తెలంగాణను అడ్డుకునేందుకు కుట్ర

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు శాసనసభ సాక్షిగా సీమాంధ్రులు భారీ కుట్రలే చేస్తున్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు, వైఎస్సార్‌ సీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి మూకుమ్మడిగా వ్యూహ రచన చేసి తెలంగాణ ప్రజల గొంతు నులిమేయాలని ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై కాంగ్రెస్‌ పార్టీ జూలై 31న కేంద్ర ప్రభుత్వానికి నివేదించింది. సీడబ్ల్యూసీ కోరినట్లుగానే తెలంగాణ ఏర్పాటుకు యూపీఏ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనికి సీమాంధ్ర నేతలు, పెట్టుబడిదారులు అడుగడుగునా అడ్డుతగులుతూనే ఉన్నారు. మధ్యలో ఆంటోనీ కమిటీ పేరుతో పార్టీ నాయకుల అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఏర్పాటు చేసిన కమిటీ వృథా ప్రయాసగానే మిగిలింది. దానికి రెండు నెలల సమయం వృథా అయింది. జూలై 31న సీడబ్ల్యూసీ తెలంగాణ ఏర్పాటు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తే కేంద్ర ప్రభుత్వం దీనిపై సంప్రదింపుల కోసం అక్టోబర్‌ 3న మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసింది. మంత్రుల బృందం సంప్రదింపుల ప్రక్రియ సుదీర్ఘంగా సాగింది. సీమాంధ్రులు హైదరాబాద్‌పై గొంతెమ్మ కోర్కెలు కోరడం, వాటిని అన్ని రాజకీయ పక్షాలు భూతద్దంలో చూపడంతో ఈ ప్రక్రియా సాగింది. ఎట్టకేలకు పది జిల్లాలు, హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయబోతున్నట్లు ఈనెల 5న కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్‌షిండే తెలిపారు. జీవోఎం సమర్పించిన నివేదికను కేంద్ర కేబినెట్‌ ఆమోదించిందని, రాష్ట్రపతి పరిశీలనకు పంపుతున్నామని ఆయన ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యస్థీకరణ ముసాయిదా-2013 పేరుతో రూపొందించిన ముసాయిదాకు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆమోదం తెలిపి ఈనెల 12న ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ, అభిప్రాయం కోసం హైదరాబాద్‌కు పంపారు. ముసాయిదాపై అభిప్రాయం చెప్పేందుకు 40 రోజుల గడువిచ్చారు. గరిష్టంగా 40 రోజుల గడువే తప్ప అంతకాలం దాక అభిప్రాయం చెప్పకుండా ఆగాల్సిన అవసరం లేదు. ఆ విషయం ముఖ్యమంత్రి సహా సీమాంధ్ర ప్రజాప్రతినిధులందరికీ తెలుసు. కానీ కావాలనే ముసాయిదాపై చర్చ జరుగకుండా సభను అడ్డుకుంటున్నారు. బిల్లును సోమవారం సాయంత్రమే డెప్యూటీ స్పీకర్‌ మల్లు భట్టివిక్రమార్క శాసనసభలో ప్రవేశపెట్టారు. తెలంగాణ ముసాయిదా శాసనసభ అభిప్రాయం కోసం వచ్చిందే తప్ప ఇక్కడ ఓటింగ్‌ ఉండదు. ఈవిషయం అందరికీ తెలిసిందే. కానీ గురువారం శాసనసభ, మండలి వాయిదా పడిన అనంతరం సీఎం కిరణ్‌ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌ విడిపోవాలో, వద్దో నిర్ణయించేది శాసనసభేనని చెప్పాడు. సీఎం కిరణ్‌ శాసనసభకు ఎన్నికవడం ఇది నాలుగోసారి. గత శాసనసభలో ఆయన ప్రభుత్వ చీఫ్‌ విప్‌గా పనిచేశారు. 2009 సాధారణ ఎన్నికల అనంతరం స్పీకర్‌గా నియమితులయ్యారు. తర్వాత ముఖ్యమంత్రిగా ఆయన్ను కాంగ్రెస్‌ అధిష్టానం పదవిలో కూర్చోబెట్టింది. తెలంగాణపై అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని కూడా కిరణ్‌ చెప్పాడు. తీరా కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ కమిటీ తెలంగాణ ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్రాన్ని కోరిన తర్వాత ఇంతెత్తున లేచాడు. అధిష్టానంపై యుద్ధం ప్రకటించినట్టుగానే వ్యవహరించాడు. ఏకంగా అధినేత్రిపైనే ఆరోపణలు గుప్పించాడు. సమైక్య రాష్ట్రాన్ని కొనసాగించేందుకు ఏదేదో చేస్తానని బీరాలు పలికాడు. కానీ అధిష్టానం ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. తెలంగాణపై ముందడుగే వేసింది. అదిరింపులు.. బెదిరింపులతో అధిష్టానం వినదని గుర్తించిన కిరణ్‌ శాసనసభ అభిప్రాయం కోసం రాష్ట్రపతి ఇచ్చిన 40 రోజుల గడువును వృథా చేయడంతో పాటు మరో 15 రోజులు గడువు అధనంగా కోరడం ద్వారా యూపీఏ-2 ప్రభుత్వ హయాంలో తెలంగాణ ఏర్పడకుండా చేయాలని చూస్తున్నాడు. దీనికి సీమాంధ్ర పార్టీల నుంచి ఆయనకు పూర్తి సహకారం అందుతోంది. యూపీఏ ప్రభుత్వానికే కాదు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న గడువు ఫిబ్రవరి 29. ఆలోగానే ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యస్థీకరణ ముసాయిదాకు పార్లమెంట్‌ ఆమోదం తెలపాలి. రాష్ట్రపతి ఆమోదముద్ర వేయాలి. అంటే రెండు నెలల్లోగా తెలంగాణ ప్రక్రియ పూర్తి కావాలి. రాష్ట్రపతి శాసనసభ అభిప్రాయం కోసం ఇచ్చిన గడువు 2014 జనవరి 23తో ముగుస్తుంది. సీఎం అధనంగా మరో 15 రోజుల గడువు కోరితే ఫిబ్రవరి ఏడో తేదీవరకు కాలయాపన చేయొచ్చనేది సీమాంధ్రుల కుట్ర. గురువారం అర్ధాంతరంగా వాయిదా పడిన శాసనసభ జనవరి మూడో తేదీన పున: ప్రారంభమవుతుంది. పదో తేదీ వరకు సభ కొనసాగుతుంది. మధ్యలో ఐదో తేదీ సెలవు. సంక్రాంతి అనంతరం 16న సభ మళ్లీ ప్రారంభమవుతుంది. 23 వరకు సమావేశాలు కొనసాగుతాయి. మధ్యలో 18, 19 తేదీల్లో సెలువులు. మొత్తంగా సభ 13 రోజుల పాటు జరుగుతుంది. తెలంగాణ ఏర్పాటు, ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యస్థీకరణపై చర్చించేందుకు ఇది ఎక్కువ సమయమే. 294 మంది శాసనసభ్యులున్న సభలో 15 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అందరు సభ్యుల అభిప్రాయం చెప్పే అవకాశం కల్పిస్తారా? పార్టీల వారీగా కొందరికి అవకాశం కల్పిస్తారా అనేది శాసనసభలో స్పీకర్‌, మండలిలో చైర్మన్‌ నిర్ణయం తీసుకుంటారు. రాష్ట్రపతి ఇచ్చిన పూర్తి గడువును వినియోగించుకొని 23న రాష్ట్రపతికి అభిప్రాయం పంపినా ఆయన ముసాయిదాను తిరిగి కేంద్ర ప్రభుత్వానికి, అక్కడి నుంచి పార్లమెంట్‌ ఉభయ సభలకు వెళ్లడానికి వారం పది రోజుల వ్యవధి చాలు. పార్లమెంట్‌ ఆమోదించిన ముసాయిదాకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలుగా ప్రస్తుతమున్న రాష్ట్రం విడిపోతుంది. సాధారణ ఎన్నికల నేపథ్యంలో కేంద్రం జనవరి చివరి వారం లేదా ఫిబ్రవరి మొదటి వారంలో ఓట్‌ ఆన్‌ ఎకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టేందుకు సమావేశాలు నిర్వహిస్తారు. ఈ సమావేశాల్లోగా తెలంగాణ బిల్లు పార్లమెంట్‌ ముందుకు రాకుండా సీమాంధ్రులు కుట్ర పన్నుతున్నారు. ఆ కుట్రలను భగ్నం చేయాలి. నాలుగు దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆకాంక్ష సాకారం అయ్యేందుకు తెలంగాణ ప్రజాప్రతినిధులు ముక్తకంఠంతో తెలంగాణ ఇవ్వాలని అసెంబ్లీలో డిమాండ్‌ చేయాలి. సీమాంధ్ర నేతల కుట్రలను బలంగా తిప్పికొట్టాలి.