ఆ అవార్డులను వెనక్కిచ్చేయండి
బ్రహ్మానందం, మోహన్‌బాబుకు హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, డిసెంబర్ 23 (జనంసాక్షి) :
సినీ నటులు బ్రహ్మానందం, మోహన్ బాబులకు రాష్ట్ర హైకోర్టు షాక్ ఇచ్చింది. తమకు ఇచ్చిన పద్మశ్రీ అవార్డులను వారంలోగా తిరిగి ఇచ్చేయాలని, లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర హైకోర్టు వారిని ఆదేశించింది. పద్మశ్రీ అవార్డులను దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సినీనటులు మోహన్‌బాబు, బ్రహ్మానందం తమ పద్శశ్రీ అవార్డులను వెనక్కి ఇచ్చేయాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. పద్మశ్రీ గ్రహీతలు పాటించాల్సిన మార్గదర్శకాలకు విరుద్ధంగా వారు వ్యవహరించారని కోర్టు ఆక్షేపించింది. వారం రోజుల్లో వారి అవార్డులను స్వచ్ఛందంగా వెనక్కివ్వాలని పేర్కొంది. సుప్రీం మార్గదర్శకలాకు భిన్నంగా వారు వ్యవహరించారని పేర్కొంది. ‘దేనికైనా రెడీ’ సినిమా వివాదంపై దాఖలైన ఫిర్యాదుపై న్యాయస్థానం ఈ విధంగా స్పందించింది. కేసు తదుపరి విచారణను వారం పాటు వాయిదా వేసింది. దేనికైనా రెడీ సినిమా విషయంలో వారిద్దరు పద్మశ్రీ అవార్డును దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ బిజెపి నేత ఎన్ ఇంద్రసేనా రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై వాదోపవాదాలు విన్న హైకోర్టు సోమవారం ఆ ఆదేశాలు జారీ చేసింది.దేనికరైనా రెడీ సినిమా టైటిల్స్ విషయంలో బ్రహ్మానందం, మోహన్ బాబు పద్మశ్రీ అవార్డులను ఇంటి పేరు మాదిరిగా వాడి దుర్వినియోగం చేశారని ఇంద్రసేనా రెడ్డి ఆరోపించారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శక సూత్రాలను ఇంద్రసేనా రెడ్డి తరఫు న్యాయవాది ఉటంకించారు. తాము దుర్వినియోగానికి పాల్పడలేదని బ్రహ్మానందం, మోహన్ బాబు తరఫు న్యాయవాదులు వాదించారు. మోహన్ బాబుకు 2007లో భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ప్రదానం చేసింది. ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందానికి 2010లో పద్మశ్రీ అవార్డు వచ్చింది. హైకోర్టు తాజా తీర్పుపై మోహన్‌బాబు, బ్రహ్మానందం సుప్రీంకోర్టుకు వెళ్తారా, ఏం చేస్తారనేది ఇప్పుడే తెలియడం లేదు. అయితే సినిమా టైటిళ్లలో ‘పద్మశ్రీ’ని దుర్వినియోగం చేశారని హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పద్మశ్రీని వారు వెనక్కు ఇస్తే గౌరవంగా ఉంటుందని కూడా హైకోర్టు వ్యాఖ్యానించింది. పద్మశ్రీని వెనక్కు తీసుకునేలా ఆదేశించాలని బిజెపి నేత ఇంద్రసేనారెడ్డి కోర్టును కోరారు. దీనికిగాను ‘దేనికైనారెడీ’ సినిమా క్లిప్పింగ్‌ను పిటిషనర్ ఉదహరించారు. పేరుకు ముందు, వెనక పద్మశ్రీ ఉండటంపై ఇంద్రసేనారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టు నిబంధనలకు వ్యతిరేకంగా వారు సినిమా టైటిల్స్‌లో పద్మశ్రీని వాడుకున్నారని ఆయన తెలిపారు. పిటిషనర్ వాదనతో హైకోర్టు ఏకీభవించింది. మోహన్‌బాబు, బ్రహ్మానందంలపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.