టాస్క్‌ఫోర్స్‌లో తెలంగాణ ఐపీఎస్‌లకు చోటెందుకు కల్పించలేదు?

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లో శాంతిభద్రతల పరిరక్షణ, పటిష్టమైన పోలీసింగ్‌ కోసం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ టాస్క్‌ఫోర్స్‌లో తెలంగాణ ప్రాంత ఐపీఎస్‌లకు చోటు కల్పించకపోవడం అనేక సందేహాలకు తావిస్తోంది. హోం శాఖ సలహాదారు కె. విజయ్‌కుమార్‌ నేతృత్వంలో ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్‌లో ఎనిమిది మంది కేంద్ర అధికారులు సహా 18 మంది ఐపీఎస్‌ అధికారులతో ఈ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఎనిమిది మంది అధికారులతో కూడిన కమిటీ అయినప్పటికీ రాష్ట్రానికి చెందిన పది మంది ఐపీఎస్‌లు వారికి సమాచారాన్ని అందజేస్తారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు కంటిమీద కునుకు లేకుండా చేసిన గంధపు చెక్కల స్మగ్లర్‌ వీరప్పన్‌ను మట్టుబెట్టిన ఎస్టీఎఫ్‌కు నేతృత్వం వహించిన విజయ్‌కుమార్‌ను ఆంధ్రప్రదేశ్‌ విభజన నేపథ్యంలో తలెత్తే శాంతిభద్రతల సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసే టాస్క్‌ఫోర్స్‌కు చీఫ్‌గా నియమించడం ప్రాధాన్యం సంతరించుకున్నదే. ఆయనతో కేంద్ర స్థాయి అధికారులు ఎనిమిది మందికి ఎనిమిది మంది ఈ టాస్క్‌ఫోర్స్‌లో సభ్యులుగా ఉన్నారు. టాస్క్‌ఫోర్స్‌ బృందంలో ప్రధానంగా హోం శాఖ అదనపు కార్యదర్శి రాజీవ్‌శర్మ, జాతీయ దర్యాప్తు సంస్థ అదనపు డీజీ ఎన్‌ఆర్‌ వాసన్‌, మధ్యప్రదేశ్‌ అదనపు డీసీ డీఎం మిత్ర, ఒడిశా ఇంటెలిజెన్స్‌ అదనపు డీజీ జుల్ఫికర్‌ హసన్‌, హోం శాఖ (పర్సనల్‌) డైరెక్టర్‌ శంతను, బ్యూరో ఆఫ్‌ పోలీస్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ డీఐజీ అన్షుమన్‌ యాదవ్‌ సభ్యులు. ఈ టాస్క్‌ఫోర్స్‌ బృందంతో రాష్ట్ర డీజీపీ ప్రసాదరావు, ఇంటెలిజెన్స్‌ అదనపు డీజీ మహేందర్‌రెడ్డి, హైదరాబాద్‌ సీపీ అనురాగ్‌శర్మ, ఉన్నతవిద్యాశాఖ కార్యదర్శి అజయ్‌ మిశ్రా, మాజీ డీజీపీలు హెచ్‌జే దొర, అరవిందరావు, ఆంజనేయరెడ్డి, ఏకే మహంతి, సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులు ఏకే ఖాన్‌, జేవీ రాయుడు, విశ్వజిత్‌కుమార్‌, చారుసిన్హా, మల్లారెడ్డి, దామోదర్‌, ఎన్‌ఆర్‌కే రెడ్డి, సజ్జనార్‌, ఆస్కీ డీజీ ఎస్‌కే రావు, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి పాపారావు. టాస్క్‌ఫోర్స్‌ బృందానికి సమాచారం ఇచ్చే బాధ్యతను ఇద్దరు ఐఏఎస్‌, మిగతా ఐపీఎస్‌ అధికారులకు కట్టబెట్టారు. కానీ వారిలో ఒక్కరంటే ఒక్కరు కూడా తెలంగాణ ప్రాంతానికి చెందిన ఐపీఎస్‌ అధికారి లేరు. తెలంగాణ నుంచి డీజీపీగా పనిచేసిన పేర్వారం రాములుకు కూడా అవకాశం ఇవ్వలేదు. ఆయన ఒక రాజకీయ పార్టీలో చేరాడనే సాకును చెప్పడానికి అధికారవర్గాలు సిద్ధంగా ఉండొచ్చు. కానీ అదే సమయంలో మాజీ డీజీపీ అరవిందరావు ఏ రాజకీయాలు పాటిస్తున్నారో విస్మరించారు. ఆయన ఆర్‌ఎస్‌ఎస్‌, సంఘ్‌ పరివార్‌ రాజకీయాలను సమర్థిస్తున్నారు. బ్రాహ్మణులు అధికారంలోకి వస్తే హిందువుల సమస్యలు పరిష్కారమవుతాయని వ్యాఖ్యానించిన అరవిందరావు తానున్నది లౌకిక దేశంలోనన్న విషయాన్ని విస్మరించాడు. ఒక మతానికి ప్రతినిధిగా వ్యవహరిస్తున్న వ్యక్తిని ఒక రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏర్పాటు చేసిన కమిటీలో బాధ్యుడ్ని చేయడం ఎంతవరకు సమంజసం. అలాగే కమిటీలో పనిచేసిన మరో మాజీ డీజీపీ ఆంజనేయరెడ్డి రాజకీయ పార్టీలకు సలహాదారుగా, కీలకవ్యక్తిగా పనిచేసిన వారే. మరి ఆయనకు లేని రాజకీయ అడ్డంకి పేర్వారం రాములుకు ఎందుకు? రాములు సంగతి పక్కనబెడితే ప్రస్తుతం సర్వీస్‌లో ఉన్నవారిలో ఎందరో సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులు తెలంగాణ ప్రాంతానికి చెందిన వారున్నారు. వారిలో ఒక్కరంటే ఒక్కరికి కూడా టాస్క్‌ఫోర్స్‌కు సమాచారమిచ్చే అవకాశం కల్పించకపోవడం శోచనీయం. ఇకపోతే టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటుపై సీమాంధ్ర మీడియా ముందస్తుగా మొదలు పెట్టిన దుష్ప్రచారం ఇప్పుడు ముదిరి పాకాన పడింది. ప్రజల మధ్య వైషమ్యాలు పెంచేందుకే టాస్క్‌ఫోర్స్‌ అనే ఆరోపణలు వినవస్తున్నాయి. అయితే నిజాయితీ గల అధికారి నేతృత్వంలోని కమిటీ తన పని తాను చేసుకుపోతుందనే ఆశిద్దాం. ఇకపోతే ఆంధ్రప్రదేశ్‌ విభజన అనంతరం ఇరు రాష్ట్రాల్లో శాంతిభద్రతల పరిరక్షణ, పటిష్టమైన పోలీస్‌ వ్యవస్థ ఏర్పాటుకు సలహాలు, సూచనలు అందజేస్తుంది. అదే సమయంలో సాధారణ పరిపాలన శాఖ రాష్ట్రానికి చెందిన అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌, ఐఈఎస్‌, ఐఐఎస్‌ల వివరాలను సేకరిస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర కేడర్‌కు చెంది ఐఏఎస్‌ అధికారులు 290 మంది, ఐపీఎస్‌ అధికారులు 258 మంది ఉన్నారు. రాష్ట్ర విభజనకు సంబంధించిన ప్రక్రియలన్నీ శరవేగంగా సాగుతున్న సమయంలోనూ తెలంగాణపై ఐపీఎస్‌ అధికారుల వ్యవహారాన్ని వివక్షగానే చూడాల్సి వస్తోంది. ఎవరెన్ని చెప్పిన నిర్దిష్టమైన సమాచారంతోనే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ముందుకు సాగుతోంది. ఈమేరకు రాజ్యాంగ బద్ధమైన వ్యవస్థలను ముందుండి నడిపిస్తోంది. అయితే ఈ సమయంలోనూ ఒక ప్రాంతానికి చెందిన వారిపై ఎలాంటి ఆంక్షలు లేకుండా, వారికి ఎలాంటి రాజకీయాలతో సంబంధం ఉన్నా కమిటీలో చేర్చి తెలంగాణ వారిని విస్మరించడం మాత్రం అన్యాయంగానే ఇక్కడి ప్రజానీకం భావిస్తోంది. ఇందుకోసమైన తమ రాష్ట్రం తమకు త్వరగా ఇచ్చేయాలని కోరుతోంది.