గొంతెత్తాడు. ఎవరూ నాన్న కోసం ఒక్క పాట కూడ పాడలేదు అన్నాడు. నాన్న గురించి పాటలు లేవని కాదు. ఉన్నాయి. అమ్మ గురించి ఎన్ని కవితలైతే రాశారో అన్ని కవితలు తండ్రి గురించి లేకపోవచ్చు. ‘అమ్మ’ కవితా సంపుటిలాగా ‘తండ్రి నిను దలంచి’ కవితా సంపుటి భవిష్యత్తులో రూపుదిద్దుకోవచ్చు.

ఈ మధ్యకాలంలో తండ్రి గురించి రాసిన కవితలు నా దృష్టికి వచ్చాయి. ఊరంతటికీ బతుకునిచ్చిన మారాజు తన తండ్రి అంటూ యార్లగడ్డ రాఘవేంద్రరావు అంటాడు.

తండ్రి గురించి పాటలు పాడిన కవులు ఎందరో. వఝల శివకుమార్‌ సిద్ధార్థ, డాక్టర్‌ పులిపాటి, ఎమ్మెస్‌, డా. సుమనశ్రీ, వై. ముకుందరామారావు, పార్వతీమోహన్‌, యార్లగడ్డ రాఘవేంద్రరావు, కోడూరి రవి, యెన్నం ఉపేందర్‌, బీరం సుందరరావు, జింబో లాంటి కవులు తండ్రి గురించి చాలా మంచి కవితలు రాశారు. ఇంకా చాలా మంది రాసి వుంటారు. కానీ నా దృష్టికి వచ్చినవాళ్లు మాత్రం వీరు. ‘మట్టిపువ్వు’ పేరుతో యార్లగడ్డ 1996లో కవిత రాశాడు. ‘వీడియో నాన్న’ ఎమ్మెస్‌ 1997లో రాసిన కవిత సుమనశ్రీ పితు: కవిత 1997లో రాశాడు.

‘నువ్‌ నిమిరిన కల్వమొక్కలూ వానచుక్కలూ

మొలకెత్తుతాయా

నాయనా…

ఈ కోటిన్నొక పాదాల నలిగె లక్షన్నొక వాక్యాన్ని’

అని సిద్ధార్థ అంటే, పితు: కవితలో – ఆ రోడ్డు మూలగానో ఈ చెట్టు నీడలోనో వెక్కిళ్ల ఊట బావుల్ని తవ్వుతున్నానదే పనిగా అంటాడు సుమనశ్రీ. ‘పంజరంలోంచి చిలకెగిరిపోయింది, కానీ కేసెట్‌లోంచి మాత్రం కాదు…’ అంటాడు ఎమ్మెస్‌. ‘మా సంపాదన తినకనే ఎందుకు నాన్న అప్పుడే వెళ్లిపోయారు!’ అంటాడు కోడూరి రవి. చనిపోయిన తండ్రి గురించి కొడుకుల అనుభూతులు. ‘నాన్న ఓ అన్‌సంగ్‌ హీరో’ బీరం సుందరరావు కవిత చాలా మంచి కవిత.

‘రక్తాన్ని మోసుకెళ్లే ధమని నాన్న

బరువు బాధ్యతల ముఖచిత్రమై

బతుకు పుస్తకానికి

భాష్యం చెప్పేవాడు నాన్న’

అని అంటూనే కవితని ఇలా ముగిస్తాడు.

నేనో పుస్తకమై విప్పారడానికి

నాన్న దధీచిలా

ఆత్మవిశ్వాసపు వెన్నెముకను

నాకు దానం చేశాడు.

తన పాదముద్రల్తో దారి చూపించిన

నాన్న పాదాల వద్ద

కృతజ్ఞతా పుష్పాన్ని

నిత్యం మొక్కుతాను

నాన్నకి ఓ గొప్ప పుష్నాన్ని అందించాడు బీరం.

ఎక్కడ కోతలయిపోయిన మడి చూసినా ఎక్కడ బీడుపడ్డ చేను చూసినా నాకెందుకో ఈ నేల నాలుగు చెరుగులా ఉన్న నాన్నలందర్నీ చూసినట్లుంటుంది. మీకేనాడూ చెప్పని నాన్న వెతల్ని నాలుగు చేతులా ఏరుకున్నట్లుంటుందని అంటాడు యార్లగడ్డ తన ‘మట్టి పువ్వు’ కవితలో.

తనో పుస్తకమై విప్పారడానికి నాన్న దధీచిలా ఆత్మవిశ్వాసపు వెన్నెముకను నాకు దానం చేశాడని ఒక కవి అంటే – నాన్న తన చూపుడు వేలని వఝుల శివకుమార్‌ అంటాడు.

నాన్నా! నా చూపుడువేలూ!

నా చూపుల్లోకి సమస్త విశ్వాన్నీ మోసుకురావడం

కోసం నువ్వెన్ని కాంతి సంవత్సరాలు ధార పోశావో…

నన్నో అక్షరంగా మొలకెత్తింది మొదలు

రాగంలా మలిచే దాకా నువ్వరగదీసుకున్న కలలకి

నేనింకా రుణపడే వున్నా అంటాడు.

తండ్రి వుంటున్న ఇల్లుని బాగుచెయ్యక అమ్మేయమంటున్న కొడుకులని నిరసిస్తూ కవి ఇలా అంటాడు.

ఎనుగర్రలూ మూలవాసం నాకు ఉయ్యాలేసిన దూలం

ఏది విరిగితే నాకేం

అన్ని అనుబంధాలకీ

చెల్లుచీటి ఇచ్చుకున్నవాన్ని

చూరును చీల్చుకు పెరిగిన రావి మొక్కను కదా

కదలికలకి అర్థం

కాసులతో రాసుకోవడం అలవాటైంది

ఇల్లుపీకి పందిరేసుకునే

ఇంగితం పెరిగిపోయింది, అంటూ

సినిమా జాబిలంత చల్లగా నగరం నిన్నూ నన్నూ అందర్నీ పిలుస్తోంది

రా నాన్నా! రా…

నగరం జాబిలంత చల్లగా పిలుస్తుందట. నగరం గురించి ఇంతకన్నా గొప్ప ఉపమానం మరేం వుంటుందీ!

శివకుమారే కాదు, తండ్రి గురించి కవిత్వాలు రాసిన వాళ్లు ఎందరో వున్నారు. తన తండ్రి జ్ఞాపకంలో దుర్భశయనం ఇటీవల  ‘నాయిన’ అనే కవిత రాశారు. వాళ్ల ‘నాయిన’ గురించి ఇలా అంటాడు.

కాళ్లకింద చెమ్మవి, కాళ్లకింద నేలవి

సారమున్న చారెడు మట్టివి

రంగుల భ్రమల్లేని తెల్లదనానివి

ప్రగల్భాలు పలకని పల్లెటూరివి

ఉదాహరణ లాంటి ఉపాధ్యాయుడివి

పద్ధతిగల పలుకువి ప్రమిదవి

ఇంటింటి పాకలు వేయించిన నిజమైన పాఠానివి

గడియారాన్ని ధిక్కరించని వాడివి సకాలానివి

వాళ్ల ‘నాయిన’ దారే తనకు ఒరవడి అంటూ కవితను ముగిస్తాడు శ్రీనివాసాచార్య. ఒక ఉపాధ్యాయునిగా అమాయకంగా కాళ్ల కింద నేలగా బతికిన తన తండ్రి గురించి కళ్లకు కట్టినట్టు కవిత్వీకరిస్తాడు.

కొడుకుల ప్రయత్నమంతా ఒక్కటే – నా మాటల్లో చెప్పాలంటే –

నా ఈ ప్రయత్నం ఒక్కటే

నేను నీలా పరివర్తనం చెందాలని

నీలా ఫలప్రదమైన జీవితం గడపాలని

ఎప్పటికీ

నేను నీ కేరాఫ్‌నే

ఎన్నటికీ నువ్వు నా కేరాఫ్‌ చిరునామావి కాదు

కొడుకులందరూ తండ్రుల కేరాఫ్‌లు కావడంకన్నా గొప్ప తండ్రులకి మరేం వుంటుందీ? కొడుకులు ఎంత గొప్ప వాళ్లు అయినప్పటికీ తండ్రి కేరాఫ్‌లో ఒదిగి వుండటం తండ్రికి ఇచ్చే గౌరవం. ఆ మధ్య కె.ఎన్‌.వై పతంజలి పెళ్లిపత్రికలో ఇట్లాగే ఉంది. అది ఆయన తన చనిపోయిన తండ్రికి ఇచ్చిన గౌరవం ఇదీ అంతే!

తండ్రి గురించి రాసిన కవులందరికి కొడుకునై నమస్కరిస్తూ.