అడుగడుగునా వివక్షకు గురయ్యాం
తుపాను బాధితులను ఆదుకునేందుకు ఆగమేఘాలు
వడగళ్ల బాధితులకు కడగళ్లేనా?
గవర్నర్‌ను కలిసిన టీఆర్‌ఎస్ నేతలు
హైదరాబాద్, మార్చి 7 (జనంసాక్షి) :
సమైక్య రాష్ట్రంలో అడుగడుగునా వివక్షను ఎదుర్కొన్నామని టీఆర్‌ఎస్‌తో పాటు వివిధ పార్టీల నాయకులు శుక్రవారం గవర్నర్‌కు వివరించారు. తుపాను బాధితులను ఆదుకునేందుకు ఆగమేఘాల మీద చర్యలు తీసుకున్న వలస పాలకులు తెలంగాణలో నష్టపోయిన వరంగల్ జిల్లా రైతాంగాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం కనీసం స్పందించలేదని ఫిర్యాదు చేశారు. వడగళ్ల వానతో సర్వం కోల్పోయిన తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాలని వారు గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. వడగళ్ల వర్షానికి అత్యధికంగా నష్టపోయిన జిల్లాలోని వడగళ్ల బాధితులను ఆదుకోవాలని రాష్ట్ర గవర్నర్‌ను కోరుతూ అన్ని పార్టీలు విజ్ఞప్తి చేశాయి. ప్రధానంగా వడగళ్లతో పత్తి, మిర్చి, మొక్కజొన్న, పుచ్చ, మామిడి, ఇతర తోటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని, పేదల ఇళ్లు దెబ్బతిన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీగా రైతులు నష్టపోయారు. కొద్ది రోజులనుంచి కురిసిన వడగళ్ల వానతో జిల్లాలో రైతులు పంట నష్టపోయారని, పేదలు ఇళ్లు కోల్పోయారని వరంగల్ ఎంపీ సిరిసిల్ల రాజయ్య పేర్కొన్నారు. సాధ్యమైనంత తొందరగా సంబంధిత అధికారులతో పంట నష్టాలపై సర్వే జరిపించాలని, బాధిత రైతులకు నష్ట పరిహారం అందజేయాలని కోరారు. వడగళ్లతో ఇల్లు దెబ్బతిన్న బాధితులకు ఐఏవై నుంచి పక్కాఇళ్లు మంజూరుచేయాలని, మరణించిన వారి కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని ఆయన చెప్పారు. అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జి.నాగయ్య కోరారు. జిల్లాలో మిరప, మొక్కజొన్న, పత్తి, వరి, కూరగాయలు, పండ్ల తోటలు.. మొత్తం లక్ష ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు. వరుసగా కురిసిన వర్షాలకు సుమారుగా రూ.200కోట్ల పంట నష్టం జరిగిందని తెలిపారు. నష్టపోయిన రైతుకు ఎకరాకు రూ.30వేలు, మృతుల కుటుంబాలకు రూ.10లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. క్షతగాత్రులకు రూ.50వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కూలిన ఇళ్ల స్థానంలో కొత్తవి నిర్మించాలని కోరారు. వడగండ్ల వర్షం జిల్లా రైతులను కొలుకోని విధంగా దెబ్బతీసిందని, ఈ దుస్థితిని జాతీయ విపత్తుగా ప్రకటించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి డిమాండ్ చేశారు ధ్వంసమైన వరి, మొక్కజొన్న పంటలను ఆయన పరిశీలించారు. వడగండ్ల తాకిడికి గాయాలై చికిత్స పొందుతూ ఐదుగురు కూలీలు మృతి చెందారన్నారు. పంటలు నాశనం కావటంతో ఇద్దరు కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం రూ. ఐదు లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కోరారు. పరిస్థితిని వివరించేందుకు గవర్నర్‌ను బిజెపి పక్షాన కలవనున్నట్లు తెలిపారు. టీఆర్‌ఎస్ జిల్లా నాయకులు కూడా గవర్నర్‌ను కలిసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.