పొత్తులు వద్దు, విలీనమొద్దు

డీకే అరుణపై అభ్యర్థిని ప్రకటిస్తారా?
సోనియా వల్లే తెలంగాణ : జానారెడ్డి
హైదరాబాద్‌, మార్చి 8 (జనంసాక్షి) :
కాంగ్రెస్‌ పార్టీలో ఏ పార్టీని వీలనం చేసుకోవద్దని, అలాగే ఎవరితోనూ ఎన్నికల్లో పొత్తులు వద్దని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు జానారెడ్డి అన్నారు. తెలంగాణ ఏర్పాటులో టీఆర్‌ఎస్‌ కంటే తమ పాత్రే పెద్దదని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్‌ ప్రజల్లో చిరస్థాయిగా నిలబడిపోయిందని అన్నారు. అందుకే తెలంగాలో తమకు తిరుగులేదని అన్నారు. తన నివాసంలో శనివారం జరిగిన తెలంగాణ కాంగ్రెస్‌ నేతల సమావేశం అనంతరం ఆయన విూడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తుకు వెంపర్లాడేది లేదని ఒంటరిగానే పోటీ చేస్తామని తెలిపారు. ఎన్నికల తర్వాత ఎవరి సత్తా ఏంటో తెలుస్తుందన్నారు. తెలంగాణలో ఒంటరిగా పోటీచేసి అధిక స్థానాలు గెలుచుకోవాలని శంఖం పూరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు తాము అధిష్టానానికి సూచిస్తామని అన్నారు. తాము ఎన్నో కష్టాలు, నష్టాలు ఓర్చి తెలంగాణ సాధించామన్నారు. కాంగ్రెస్‌ అధినేత్రిపై ఒత్తిడి పెంచి, ప్రజలు తమను దూరంపెట్టినా నియోజకవర్గాలకు వెళ్లకుండా కూడా పోరాడామన్నారు. కాంగ్రెస్‌ అధిష్టానం కూడా తమ ఒత్తిడిని, పోరాటాన్ని మన్నించి తెలంగాణ ఏర్పాటుచేసిందన్నారు. ఈ దశలో తమకే ప్రజాదరణ ఉందన్నారు. ఎవరు కలసి వస్తారనో ఇక తాము ఎదురు చూడమని, వెంపర్లాడమని ఆయన స్పష్టం చేశారు. ఆ అవసరంక కాంగ్రెస్‌ పార్టీకి లేదన్నారు. జానారెడ్డి నివాసంలో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు సమావేశమయ్యారు. ఇందులో పలువురు మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ప్రధానంగా, రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపైనే ఈ సమావేశంలో చర్చించారు. అయితే టీఆర్‌ఎస్తో పొత్తు విషయమై తెలంగాణ కాంగ్రెస్‌ నాయకుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. టీఆర్‌ఎస్‌తో పొత్తు అవసరం లేదని దక్షిణ తెలంగాణ ప్రాంత నాయకులు అంటుంటే.. మరోవైపు ఉత్తర తెలంగాణ ప్రాంత నాయకులు మాత్రం పొత్తు ఉంటేనే నయమని చెబుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉన్నందున టీఆర్‌ఎస్‌తో  పొత్తు అవసరమని మాజీ మంత్రులు, ఎంపీలు అభిప్రాయపడ్డారు. చివరికి ఎవరి పొత్తుతో సంబంధం లేకుండా ఒంటరిగానే పోరాడాలని నిర్ణయించారు. ఇవే అంశాలను జానారెడ్డి మీడియాకు వివరించారు. రాబోయే ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగాలని తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ నేతలు నిర్ణయించారని అన్నారు. పార్టీ ఆదేశిస్తే తప్ప విలీనం, పొత్తులు తమకు అవసరం లేదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌కున్న శక్తి, ధైర్యం వేరేవాళ్లకి లేదని, పొత్తులు, విలీనం అవసరమని తాము భావించటం లేదన్నారు. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ వల్లే తెలంగాణ వచ్చిందని జానారెడ్డి తెలిపారు. ప్రజల మనోభావాలను గుర్తించి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌కు ప్రజలు కృతజ్ఞత చూపించాలని ఆయన అన్నారు. ఒకటి, రెండు ఎంపీలున్న టీఆర్‌ఎస్‌, టీడీపీల వల్ల తెలంగాణ రాలేదని జానారెడ్డి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. విద్యార్థులు, యువత, వివిధ ప్రజా సంఘాలు తెలంగాణ ఏర్పాటు కోసం పోరాడాయన్నారు. వారికి అండగా ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులంతా కేంద్రంపై ఉద్యమించారన్నారు. అందువల్లే తెలంగాణ ఏర్పడిందని జానారెడ్డి తెలిపారు. తెలంగాణ పునర్‌ నిర్మాణం, సామాజిక తెలంగాణ కాంగ్రెస్‌తోనే సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ను  గెలిపించేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై తెలంగాణ కాంగ్రెస్‌ నేతలకు కాంగ్రెస్‌ అధిష్టానం పెద్దల మధ్య జానారెడ్డి సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. ఇద్దరు, ముగ్గురు పార్లమెంటు సభ్యులున్న వారు మరో ఇరవై ఏళ్లు ఉద్యమించినా తెలంగాణ వచ్చేది కాదని మాజీ మంత్రి, కాంగ్రెసు పార్టీ సీనియర్‌ నేత జానా రెడ్డి శనివారం తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖరరావును ఉద్దేశించి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో అందరి పాత్ర ఉన్నప్పటికీ, తమ పాత్ర అధికమన్నారు. తాము ఉద్యమించకుంటే వచ్చేదే కాదన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అనుకుంది కాబట్టే తెలంగాణ వచ్చిందన్నారు. తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెసు పార్టీని గెలిపించి ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి కానుకగా ఇవ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇద్దరు ముగ్గురు ఎంపీలున్న పార్టీకి తెలంగాణ తేవడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. తెలంగాణ కోసం కాంగ్రెసు చేసిన కృషి వెలకట్టలేనిదన్నారు. ఉద్యమంలో కాంగ్రెసు పార్టీ పాల్గొన్నదని చెబుతూ,ఎన్నికలలో గెలిచే సత్తా తమకు ఉందన్నారు. తెలంగాణ పునర్‌ నిర్మాణం, సామాజిక తెలంగాణ కాంగ్రెసు పార్టీతోనే సాధ్యమన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి విలీనమా లేక పొత్తా తాము పట్టించుకోమన్నారు. అధికారం కోసం తాము వెంపర్లాడటం లేదని చెప్పారు. పొత్తులపైన తమ దృష్టి లేదని, కాంగ్రెస్‌ ఒంటరిగా గెలుస్తుందని చెప్పారు. జానారెడ్డిని తెలంగాణ పీసీసీ అధ్యక్షులుగా చేయాలని తెలంగాణ డీసీసీ అద్యక్షులు అధిష్టానానికి లేఖ రాశారు. నీతి, నిజాయితి, సీనియర్‌ అయిన జానాకు అప్పగిస్తే పార్టీ గెలుపు ఖాయమని వారు పేర్కొన్నారు. పొత్తు వద్దని అధిష్టానానికి లేఖ తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తు వద్దని, ఒంటరిగా ఎన్నికలకు వెళ్దామని తెలంగాణ కాంగ్రెసు పార్టీ నేతలు అధిష్టానానికి లేఖ రాశారు.