కేంద్ర కేబినెట్‌పై మోడీ కసరత్తు
సీనియర్ నేత అద్వానీతో సమాలోచనలు
న్యూఢిల్లీ, మే 18 (జనంసాక్షి) :
కేంద్ర కేబినెట్ కూర్పుపై బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ కస రత్తు ప్రారంభించారు. ఇప్పటికే ఆర్‌ఎస్‌ఎస్
నేతలపై కేంద్ర కేబినెట్‌పై చర్చించిన మోడీ ఆదివారం పార్టీ అగ్రనేత ఎల్‌కే అద్వానీతో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. గంటపాటు సాగిన వీరి భేటీలో కేంద్ర కేబినెట్‌లోకి ఎవరెవరిని తీసుకోవాలి అనే అంశంపై చర్చించినట్లు తెలిసింది. బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్రమోడీని ప్రకటించడంపై తొలుత ఆగ్రహం వ్యక్తం చేసిన అద్వానీ ఆ తర్వాత పార్టీ ముఖ్య నాయకుల రాయబారాలతో మెత్తబడ్డారు. మోడీ నేతృత్వంలో సార్వత్రిక ఎన్నికలకు వెళ్లిన బీజేపీ దేశవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించింది. దాదాపు రెండున్నర దశాబ్దాల తర్వాత దేశంలో ఒక పార్టీకి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన సంపూర్ణ మెజార్టీ దక్కింది. బీజేపీకి సొంతగానే సర్కారు ఏర్పాటు చేసే బలమున్నా ఎన్‌డీఏలోని భాగస్వామ్య పక్షాలకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని బీజేపీ ముఖ్యనేతలు భావిస్తున్నారు.
ఈ విషయంలో మోడీ, అద్వానీతో చర్చించారు. బీజేపీ వద్ద ఏయే కీలకశాఖలు ఉంచుకోవాలి, భాగస్వామ్య పక్షాలకు ఏయే శాఖలు ఇవ్వాలని, బీజేపీ నుంచి ఎవరెవరెవరికి కేబినెట్ బెర్తులు కేటాయించాలి అనే అంశాలపై వారు చర్చించారు. బీజేపీ నాయకత్వం అద్వానీని లోక్‌సభ స్పీకర్‌గా నియమించే అవకాశమున్నట్టు మీడియాకు లీకులు ఇచ్చింది. రాష్ట్రపతి, ప్రధానమంత్రి తర్వాత దేశంలో మూడో అత్యుత్తమ పదవి అదే కావడంతో దీనిపైనా మోడీ అగ్రనేతతో చర్చించినట్టు సమాచారం. బీజేపీ సీనియర్ నేతలు వెంకయ్యనాయుడు, అరుణ్‌జైట్లీ, జాతీయాధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్, సుష్మాస్వరాజ్‌లకు కీలక పదవులు దక్కే అవకాశముంది. షానవాజ్ హుస్సేన్, అమేథిలో రాహుల్‌గాంధీపై పోటీ చేసి ఓడిపోయిన స్మృతి ఇరానీ తదితరులకు పదవులు దక్కనున్నాయి.