నేరానికి తగిన శిక్ష…?

నిర్భియ కేసులో నలుగురు మద్దాయిలు ముఖేశ్‌, అక్షయ్‌ ఠాకూర్‌, పవన్‌గుప్తా, వినయ్‌శర్మలకు ఢిల్లీలోని సాకేత్‌ కోర్టు శుక్రవారం మరణశిక్షలని ఖరారు చేసింది. ఈ మరణ శిక్షలని హైకోర్టు డివిజన్‌ బేంగ్‌ ధ్రువీకరించాలి. ఆ తరువాత సుప్రీం కోర్టుకి అప్పీలు, క్షమాభిక్ష తదితర విషయాలు అన్నీ పూర్తి అయిన తరువాత ముద్దాయిలకి ఉరిశిక్ష అమలవుతుంది. ఈ కేసులో ముద్దాయిలకు మరణ శిక్షలను విధించడం ఎవరికీ ఆశ్చర్యం కలిగించలేదు. ఐదో ముద్దాయికి బాలల న్యాయస్థానం మూడు సంవత్సరాలకి గాను జువైనల్‌ హోమ్‌కి బోర్డు పంపించింది. జువైనల్‌ చట్ట ప్రకారం అంతకు మించి పంపించడానికి అవకాశం లేదు. ఈ కేసులోని ప్రధాన నిందితుడు రాంసింగ్‌ మార్చి 11న తీహార్‌ జైల్లో అనుమానాస్పదస్థితిలో ఆత్మహత్య చేసుకున్నాడు.

సినిమా చూసి తన స్నేహితుడితో ఇంటికి వెళ్తున్న ‘నిర్భయ’ మీద బస్సులో ఈ దాడి జరిగింది. ఆమె స్నేహితుడ్ని బస్సులోంచి తీసివేసి ఆమెపై అత్యాచారం చేసి ఆమె గాయాలు చేశారు. చివరికి ఆమె డిసెంబర్‌ 29 రోజున సింగపూర్‌లోని మౌంట్‌ ఎలిజబెత్‌ హాస్పిటల్‌లో గాయాల వల్ల చనిపోయింది. ఈ సామూహిక అత్యాచారం దేశంలోని ప్రతి తల్లిదండ్రి కంట కన్నీరు పెట్టించింది. దేశం మొత్తాన్ని కదిలించి అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారి అత్యాచారంపై మనుపెన్నడూ లేనంతగా  అవగాహన, చైతన్యాన్ని నింపింది. దేశ ప్రజలందరినీ కలచివేసింది. చాలా మంది మరీ ముఖ్యంగా మహిళలు ఈ ముద్దాయిలకు మరణశిక్ష విధించాలని కోరుకున్నారు. మరో విధంగా చెప్పాలంటే డిమాండ్‌ చేశారు. ప్రజల నుంచి ఇంత డిమాండ్‌ వచ్చినప్పుడు సహజంగానే కోర్టు మీద ఒత్తిడి వుంటుంది. ఆ ఒత్తిడి వల్లే కోర్టు మరణశిక్ష విధించిందని అనుకోవడానికి వీల్లేదు. డిసెంబర్‌ 16న జరిగిన ఈ సంఘటన వల్ల ప్రభుత్వంపై పోలీసులపై న్యాయవ్యవస్థపై న్యాయం చెయ్యాలన్న ఒత్తిడి విపరీతంగా పెరిగింది. అయితే కోర్టుల తీర్పులు ప్రజల భావోద్వేగాలపై ఆధారపడి వుండవు. కోర్టులో అనుమానానికతీతంగా రుజువైన అంశాలని బట్టి వుంటుంది. ఈ నిర్బయ కేసులో మరణ శిక్ష పడటం వల్ల ఆ నేరాలు తగ్గుతాయని అనుకోవడానికి వీల్లేదు.

‘అరుదైన కేసుల్లో అరుదైన’ వాటిల్లోనే మరణశిక్షని కోర్టులు విధించాల్సి వుంటుంది. ఈ నేరం అరుదైన వాటిల్లో అరుదైనదిగా సాకేత్‌ కోర్టు భావించడం వల్ల మరణశిక్షని ముద్దాయిలకు ఖరారు చేసింది. ఈ తీర్పుని ఢిల్లీ హైకోర్టు ధ్రువీకరించాల్సి వుంది. ఇంకా చాలా తతంగం వుంది. ఇది అరుదైన వాటిల్లో అరుదైనదా కదా అన్న విషయం నేను చర్చించ దలుచు కోలేదు. కానీ ఈ తీర్పు వెలువడిన తరువాత ముద్దాయిల న్యాయవాది ప్రతిస్పందన గురించి నాలుగు మాటలు చెప్పదలు చుకున్నాను. ఎందుకంటే అతను న్యాయవాదిగా ప్రవర్తించలేదు. న్యాయవాది అనే వ్యక్తి కోర్టు అధికారి లాంటివాడు. ముద్దాయి పక్షం వహించినప్పటికీ కేసు వాదించినంత వరకు మాత్రమే. ఆ తరువాత అతను మామూలుగా వ్యవహరించాల్సి వుంటుంది. తన క్లయింట్లకు మరణ శిక్ష విధించడంపై అతను నిరసన ప్రకటించాల్సిన అవసరం లేదు. అతని అభిప్రాయం ప్రకారం అది అరుదైన వాటిల్లో అరుదైనదిగా కాకపోతే అతని అసంతృప్తి వ్యక్త పరచవచ్చు. ఈ తీర్పు తరువాత మూడు నెలల వరకు రేప్‌ నేరాలు జరుగకపోతే అప్పీలుకు వెళ్లనని కూడా అతను సవాల్‌ విసిరాడన్న వార్తలు కూడా మీడియాలో దర్శనమిచ్చాయి. మరణ శిక్షలతో మహిళలపై నేరాలు ఆగవని ఆమెస్టీ ఇంటర్నేషనల్‌ పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈ విషయాలు చూడాల్సి వుంటుంది.

నేరస్తులకి కోర్టు ఏం ఇవ్వాల్సి వుంటుంది? శిక్ష విధించాలి. ఇందులో సందేహం లేదు. అయితే ఎంత శిక్ష విధించాలి? చాలా మంది దృష్టిలో ‘కన్నుకు కన్ను’ ‘పన్నుకు పన్ను’ న్యాయవ్యవస్థలో శిక్షల గురించి చాలా సిద్ధాంతాలు వున్నాయి. ఇతరులు నేరాలు చేయకుండా నిరోధించే విధంగా శిక్షలు వుండాలని కొంతమంది అంటారు. బాదితురాలికి న్యాయం జరిగే విధంగా వుండాలని కొందరు, నేరస్తుల్లో మార్పులు వచ్చే విధంగా వుండాలని మరికొందరు అంటూ వుంటారు.

సుప్రీం కోర్టు ఈ మధ్యకాలంలో కొత్త సూత్రాన్ని ప్రతిపాదించింది. అదే ‘నేరానికి తగిన శిక్ష’. శిక్ష విధించడంలో కోర్టు కఠినంగా వుండాలి. కొన్ని ప్రత్యేక కేసుల్లోని వాస్తవ పరిస్థితులను బట్టి నేర స్వభావాన్ని బట్టి, ముద్దాయిల నడవడికను బట్టి, ఉపయోగించిన ఆయుధాలను బట్టి, ఇంకా ఇతర విషయాలను పరిగణనలోకి తీసుకొని కోర్టులు వాటికి తగినట్టుగా శిక్షలని విధించాల్సి వుంటుంది. ఈ విషయాలన్ని పరిగణనలోకి తీసుకొని కేసుని విచారించిన కోర్టు నేరానికి తగ్గ శిక్షని కోర్టులు విధించాల్సి వుంటుంది.

ఒక వ్యక్తి మీద వున్న పగతో ఒక వ్యక్తిని హత్య చేసిన సందర్భంలో మరణశిక్ష సబబు కాదు కానీ కావాలని హత్యలు చేసినప్పుడు మరణ శిక్షలని కోర్టులు విధించాల్సి వుంటుంది. ‘మహేశ్‌ వర్సెస్‌ స్టేట్‌’ కేసులో కోర్టు మరణ శిక్ష తగ్గించడానికి నిరాకరిస్తూ ఈ విధంగా అభిప్రాయపడింది.

‘ముద్దాయి చేసిన క్రూరమైన చర్యలకు సంబంధించి సరైన సాక్ష్యాలు వున్నప్పుడు అతనికి తీవ్రమైన శిక్ష వుండాల్సిందే. అలాంటి వ్యక్తులకి శిక్ష తగ్గిస్తే అది న్యాయాన్ని పరిహారం చేసినట్టే అవుతుంది. సామాన్యునికి కోర్టుల మీద విశ్వాసం పోతుంది. అలాంటి కేసుల్లో ముద్దాయిలో పరివర్తన కోసం కాకుండా, ఇతరులు నేరాలు చేయకుండా నిరోధించే విధంగా వుండాలి.

స్టేట్‌ వర్సెస్‌ రాజ్‌కుమార్‌ ఖండేల్‌వార్‌ కేసులో సుప్రీం కోర్టు ఈ విధంగా అభిప్రాయపడింది.

‘సాంఘిక వ్యవస్థ మీద నేర ప్రభావం ఎంత వుందో గమనించి శిక్ష విధించడం అవసరం. ఆ విధంగా విధించకపోతే అది వృథా ప్రయాస అవుతుంది. స్త్రీలపై జరిగిన నేరాల్లో, కిడ్నాపింగ్‌, దోపిడీ, అక్రమార్జన లాంటి కేసుల ప్రభావం మీద సమాజం మీద ఎంతో వుంటుంది. ప్రజాహితం కోసం, ప్రజల క్రమబద్ధత గురించి ఆలోచించి సరైన శిక్షలను విధించాల్సి వుంటుంది. ఇలాంటి కేసుల్లో ఉదారంగా వ్యవహరిస్తే, సానుభూతితో వ్యవహరిస్తే అది సమాజ అవసరాలకి విఘాతం కలిగించినట్టుగా వుంటుంది.

నిర్భయ కేసుల్లో పరివర్తనకి తగిన శిక్షకి మధ్య చర్చ జరుగుతుంది. ఈ కేసుల్లో ప్రజల స్పందన కంటికి కన్ను అన్న విధంగా వుంది. భారతదేశంలో ఆ విషయానికి వస్తే ప్రపంచం వ్యాప్తంగా శిక్షలు వ్యక్తుల్లో పరివర్తన వచ్చే విధంగా వుండాలని అంటున్నారు.

చాలా కేసుల్లో నేరస్తులు చాలా కారణాల వల్ల కేసుల నుంచి తప్పించుకుంటున్నారు. దాని వల్ల కోర్టులన్నా, పోలీసులన్నా నేరస్తులకి భయం లేకుండా పోతుంది. ఫలితంగా న్యాయ వ్యవస్థ బలహీనపడి దానిపై ప్రజల విశ్వాసం సన్నగిల్లుతుంది. అందుకని నేరానికి తగిన శిక్షని కోర్టులు విధించాల్సిన అవసరం వుంది. నేరస్తుని పట్ల, నేరం పట్ల సమాజానికి వున్న వ్యతిరేకత ఆధారంగా శిక్షలని కోర్టులు విధించాల్సి వుంటుంది. నేరస్తుల హక్కులని, జీవన స్థితిగతులనే కాక బాధితురాలి హక్కులు, బాధ, జీవన స్థితిగతులని అదే విధంగా సమాజాన్ని నేర ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకొని కోర్టులు శిక్షలని విధించాల్సి వుంటుంది. ఆ విధంగా శిక్షలని కోర్టు విధించకపోతే అవి తమ విద్యుక్త ధర్మంలో విఫలమవుతున్నట్టు భావించాల్సి వుంటుంది.

సాకేత్‌ కోర్టు కూడా ఆ విధంగానే భావించి మరణ శిక్షని ఖరారు చేసినట్టుంది. అయితే ఈ నేరం సుప్రీం కోర్టు బచన్‌సింగ్‌, మాచిసింగ్‌ కేసులో చెప్పిన విధంగా వుందా లేదానన్నది మరో అంశం. ఈ విషయాన్ని ఢిల్లీ హైకోర్టు నిర్ధారిస్తుంది.

ముద్దాయిల న్యాయవాది చెప్పినట్టు ఈ తీర్పువల్ల రేప్‌ నేరాలు జరుగవచి అనలేం. మరణశిక్షలతో రేప్‌ నేరాలు ఆగవని ఆమెస్టీ ఇంటర్నేషనల్‌ అభిప్రాయపడింది. ఆ విషయానికి వస్తే ఏ శిక్ష వల్ల కూడా అలాంటి నేరాలు అంతరించవు. తగ్గుముఖం పడుతాయి. అంతే! మరో విధంగా చెప్పాలంటే తగ్గుముఖం పట్టడానికి అవకాశం వుంది.

నేరానికి తగిన శిక్ష వుండాల్సిందే. అది కూడా సాకేత్‌ కోర్టులాగా అన్ని కేసుల్లో సత్వర దర్యాప్తు, విచారణ జరిగితే తగు ఫలితాలు వుంటాయి. ఇది అందరూ గుర్తుంచుకోవాలి.