సచిన్‌ కోసం గెలుస్తాం – హర్భజన్‌

మొహాలీ ,సెప్టెంబర్‌ 16  : గత ఏడాది కాలంగా భారత్‌ ఆఫ్‌స్పిన్నర్‌ హర్భజన్‌సింగ్‌ వార్తల్లో ఉంటూనే ఉన్నాడు. క్రికెట్‌తో కాకుండా వేరే వేరే విషయాలలో తనదైన ముద్రవేశాడు. అయితే ఛాంపియన్స్‌ లీగ్‌ టీ ట్వంటీ షురూ కానున్న నేపథ్యంలో మళ్ళీ తన స్పిన్‌ మ్యాజిక్‌తో గ్రాండ్‌ రీ ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నాడు. దీని కోసం ముమ్మరంగా ప్రాక్టీస్‌ కూడా చేస్తున్నాడు. ఈ టోర్నీలో ముంబై ఇండియన్స్‌ విజయాలలో కీలకపాత్ర పోషించాలనుకుంటున్న భజ్జీ చెప్పాడు. అలాగే కెరీర్‌లో చివరి టీ ట్వంటీ టోర్నీ ఆడుతోన్న మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ కోసం టైటిల్‌ గెలవాలనుకుంటున్నట్టు తెలిపాడు. ఐపీఎల్‌ ఆరోసీజన్‌లో మెరుగ్గా రాణించి ఛాంపియన్‌గా నిలిచామని , సిఎల్‌ టీ ట్వంటీలో కూడా దానినే కొనసాగిస్తామని ధీమాగా చెప్పాడు. కాగా జాతీయ జట్టులో చోటు దక్కకపోవడానికి యువస్పిన్నర్ల నుంచి ఎదురైన పోటీ కారణంగా కాదన్నాడు. తాను ఎవరితోనూ పోల్చిచూసుకోనని , తనకు తానే పోల్చుకుంటానని వ్యాఖ్యానించాడు. కెరీర్‌లో 100 టెస్టులు పూర్తి చేసుకున్న టర్బోనేటర్‌ మళ్ళీ అంతర్జాతీయ క్రికెట్‌ ఆడడంపై కాన్ఫిడెంట్‌గానే కనిపిస్తున్నాడు. మరో 150 వికెట్లు పడగొట్టే సత్తా తనలో ఉందని వ్యాఖ్యానించాడు. అయితే ఛాంపియన్స్‌ లీగ్‌లో నిలకడగా రాణించడం ద్వారా వచ్చే ఆసీస్‌తో సిరీస్‌కు ఎంపిక కావాలని భజ్జీ భావిస్తున్నాడు.