కమల్‌నాథ్ కమిటీ పనితీరు బాగోలేదు
పునర్నిర్మాణంలో మేం కీలకం : దేవీప్రసాద్
హైదరాబాద్, ఏప్రిల్ 4 (జనంసాక్షి) :
రాష్ట్ర పునర్విభ జన నేపథ్యంలో ఉద్యోగుల పం పకం కోసం ని యమించిన కమలనాథన్ కమిటీ పనితీరు బాగోలేదని టీఎన్‌జీవోస్ అధ్యక్షుడు దేవిప్రసాద్ అన్నారు. ఆయన కమిటీ పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. శుక్రవారం నగరంలోని నిర్వహించిన మీట్ ది ప్రెస్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. కమిటీకి నిర్దేశించిన మార్గదర్శకాలు, విధి విధానాలు తమ డిమాండ్లకు వ్యతిరేకంగా ఉన్నాయని ఆయన చెప్పారు. స్థానికత ఆధారంగానే ఉద్యోగులు, పెన్షనర్ల విభజన జరగాల్సిందేనని, దీనిపై అన్ని రాజకీయ పార్టీలు స్పష్టమైన వైఖరి ప్రకటించాలని డిమాండ్ చేశారు. సీమాంధ్ర ఉద్యోగులకు ఆప్షన్లనిచ్చి తెలంగాణ ప్రాంతానికి అన్యాయం చేస్తే మరో పోరాటానికి తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. నాన్ లోకల్ కోటా కింద ఇక్కడ విధుల్లో చేరిన 70 వేల మంది సీమాంధ్ర ఉద్యోగులను వెనక్కి పంచించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అటెండరు నుంచి ఉన్నత స్థాయి అధికారుల వరకు తెలంగాణ వ్యక్తులే ఉండాలని, తెలంగాణ ఉద్యోగులే అధికార విధులు నిర్వర్తించాలని ఇక్కడి ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. తమకు వివిధ పార్టీల నుంచి ఆహ్వానాలు అందుతున్నాయని, కానీ పునర్నిర్మాణంలో కీలక భూమిక పోషించాలనే బాధ్యతాయుతమైన వైఖరితో రాజకీయాలకు దూరంగా ఉంటున్నామని అన్నారు. జూన్ 2 తర్వాత తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల ఒకరోజు వేతనాన్ని అమరవీరుల కుటుంబాలకు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా 21 అంశాలతో కూడిన టీఎన్‌జీవో ఎజెండాను ఆయన విడుదల చేశారు.