మన్మోహన్‌ బలహీనుడే


బ్యూరోక్రాట్‌ పరేఖా పుస్తకంలో వెల్లడి
న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 14 (జనంసాక్షి) :
సంజయ్‌ బారు పుస్తక ప్రహసనం ప్రజల ముందుకు వచ్చి రెండు రోజులు గడవక ముందే ప్రధానమంత్రి బలహీనతలను మరో మాజీ బ్యూరోక్రాట్‌ బహిర్గతం చేస్తున్నారు. బొగ్గు శాఖ కార్యదర్శి పి.సి.పరేఖ్‌ కోల్‌గేట్‌ కుంభకోణం గురించి రాసిన పుస్తకం మంగళవారం వెలువడనుంది. ప్రధానమంత్రిని పీఎంవో అధికారులు, ఇతర మంత్రులూ ఎంతమాత్రం పట్టించుకోలేదంటూ తన రచనలో పరాఖ్‌ వివరించారు. బొగ్గు కుంభకోణం యూపీయే హయాంలో జరిగిన పెద్ద కుంభకోణాల్లో ఒకటిగా మిగిలిపోయింది. కోల్‌ గేట్‌గా ప్రసిద్ధి చెందిన ఆ కుంభకోణం వెనుక ఏం జరిగిందో వివరిస్తూ బొగ్గు శాఖ కార్యదర్శిగా రిటైరైన పి.సి.పరేఖ్‌ ఒక పుస్తకం రాశారు. ప్రధాని కార్యాలయం అధికారులు, బొగ్గుశాఖ మంత్రులుగా చేసిన దాసరి నారాయణరావు, శిబూ సోరెన్‌ ఎలా మన్మోహన్‌ సింగ్‌ ఆదేశాలను ఎలా బుట్టదాఖలు చేశారో వివరించారు. క్రూసేడర్‌ ఆర్‌ కాన్‌స్పిరేటర్‌ – కోల్‌ గేట్‌ అండ్‌ అదర్‌ ట్రూత్స్‌ పేరిట రాసిన ఆ పుస్తకంలో చాలా సందర్బాల్లో ప్రధాని ఎలా నిస్సహాయుడిగా ఉండిపోయారో పరేఖ్‌ వివరించారు. తనకు రాజకీయ అధికారం ఏమాత్రం లేకుండా చేసిన ప్రభుత్వానికి ప్రధానమంత్రిగా కొనసాగడం మన్మోహన్‌ తప్పేనని పరాఖ్‌ భావించారు. వ్యక్తిగతంగా ఎంత మంచిపేరున్నా… టూజీ, బొగ్గు కుంభకోణాల తర్వాత మన్మోహన్‌సింగ్‌ వ్యక్తిత్వం దారుణంగా దెబ్బతిందని పరాఖ్‌ వ్యాఖ్యానించారు. పరాఖ్‌ కథనం ప్రకారం బొగ్గు బ్లాకుల కేటాయింపులకు కాంపిటీటివ్‌ బిడ్డింగ్‌ నిర్వహించాలన్న ప్రతిపాదనకు ప్రధానమంత్రి ఆమోదం తెలిపారు. కానీ పీఎంవో అధికారులు, బొగ్గు శాఖ సహాయమంత్రులుగా చేసిన దాసరి నారాయణరావు, శిబూసోరెన్‌ దానికి అడ్డుపడ్డారు. పరేఖ్‌ రిటైర్‌ అయేంత వరకూ ఆ ప్రతిపాదనను ఆలస్యం చేశారు.పరేఖ్‌ పదవీ విరమణ తర్వాత ఆ ప్రతిపాదనను చెత్తబుట్టలో పడేశారు. కానీ వారిని ప్రధానమంత్రి ఏ దశలోనూ అడ్డుకోలేక నిస్సహాయంగా ఉండిపోయారు.కాంపిటీటివ్‌ బిడ్డింగ్‌కి ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయంటూ మన్మోహన్‌ సింగ్‌ చెప్పడాన్ని పరేఖ్‌ తప్పుపట్టారు. కాంపిటీటివ్‌ బిడ్డింగ్‌ను నిలువరించడానికి ఆ పథకాన్ని సమూలంగా నాశనం చేయడానికీ….. దాసరి నారాయణరావు, శిబూసోరెన్‌ చేసిన ప్రయత్నాలను పరేఖ్‌ వివరించారు. మన్మోహన్‌ సింగ్‌ నిస్సహాయతపై పరాఖ్‌ జాలిపడ్డారు. తన ప్రభుత్వంలోనూ, పార్టీలోనూ ఉన్న కొందరు వ్యక్తుల స్వార్థ పూరిత చర్యలను అడ్డుకోలేకపోవడం దురదృష్టకరమని పరేఖ్‌ వ్యాఖ్యానించారు. సొంత మంత్రులే అవమానిస్తున్నా తన నిర్ణయాలను అమలు చేయకపోయినా… కొన్ని నిర్ణయాలను తిప్పికొట్టినా ప్రధాని ఎందుకు రాజీనామా చేయలేదోనని పరేఖ్‌ విస్మయ పడ్డారు. బొగ్గుశాఖ కార్యకలాపాల్లో ఎంతోమంది ఎంపీలు తలదూర్చి అధికారులపై దాడులు చేసేవారని పరాఖ్‌ వెల్లడించారు. అలాంటి సందర్భాల్లో కూడా ప్రధానమంత్రి నిస్సహాయంగా ఉండిపోవడాన్ని తప్పుపట్టారు. జాతి ప్రయోజనాల కోసమే రాజీనామా చేయకూడదని మన్మోహన్‌ భావించేవారట. ఐతే పీఎం ఎదుర్కొంటున్న పరిమితుల మధ్య బొగ్గుశాఖలో సంస్కరణలు అమలుచేయడం అసాధ్యమని తనకు స్పష్టంగా తెలిసిందన్నారు. బొగ్గుకుంభకోణంలో దేశానికి కలిగిన నష్టం కాగ్‌ చెప్పిన లక్షా 86వేల కోట్ల కన్నా చాలా ఎక్కువేనని పరాఖ్‌ స్పష్టం చేశారు. కాగ్‌ను స్వయంగా ప్రధానమంత్రే విమర్శించడాన్ని పరేఖ్‌ తప్పుపట్టారు.