వరుస తుపాన్లతో రైతన్న కుదేలు
బంగాళాఖాతంలో ఏర్పడుతున్న వరుస తుపాన్లతో రైతన్న కుదేలవుతున్నాడు. పంటలు చేతికచ్చే సమయంలో సముద్రుడి ఆగ్రహంతో సర్వస్వం కోల్పోతున్నాడు. యేటా అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాల్లో సంభవిస్తున్న తుపాన్లు రైతులకు పెను నష్టాన్ని కలిగిస్తుండగా, ఈ ఏడాది పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభం నుంచి పంటలు చేతికచ్చే వరకూ సముద్రంలో సుడులు తిరిగి తుపాన్లు ఉప్పెనై ఊర్లపై పడుతున్నాయి. సీజన్ ప్రారంభయ్యాక ఊళ్లకు ఊళ్లను ముంచెత్తేసి నీలం తుపాను బాధితులకే ఇంతవరకు ప్రభుత్వాలు పరిహారం ఇవ్వలేదు. మధ్యలో వచ్చిన మరో రెండు తుపాన్లు పంటలకు పెద్ద నష్టాన్నే తెచ్చిపెట్టాయి. ఇక పంటలు చేతికి వస్తాయనే సమయంలో పై-లిన్, దాని తర్వాతే మరో భారీ తుపాను, దానికి ఈశాన్య రుతు పవనాలు తోడై ఆకాశానికి చిల్లిపడ్డట్టు భారీ వర్షాలు ఆ వెంటనే హెలెన్ తుపాను, దాని తీవ్రత పూర్తిగా తగ్గకముందే లెహర్ ముప్పు. ఒక సీజన్‌లో ఆరు తుపాన్లు వస్తే రైతుల పరిస్థితి ఎలా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో రైతుల దుస్థితి చూసి కనీసం జాలి చూపే వారే కరువయ్యారు. ప్రభుత్వ వర్గాలు తుపాన్లు వచ్చినప్పుడు ఏదో కంటితుడుపు చర్యగా సహాయక చర్యలు చేపట్టి చేతులు దులుపుకోవడం మినహా రైతులను ఆదుకోవడానికి నిర్దిష్టమైన చర్యలేవి చేపట్టడం లేదు. రైతు ప్రభుత్వంగా చెప్పుకునే రాష్ట్ర సర్కారు పరిస్థితి ఇందుకు భిన్నమేమీ కాదు. ఈ తుపాన్ల వల్ల రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ పంటలకు భారీ నష్టం సంభవించినా కోస్తాంధ్ర జిల్లాల రైతులు మాత్రం కోలుకోలేనంతగా నష్టపోయారు. నీలం తుపాను బాధితుల గుర్తింపు, వారికి సహాయం అందించడం పెద్ద ప్రహసనంగా సాగింది. కోస్తాంధ్ర జిల్లాల్లో ఎకరాకు రూ. 10 వేల పరిహారం ఇవ్వాలని నిర్ణయించగా, తెలంగాణ జిల్లాల్లో మాత్రం ఎంత పరిహారం ఇస్తారో ప్రకటించలేదు. ఇంతవరకు బాధితులకు ఇతరత్రా సహాయ సహకారాలు అందజేయలేదు. అలాగే పంట నష్టపరిహారం గుర్తింపునకు ఉపయోగిస్తున్న ప్రమాణాలు కూడా సహేతుకంగా లేవు. గ్రామాన్ని యూనిట్‌గా తీసుకొని పంట నష్టాన్ని అంచనా వేస్తున్నారు. 50 శాతం పంట నష్టపోయిన వారికి మాత్రమే పరిహారం ఇస్తామని కొర్రీలు పెడుతున్నారు. సాగు చేసిన పంటలో సగానికిపైగా నష్టపోయిన రైతులకు మాత్రమే పరిహారాన్ని అందిస్తున్నారు. అదికూడా అరకొర సాయమే. రైతులు వెంటనే పంట సాగు చేసుకోవడానికీ ఈ పరిహారం ఉపయోగ పడటం లేదు. పంటనష్టం సర్వే పూర్తయిన తర్వాత కొన్ని నెలలకు పరిహారం ఇన్‌పుట్ సబ్సిడీ రూపేణ చెల్లిస్తున్నారు. రైతులు కనుక బ్యాంకుల్లో అప్పులు తీసుకొని ఉంటే ఆ మొత్తాన్ని అప్పుకిందనే జమ కట్టుకుంటున్నారు. దీంతో తుపాను బాధిత రైతులకు పరిహారం స్థానే పరిహాసాలు అందుకోవాల్సి వస్తోంది. పై-లిన్ తుపాను ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఒడిశాలో భారీ నష్టాన్ని మిగిల్చింది. రైతుల పరిస్థితి ఇక వేరే చెప్పనక్కర్లేదు. పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అప్పటి ఫొటో ఎగ్జిబిషన్‌ను చూసినా తెలుస్తుంది. లక్షలాది ఎకరాల్లో పంటనష్టం సంభవించగా, వేలాది పశువులు మృత్యువాతపడ్డాయి. పదుల సంఖ్యలో మనుషులూ చనిపోయారు. అయినా వారిని ఆదుకునే చర్యలు ఇంతవరకూ చేపట్టలేదు. ఇటీవల పై-లిన్ ప్రాభావిత ప్రాంతాలను సందర్శించి కేంద్ర బృందం బాధిత రైతులను అవహేళన చేసినట్లుగా మాట్లాడింది. చేతికి వచ్చిన పంటలు కోల్పోయి నిండా మునిగిన రైతన్నకు భరోసా ఇవ్వాల్సింది పోయి ఇప్పుడు మళ్లీ పంటలు సాగు చేసుకోవచ్చు కదా అంటూ పరిహాసాలాడింది. లక్షలాది ఎకరాల్లో పంటలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోతే ఆదుకోవాలని సిఫార్లు చేయాల్సిన కేంద్ర బృందం మళ్లీ పంటలు వేసుకోవచ్చు కదా అని ఉచిత సలహాలిచ్చిందంటే ప్రకృతి విపత్తుల వల్ల సంభవించే ప్రమాదాలు, తదనంతర చర్యలపై మన పాలకులకు ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చు. రైతన్నలు ఆరుగాలం శ్రమిస్తేనే పంటలు చేతికివచ్చేది. ఈ ఆరుగాలం శ్రమ వర్షాలు, తుపాన్ల బారిన పడితే వారి పరిస్థితి ఏమిటీ? ఆదుకోవాల్సిన పాలకులు పట్టించుకోకపోవడంలోనే వ్యవసాయరంగంపై మన ప్రభుత్వాలకు ఉన్న చిత్తశుద్ధి స్పష్టమవుతోంది. కేంద్ర బృందం తుపాన్లు సంభవించిన కొన్ని నెలల తర్వాత ప్రభావిత ప్రాంతాలను సందర్శిస్తున్నాయి. ఆ బృందంలో వ్యవసాయరంగంపై సమగ్ర అవగాహన ఉన్న వాళ్లు కాకుండా ఎవరిని పడితే వారిని సభ్యులుగా నియమిస్తున్నారు. వారి పేర్ల చివర ఉండే డిగ్రీలను, ప్రభుత్వ పెద్దల సిఫార్సులను దీనికి ప్రామాణికంగా ఎంచుకుంటున్నారు. వాళ్లు వరద బాధిత ప్రాంతాల పర్యటనను బాధ్యతగా కాకుండా హాలీడే ట్రిప్‌గా ఎంజాయ్ చేసి వెళ్తున్నారు. ప్రభుత్వం ఇంత ఉదాసీనంగా వ్యవహరిస్తుంటే రైతులకేది భరోసా? ప్రకృతి ప్రకోపానికి లోనై నష్టపోయినందుకు రైతన్నలు ఏంకావాలి? వారని ఆదుకోవాల్సిన పాలకులు బాధ్యతల నుంచి దూరంగా పరిగెడితే వారి బాధలను ఎవరికి చెప్పుకోవాలి. అలాగే పంటల బీమా గుర్తింపు ప్రమాణాలు కూడా శాస్త్రీయంగా ఉండాలి. గ్రామాన్ని యూనిట్‌గా కాకుండా సర్వే నంబర్ యూనిట్‌గా తీసుకొని పంట నష్టాన్ని అంచనా వేయాలి. 50 శాతం నష్టపోతేనే పరిహారం ఇస్తామని గిరిగీసుకొని కూర్చోకుండా రైతుకు వాటిల్లే ప్రాథమిక నష్టం అంచనా శాస్త్రీయంగా చేయాలి. బీమా కంపెనీల ఆధ్వర్యంలో నష్టం వాటిల్లిన కొద్దిరోజుల్లేనే పరిహారం చెల్లించేందుకు చర్యలు చేపట్టాలి. పంటల బీమాతో పాటు పశువుల బీమాను సమర్థవంతంగా అమలు చేసి బాధిత రైతులను ఆదుకునే చర్యలు చేపట్టాలి. లేకుంటే దేశానికి అన్నం పెట్టే రైతన్న ఎవరికి కొరగాని వాడయ్యే ప్రమాదముంది. ఇది దేశ భవిష్యత్తుకే పెను ప్రమాదం కావచ్చు కూడా. ఇప్పటికైనా పాలకుల తీరు మారాలి. ప్రకృతి విపత్తుల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు నిర్దిష్టమైన చర్యలు చేపట్టాలి. బాధితులను సత్వరం ఆదుకునేందుకు కార్యాచరణ రూపొందించాలి.