భారత్‌లో ట్రై సిరీస్‌ ఆడేందుకు పాక్‌ ఉత్సాహం

లా¬ర్‌,సెప్టెంబర్‌ 13 : క్రికెట్‌ సంబంధాల పునరుధ్ధరణ కోసం భారత్‌ క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డ్‌ వెంటపడకండంటూ మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ షోయబ్‌ అక్తర్‌ వ్యాఖ్యానించి 24 గంటలైనా గడవక ముందే పిసిబీ మరోసారి స్నేహహస్తం కోసం చేయిచాచింది.  క్రికెట్‌ సంబంధాలు మెరుగపరుచుకునేందుకు చాలా కాలంగా ప్రయత్నిస్తోన్న పాక్‌ క్రికెట్‌ బోర్డ్‌ తాజాగా ఈ ఏడాది చివర్లో జరిగే ట్రై సిరీస్‌ ఆడాలని ఉత్సాహంతో కనిపిస్తోంది. చెన్నై వేదికగా శనివారం జరగనున్న ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ సమావేశంలో దీనిపై బీసిసిఐతో చర్చించాలని పిసిబి భావిస్తోంది. దీని కోసమే పిసిబీ సిఈవొ ప్రత్యేకంగా భారత్‌కు రానున్నట్టు తెలుస్తోంది. షెడ్యూల్‌ ప్రకారం డిసెంబర్‌లో భారత్‌ , శ్రీలంకతో పాటు వేరే దేశంతో ముక్కోణపు సిరీస్‌ నిర్వహించాలని బీసిసిఐ ఆలోచిస్తోంది. దీనిలో తమకు అవకాశమివ్వాలంటూ బీసిసిఐని కోరనున్నట్టు పాక్‌ క్రికెట్‌ బోర్డ్‌ వర్గాలు తెలిపాయి. వారు పిలిస్తే భారత పర్యటనకు వచ్చేందుకు ఎటువంటి అభ్యంతరాలు లేవని వెల్లడించాయి.

ఒకవేళ ఈ ట్రైసిరీస్‌కు భారత్‌ అంగీకరిస్తే… శ్రీలంకతో జరిగే సిరీస్‌లో మార్పులు చోటు చేసుకునే అవకాశాలున్నట్టు పిసిబి తెలిపింది. అటు సౌతాఫ్రికా పర్యటనపై ఇంకా సందిగ్ఘత కొనసాగుతుండగా…. ట్రై సిరీస్‌ ఖరారైతే సఫారీ టూర్‌ దాదాపుగా కుదించినట్టే. మరోవైపు 2007 తర్వాత ఐదేళ్ళ విరామంతో గత ఏడాది స్వల్పకాలిక సిరీస్‌ ఆడేందుకు పాక్‌ జట్టు భారత్‌కు వచ్చింది. ఈ ట్రైసిరీస్‌లో ఆడడం ద్వారా ఆర్థికంగా కూడా లాభపడొచ్చని పిసిబి భావిస్తోంది. అయితే రెండు దేశాల మధ్య ప్రస్తుతం సరైన సంబంధాలు లేని నేపథ్యంలో భారత్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తుందా అనేది ప్రశ్నార్థకమే.