లోక్‌పాల్ మాదిరిగానే తెలంగాణ బిల్లూ ఆమోదించాలి
సుదీర్ఘకాలంగా దేశప్రజలంతా ఎదురు చూస్తున్న లోక్‌పాల్ బిల్లు ఎట్టకేలకు ఉభయ సభల ఆమోదం పొందింది. ఈ బిల్లుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడమే మిగిలుంది. ఆయన రాజముద్ర వేయగానే లోక్‌పాల్-2011 చట్టం అమల్లోకి వస్తుంది. దేశంలో అణువణువునా వేళ్లూనుకుపోయిన అవినీతిని చాలా వరకు నియంత్రించడానికి లోక్‌పాల్, లోకాయుక్త చట్టం దోహద పడుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రస్తుత లోక్‌పాల్ చట్టంతో 40 శాతం అవినీతిని నియంత్రించవచ్చని అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అన్నాహజారే పేర్కొన్నారు. పార్లమెంట్‌లో లోక్‌పాల్ బిల్లు ఆమోదించాలని కోరుతూ ఆయన తన స్వస్థలం మహారాష్ట్రలోని రాలేగావ్‌సిద్ధిలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. లోక్‌సభ బిల్లుకు ఆమోదం తెలిపిన తర్వాత దీక్ష విరమించిన అన్నా లోక్‌పాల్ చట్టం అయిన తర్వాత అవసరమైన సవరణలు చేసుకోవచ్చని పేర్కొన్నారు. అవినీతికి వ్యతిరేకంగా యావత్ జాతిని ఐక్యం చేయడానికి అన్నాహజారే తీవ్ర ప్రయత్నమే చేశారు. సోషల్ మీడియా ఆయన ప్రయత్నానికి అండగా నిలిచింది. అవినీతికి వ్యతిరేకంగా పోరాడే వారు ఆయనతో కలిసి నడిచారు. అవినీతిని రూపుమాపడం మరో స్వతంత్ర పోరాటం అని అన్నా పేర్కొనడంతో యువతరం దీనిపై ముందుండి పోరాడింది. అన్నాతో కలిసి జన్ లోక్‌పాల్ కోసం ఉద్యమించిన అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీని అనతికాలంలోనే ప్రజల్లోకి చొచ్చుకెళ్లగలిగారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ తన ప్రభావాన్ని చాటింది. 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీలో ఆప్ 28 స్థానాలు గెల్చుకుని రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన షీలాదీక్షిత్‌పై కేజ్రీవాల్ ఘన విజయం సాధించాడు. అవినీతి వ్యతిరేక పోరాటానికి ప్రజలు ఎంతగా మద్దతు పలుకుతున్నారో స్పష్టమైన తర్వాత యూపీఏ ప్రభుత్వం ఆగమేఘాల మీద లోక్‌పాల్‌కు చట్టబద్ధత కల్పించడానికి చర్యలు ఆరంభించింది. అన్నా బృందం కోరినట్టుగా జన్‌లోక్‌పాల్ బిల్లును కాకుండా సత్యవ్రత్ చతుర్వేది నేతృత్వంలోని సెలక్ట్ కమిటీ రూపొందించిన లోక్‌పాల్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. లోక్‌పాల్ పరిధిలోకి ప్రధానమంత్రిని తీసుకువచ్చింది. కానీ ఆయనకు కొన్ని మినహాయింపులు, రక్షణలు కట్టబెట్టింది. కేంద్ర మంత్రులు, ప్రభుత్వ ఉద్యోగులు లోక్‌పాల్ పరిధిలోకి వస్తారు. అలాగే లోకాయుక్త పరిధిలోకి రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు మంత్రులు, ఉద్యోగులు వస్తారు. వారు తీసుకునే నిర్ణయాల వల్ల ప్రజాధనం దుర్వినియోగమైనట్లు అభియోగాలు వస్తే లోక్‌పాల్, లోకాయుక్త విచారణ జరిపి ఆరోపణలు నిర్దారణ అయితే చర్యలు తీసుకోవచ్చు. పంచాయతీ మొదలు పార్లమెంట్ వరకు ప్రతిరంగంలో అవినీతి పెరిగి సామాన్యులు చేతులు తడపనిదే పనులు కాని పరిస్థితుల్లో లోక్‌పాల్ చట్టం కొంత వరకు సత్ఫలితాలు ఇస్తుంది. అలాగే సీబీఐ, ఏసీబీ లాంటి విచారణ సంస్థలపై సర్కారు అజమాయిషీ తగ్గుతుంది. అయితే లోక్‌పాల్ పరిధిలో ప్రధానిని చేర్చడాన్ని సమాజ్‌వాదీ పార్టీ వ్యతిరేకించింది. ప్రధాని పార్లమెంట్‌కు జవాబుదారీగా ఉండాలే కాని, లోక్‌పాల్ పరిధిలోకి తీసుకురావడం మంచిదికాదని ఆ పార్టీ అభిప్రాయపడింది. మొదట ప్రధానిని లోక్‌పాల్ పరిధిలోకి తీసుకురావడాన్ని కాంగ్రెస్, బీజేపీ సహా పలు రాజకీయ పక్షాలు వ్యతిరేకించాయి. కానీ దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన అవినీతి వ్యతిరేక ఉద్యమానికి తలొగ్గాయి. లోక్‌పాల్ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందడానికి రెండేళ్లకు పైగా సమయం పట్టింది. ప్రతిపాదన స్థాయిలో దశాబ్దాల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. లోక్‌పాల్ మాదిరిగానే దశాబ్దాల తరబడి నలుగుతున్న డిమాండ్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు. సుదీర్ఘ విరామం తర్వాత పార్లమెంట్ లోక్‌పాల్‌కు ఆమోదముద్ర వేసింది. అలాగే నాలుగున్నర దశాబ్దాలుగా తెలంగాణ ప్రజలు కోరుకుంటున్న ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు బిల్లు పార్లమెంట్‌కు చేరుకునే దశలో ఉంది. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణ ముసాయిదాను రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ శాసనసభ అభిప్రాయం కోసం పంపారు. ఈ ముసాయిదాను సోమవారం శాసనసభలో ప్రవేశపెట్టిన స్పీకర్ నాదెండ్ల మనోహర్ మంగళవారం దీనిపై బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించారు. మూడు రోజుల పాటు ముసాయిదాపై చర్చించాలని నిర్ణయించారు. కానీ బుధవారం శాసనసభలో తెలంగాణ బిల్లుపై చర్చ జరుగకుండా సీమాంధ్ర ఎమ్మెల్యేలు అడ్డుకున్నారు. మండలిలోనూ అదే సీన్ రిపీట్ అయింది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ సీమాంధ్ర ఎమ్మెల్సీలు గందరగోళ సృష్టించడంతో మండలిని చైర్మన్ గురువారానికి వాయిదా వేశారు. గురు, శుక్రవారాల్లో శాసనసభ, మండలి సమావేశాలు సజావుగా జరుగుతాయా అనేదానిపై అనేక సందేహాలు ముసురుకుంటున్నాయి. తెలంగాణపై చర్చ జరుగనివ్వబోమని సీమాంధ్ర ప్రజాప్రతినిధులు చెప్తున్నారు. ముసాయిదాపై చర్చించేందుకు మరో నెల రోజుల గడువుండగా, ఇప్పుడే ఎందుని వారు ప్రశ్నిస్తున్నారు. సీఎం కిరణ్, ప్రతిపక్షనేత చంద్రబాబు, వైఎస్సార్ సీపీ అధినేత జగన్ వారికి అండగా ఉండి ఉభయ సభల్లో సాము గారడీలు చేపిస్తున్నారు. కానీ వారు తమను ఎన్నుకున్న సీమాంధ్ర ప్రజల హక్కులను హరిస్తున్నారనే విషయాన్ని విస్మరిస్తున్నారు. రాష్ట్రపతి శాసనసభ అభిప్రాయం చెప్పేందుకు 40 రోజుల గడువిచ్చారు. సీఎం కోరితే మరో 15 రోజులు పెంచుతారు కాబటి నింపాదిగా అభిప్రాయం చెప్పవచ్చనేది సీమాంధ్రుల వాదన. తద్వారా తెలంగాణ బిల్లు యూపీఏ-2 ప్రభుత్వ కాలంలో పార్లమెంట్ ముందుకు రాకుండా అడ్డుకోవాలనేది వారి కుట్ర. ముసాయిదాపై క్షుణ్నంగా చర్చించేందుకు ఇంకా సమయం కావాలని కోరితే ఏమోగాని, అసలు చర్చకే తావివ్వకుండా మరింత సమయం కోరితే రాష్ట్రపతి ఇస్తారనుకోవడం సీమాంధ్రుల అత్యాశకు నిదర్శనం. నిర్దిష్ట సమయంలోగా శాసనసభ అభిప్రాయం చెప్పకపోతే రాష్ట్రపతి దానిని సభ ఆమోదించినట్టుగానే భావించి కేంద్ర ప్రభుత్వానికి తిప్పి పంపవచ్చు. ఈ విషయం సీమాంధ్ర ప్రజాప్రతినిధులకు స్పష్టంగా తెలుసు. కానీ కావాలనే తెలంగాణ బిల్లును అడ్డుకుంటున్నామనే నెపంతో సీమాంధ్రుల ప్రయోజనాలను కాలరాస్తున్నారు. లోక్‌పాల్ ఎన్ని అవాంతరాలు దాటుకొని పార్లమెంట్ ఆమోదం పొందిందో తెలంగాణ ముసాయిదా కూడా అన్నే ఆటంకాలను అధిగమించింది. శాసనసభ నుంచి బిల్లు త్వరగా రాష్ట్రపతికి చేరేలా కాంగ్రెస్ అధిష్టానం నిర్దిష్టమైన చర్యలు చేపట్టాలి. త్వరగా బిల్లు పార్లమెంట్ ఆమోదం పొంది పది జిల్లాల ప్రజల ఆకాంక్ష నెరవేర్చేలా చర్యలు తీసుకోవాలి.