తెలంగాణలో తొలి సర్కారు టీఆర్‌ఎస్సే
70-80 సీట్లు ఖాయం : ఈటెల
హైదరాబాద్, మే 14 (జనంసాక్షి) :
తెలంగాణలో తొలి సర్కారు తమ పార్టీనే ఏర్పాటు చేస్తుందని టీఆర్‌ఎస్ సీనియర్ నేత ఈటెల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో తెలంగాణ ప్రజల ఆత్మ ఆవిష్కృతమైందని.. సార్వత్రిక ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు పునరావృతం అవుతయని టీఆర్‌ఎస్ ధీమా వ్యక్తం చేసింది. తెలంగాణలో 70 నుంచి 80 అసెంబ్లీ స్థానాలు సాధించి టీఆర్‌ఎస్ సత్తా చాటబోతోందని ఆయన చెప్పారు. ఈ నెల 16న వచ్చే సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో అందరి అంచనాలు తలకిందులవుతాయన్నారు. తెలంగాణలో ఉన్న మంత్రుల్లో 80 మంది మంత్రులు మట్టికరబోతున్నారని జోస్యం చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల వెల్లడి అనంతరం బుధవారం టీఆర్‌ఎస్ భవన్‌లో ఈటెల విూడియాతో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్‌ఎస్ సత్తా చాటిందన్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించామని, సార్వత్రిక ఎన్నికల్లోనూ సత్తా చాటుతామన్నారు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ టీఆర్‌ఎస్ 70-80 సీట్లతో సత్తా చాటనుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
ప్రత్యర్థులకు చెంపపెట్టు..
తెలంగాణ ఉద్యమానికి పట్టు లేదని, టీఆర్‌ఎస్‌కు పార్టీ నిర్మాణం లేదని, ప్రజల మద్దతు లేదని అనేక రకాలుగా విమర్శలు చేశారని అయినా వాటన్నింటినీ తట్టుకొని నిలబడ్డామన్నారు. గత 13 ఏళ్ల కాలంలో ఉద్యమాన్ని నడిపిస్తూనే ఇటు రాజకీయంగా బలపడ్డామని చెప్పారు. మునిసిపాలిటీల ఫలితాల తర్వాత ప్రత్యర్థి పార్టీలు జబ్బలు చరిచాయని ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో టీఆర్‌ఎస్ సాధించిన ఫలితాలు ప్రత్యర్థులకు చెంపపెట్టు అని అన్నారు. ఈ ఫలితాలపై కాంగ్రెస్ స్పందించాలని డిమాండ్ చేశారు. గెలవగానే పొంగిపోవడం, ఓడిపోవడం తర్వాత కుంగిపోకూడదని హితవు పలికారు. మునిసిపాలిటీల్లో టీఆర్‌ఎస్ ఆశించిన స్థాయి కంటే ఎక్కువ ఫలితాలు వచ్చాయని, స్థానిక సంస్థల్లో ఏకపక్షంగా విజయం సాధించామన్నారు. మెజార్టీ ఎంపీపీలను గెలుచుకుంటామని, అలాగే 5-6 జిల్లా పరిషత్‌లపై కచ్చితంగా గులాబీ జెండా ఎగురుతుందని జోస్యం చెప్పారు.
మంత్రుల కోటలకు బీటలు
సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ మంత్రులు చాలా మంది ఓడిపోతున్నారని ఈటెల తెలిపారు. 80 శాతం మంది మంత్రులు మట్టికరవపోతున్నారని చెప్పారు. ఎవరైతే తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నం చేశారో, ఆంధ్ర నాయకులకు మోకారిల్లారో వారి కోటలు బీటలు వారబోతున్నాయని చెప్పారు. కచ్చితంగా 48 గంటల తర్వాత అసెంబ్లీ విూద గులాబీ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలే కథానాయకులై డబ్బు, మద్యానికి లొంగకుండా తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటారని తెలిపారు. ముమ్మాటికీ తెలంగాణ ప్రజలు కోరుకున్నట్లుగా టీఆర్‌ఎస్ గెలవబోతోందని జోస్యం చెప్పారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు టీఆర్‌ఎస్ ఎలాగైతే పాటుపడిందో బంగారు తెలంగాణ ఆవిష్కృతానికి అదే దీక్షతో పని చేస్తుందని ఆయన చెప్పారు. అన్ని వర్గాలకు ఇచ్చిన హావిూలను ఒక్కొక్కటిగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు. తమ జెండా, ఎజెండా తెలంగాణ ప్రజల అభివృద్ధేనని తెలిపారు. ఇదే విషయాన్ని తమ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ చెప్పారని, ఎక్కడ కూడా రాజకీయ పరమైన దోపిడీ ఉండదని చెప్పారు. ‘ప్రజలు ఆశించినట్లుగా బంగారు తెలంగాణ నిర్మాణం కాబోతోంది. టీఆర్‌ఎస్ ప్రజల సమస్యలను పరిష్కరించే విషయంలో గొప్పగా ఉంటుంది. టీఆర్‌ఎస్ శ్వాస, ధ్యాస ప్రజా సమస్యలపైనే ఉంటుంది. రాజకీయపరమైన దోపిడీ ఉండదని’ చెప్పారు. తమ ఎజెండా 28 రాష్ట్రాలకు భిన్నంగా ఉంటుందని ఆకలి కేకలు లేని తెలంగాణ సుసంపన్నమవుతుందన్నారు. ప్రజా సంక్షేమంతో పాటు పార్టీ నిర్మాణంపై దృష్టి సారిస్తామన్నారు.