జెడ్పీ పీఠాలపై గులాబీ గుబాళింపు

COVER6

ఏడింటికి ఆరు కైవసం

చేజిక్కిన నల్లగొండ

కాంగ్రెస్‌కు నిరాశే మిగిల్చిన వరంగల్‌, మహబూబ్‌నగర్‌

హైదరాబాద్‌, జూలై 5 (జనంసాక్షి) :

జిల్లా పరిషత్‌ పీఠాలపై గులాబీ జెండా రెపరెపలాడింది. రాష్ట్రంలో కారు జోరు కొనసాగింది.. జిల్లా పరిషత్‌లలోనూ టీఆర్‌ఎస్‌ పాగా వేసింది.. నగర, పురపాలక సంస్థలు, మండల పరిషత్‌లలో మెజార్టీ స్థానాలు సొంతం చేసుకున్న అధికార పార్టీ జిల్లా పరిషత్‌ల పైనా గులాబీ జెండాను ఎగురవేసింది. మొత్తం ఎనిమిది జిల్లా పరిషత్‌లకు గాను ఆరింటిని తన ఖాతాలో వేసుకుంది. నల్లగొండ జడ్పీని కాంగ్రెస్‌ దక్కించుకొంది. కోర్టు వివాదాల కారణంగా ఖమ్మం జడ్పీ చైర్మన్‌ ఎన్నిక వాయిదా పడింది. కోరం లేకపోవడంతో రంగారెడ్డి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఎన్నిక వాయిదా పడింది. అత్యంత ఉత్కంఠగా మారిన మహబూబ్‌నగర్‌, వరంగల్‌ జడ్పీలతో పాటు ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, మెదక్‌ జడ్పీలను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. టీడీపీ మద్దతుతో వరంగల్‌, పాలమూరు, రంగారెడ్డి జిల్లా పరిషత్‌ చైర్మన్‌లను దక్కించుకోవాలనుకున్న కాంగ్రెస్‌ ఎత్తుగడ చిత్తయింది. టీఆర్‌ఎస్‌ వ్యూహాలకు ప్రతివ్యూహాలు రచించడంలో పూర్తిగా విఫలమైంది. ఫలితంగా జడ్పీలను చేజేతులా చేజార్చుకుంది. ఇక మూడు జిల్లాల్లో కీలక పాత్ర పోషించే స్థితిలో ఉన్న టీడీపీ అనూహ్యంగా చతికిలబడింది. కనీసం ఒక్క చోటైన అధికారం దక్కించుకోవాలని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కాంగ్రెస్‌తో కలిసి టీఆర్‌ఎస్‌కు చెక్‌ పెట్టాలని భావించిన తెలుగుదేశం.. చివరి నిమిషంలో వ్యూహాత్మక తప్పదం చేసింది. కనీసం డిప్యూటీ చైర్మన్‌ పదవి కూడా దక్కే అవకాశం లేకపోవడంతో వరంగల్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో ఓటింగ్‌కు దూరంగా ఉంది.

గుబాళించిన గులాబీ

తెలంగాణలోని 443 జడ్పీటీసీలకు గాను 69 జడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగతా వాటికి ఏప్రిల్‌ నెలలో రెండు విడతలుగా ఎన్నికలు జరిగాయి. మే 13న కౌంటింగ్‌ నిర్వహించగా.. టీఆర్‌ఎస్‌ 191 జడ్పీటీసీలు దక్కించుకోగా, కాంగ్రెస్‌ 176 జడ్పీటీసీలు కైవసం చేసుకున్నాయి. టీడీపీ 53, వైఎస్సార్‌సీపీ 6, బీజేపీ 4, సీపీఎం 2, సీపీఐ 2, బీఎస్పీ 1, స్వతంత్రులు 5 చోట్ల విజయం సాధించాయి. మొత్తం ఎనిమిది జిల్లా కార్పొరేషన్‌లకు గాను శనివారం ఏడు జడ్పీ చైర్మన్ల ఎన్నిక నిర్వహించారు. కోర్టు వివాదాల కారణంగా ఖమ్మం జిల్లా పరిషత్‌ ఎన్నిక వాయిదా పడింది. మిగిలిన ఎనిమిది జిల్లాల్లో ఆరింటిని టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకోగా.. కాంగ్రెస్‌ ఒక్క నల్లగొండ జడ్పీని దక్కించుకొంది.

ఇందూరు టీఆర్‌ఎస్‌ కైవసం..

నిజామాబాద్‌ జిల్లా జడ్పీపై గులాబీ జెండా రెపరెపలాడింది. జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా ఆ పార్టీ అభ్యర్థి దఫేదార్‌ రాజు  ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొత్తం 36 జడ్పీటీసీ స్థానాలకు గాను టీఆర్‌ఎస్‌ 24 చోట్ల విజయం సాధించి జడ్పీని కైవసం చేసుకుంది. అయితే, సంపూర్ణ మెజార్టీ ఉన్నప్పటికీ, చైర్మన్‌ పదవి కోసం ముగ్గురు అభ్యర్థులు పోటీ పడడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. చివరకు స్థానిక ఎంపీ కవిత జోక్యంతో దఫేదార్‌ రాజు పేరును పార్టీ నాయకత్వం ప్రకటించింది. దీంతో రాజు చైర్మన్‌గా ఎన్నికయ్యారు. డిప్యూటీ చైర్‌పర్సన్‌గా గడ్డం సుమనారెడ్డి కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీఆర్‌ఎస్‌కు స్పష్టమైన మెజార్టీ ఉండడంతో కాంగ్రెస్‌ చైర్మన్‌ పదవికి పోటీ కూడా చేయలేదు. దీంతో చైర్మన్‌, డిప్యూటీ చైర్మన్‌ ఎన్నిక ఏకగ్రీవమయ్యాయి.

కరీంనగర్‌లో కారు హవా..

కరీంనగర్‌ జిల్లాలో నగర, మునిసిపల్‌, మండల పరిషత్‌ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీఆర్‌ఎస్‌ జిల్లా పరిషత్‌ పీఠాన్ని సొంతం చేసుకుంది. మొత్తం 57 జడ్పీటీసీలు ఉండగా.. ఆ పార్టీ 42 మంది సభ్యుల బలంతో సునాయసంగా అధికారాన్ని చేజక్కించుకుంది. టీఆర్‌ఎస్‌ మహిళా అధ్యక్షురాలు తుల ఉమా (కథలాపూర్‌ జడ్పీటీసీ) జడ్పీ చైరపర్సన్‌గా ఎన్నికయ్యారు. వైస్‌ చైర్మన్‌గా తన్నీరు శరత్‌రావు ఎన్నికయ్యారు. ఆమెను ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌, ఎంపీలు వినోద్‌కుమార్‌, బాల్క సుమన్‌, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ తదితరులు అభినందించారు. జడ్పీ సమావేశ మందిరంలో ఘనంగా సత్కరించారు.

ఆదిలాబాద్‌లో కారు జోరు

ఆదిలాబాద్‌ జిల్లా పరిషత్‌నూ టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. జడ్పీటీసీ ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీ సాధించిన ఆ పార్టీ జడ్పీ పీఠాన్ని సొంతం చేసుకుంది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వలిగొండ శోభారాణి జడ్పీ చైర్‌పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైస్‌ చైర్మన్‌గా మూల రాజిరెడ్డి ఎన్నికయ్యారు. జిల్లాలో మొత్తం 52 జడ్పీటీసీ స్థానాలు ఉండగా టీఆర్‌ఎస్‌ 41 జడ్పీటీసీలను చేజిక్కించుకుంది. సాధారణ మెజార్టీ కంటే ఎక్కువ మంది సభ్యుల బలం ఉండడంతో ఆ పార్టీ సునాయసంగా అధికారాన్ని చేపట్టింది. సరైన బలం లేకపోవడంతో కాంగ్రెస్‌ చైర్మన్‌ పదవికి పోటీ కూడా చేయలేదు.

మెదక్‌లో ఏకగ్రీవం

మెదక్‌ జిల్లా పరిషత్‌ పీఠాన్ని గులాబీ పార్టీ హస్తగతం చేసుకుంది. ఆ పార్టీ అభ్యర్థి రాజమణి చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా మెదక్‌లో ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని కాంగ్రెస్‌ చేసిన యత్నాలు ఫలించలేదు. జిల్లాలోని 46 జడ్పీటీసీలకు గాను కాంగ్రెస్‌-21, టీఆర్‌ఎస్‌-21, టీడీపీ 4 స్థానాలను దక్కించుకున్నాయి. అయితే, తర్వాత జరిగిన పరిణామాల్లో కాంగ్రెస్‌ నుంచి ముగ్గురు, టీడీపీ నుంచి ఇద్దరు టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకోవడంతో ఆ పార్టీ సునాయసంగా జెడ్పీని కైవసం చేసుకోగలిగింది. మంత్రి హరీశ్‌రావు తదితరులు జెడ్పీ చైర్మన్‌గా ఎన్నిక రాజమణిని అభినందించారు.

నల్లగొండలో కాంగ్రెస్‌ పాగా..

వరుస ఓటములతో చిత్తయిన కాంగ్రెస్‌ పార్టీకి నల్లగొండ జిల్లా పరిషత్‌ పీఠాన్ని దక్కించుకోవడం ఒక్కటే ఊరట కలిగించే అంశం. జిల్లాలోని 59 జడ్పీటీసీలకు ఆ పార్టీ 41 సభ్యుల బలంతో తిరుగులేని ఆధిక్యాన్ని సంపాదించింది. అయితే, కాంగ్రెస్‌లో చీలిక తెచ్చి జడ్పీ పీఠాన్ని దక్కించుకోవాలని అధికార పార్టీ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా బాలూనాయక్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

వరంగల్‌లో అనూహ్య విజయం..

అత్యంత రసవత్తరంగా మారిన వరంగల్‌ జిల్లా పరిషత్‌ ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అనూహ్యంగా విజయం సాధించింది. అవసరమైన బలం లేకపోయినప్పటికీ అధికార పార్టీ కాంగ్రెస్‌, టీడీపీల మద్దతుతో పీఠాన్ని చేజిక్కించుకుంది. 28 మంది సభ్యుల మద్దుతుతో గద్దెల పద్మ జడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. డెప్యూటీ చైర్మన్‌గా శెట్‌పల్లి మురళీధర్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొత్తం 50 జడ్పీటీసీ స్థానాలు ఉండగా కాంగ్రెస్‌ 21, టీఆర్‌ఎస్‌ 14 ఎంపీటీసీలు గెలుపొందగా టీడీపీకి ఆరుగురు సభ్యుల బలం ఉంది. టీడీపీకి చెందిన ఆరుగురు సభ్యుల్లో నలుగురు, కాంగ్రెస్‌ నుంచి ఆరుగురు టీఆర్‌ఎస్‌ శిబిరంలో చేరారు. దీంతో జడ్పీ చైర్మన్‌ టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. అంతకు ముందు టీఆర్‌ఎస్‌ను నిలువరించేందుకు టీడీపీ-కాంగ్రెస్‌ ఏకం కావాలని తీవ్రంగా యత్నించాయి. కాంగ్రెస్‌కు మద్దతిచ్చి, డిప్యూటీ చైర్మన్‌ తీసుకోవాలని టీడీపీ భావించింది. అయితే, అనూహ్య పరిణామాల నేపథ్యంలో రెండు పార్టీలకు చెందిన జడ్పీటీసీలు గులాబీ జెండా కిందకు చేరడంతో జడ్పీ చైర్మన్‌ ఎన్నికను బహిష్కరిస్తున్నట్లు టీడీపీ ప్రకటించింది. మరోవైపు టీపీసీసీ చీఫ్‌ పొన్నాల లక్ష్మయ్యకూ మరోమారు పరాభవమే ఎదురైంది. సొంత జిల్లాలో జడ్పీ పీఠం దక్కించుకోవాలని భావించిన ఆయనకు పార్టీకి చెందిన జడ్పీటీసీలు జలక్‌ ఇచ్చారు. ఆరుగురు టీఆర్‌ఎస్‌ గూటికి చేరడంతో పొన్నాల యత్నాలకు గండిపడింది.

మహబూబ్‌నగర్‌పైనా గులాబీ జెండా

మహబూబ్‌నగర్‌ జిల్లా పరిషత్‌నూ టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. పీఠం చేజిక్కించుకోవాలని చేసిన కాంగ్రెస్‌ యత్నాలు విఫలమయ్యాయి. మాజీ మంత్రి, ఎమ్మెల్యే డీకే అరుణ ఎత్తుగడలను తిప్పికొడుతూ టీఆర్‌ఎస్‌ జిల్లా పరిషత్‌ను సొంతం చేసుకుంది. జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా బండారి భాస్కర్‌ ఎన్నికయ్యారు. మొత్తం 64 జడ్పీటీసీలకు గాను ఏ పార్టీకి సరిపడా మెజార్టీ లేదు. టీఆర్‌ఎస్‌ కంటే కాంగ్రెస్‌కే ఎక్కువ మంది సభ్యుల (28) బలం ఉంది. అయితే, ఇక్కడ టీడీపీ మద్దతు కీలకంగా మారింది. టీడీపీ మద్దతుతో జడ్పీ గిరిని దక్కించుకోవాలని కాంగ్రెస్‌ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మరోవైపు జడ్పీ చైర్మన్‌ ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్‌కు చెందిన ఏడుగురు గైర్హాజరయ్యారు. కాంగ్రెస్‌, టీడీపీలను చీల్చీ టీఆర్‌ఎస్‌ అధికారం చేపట్టింది. టీఆర్‌ఎస్‌కు ముగ్గురు టీడీపీ, ఇద్దరు బీజేపీ సభ్యులు మద్దతు పలకడంతో భాస్కర్‌ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. అత్యధిక సభ్యులున్నా మహబూబ్‌నగర్‌ జడ్పీని చేజిక్కించుకోవడంలో హస్తం పార్టీ చిత్తయింది. అంతకుముందు జడ్పీ చైర్మన్‌ ఎన్నిక సందర్భంగా తీవ్ర వాగ్వాదం ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ మంత్రి డీకే అరుణ, టీఆర్‌ఎస్‌ నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. చివరకు నాటకీయ పరిణామాల మధ్య ఎన్నిక ముగిసింది.

రంగారెడ్డి జడ్పీ ఎన్నిక వాయిదా

రంగారెడ్డి జిల్లాలో ¬రా¬రీ పోరు నెలకొంది. కోరం లేకపోవడంతో జిల్లా పరిషత్‌ ఎన్నిక వాయిదా పడింది. జిల్లాలో మొత్తం 33 జడ్పీటీసీ స్థానాలు ఉండగా కాంగ్రెస్‌ 14, టీఆర్‌ఎస్‌ 12, టీడీపీకి 7 స్థానాలు దక్కాయి. ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాకపోవడంతో సందిగ్ధత నెలకొంది. టీఆర్‌ఎస్‌కు చెక్‌ చెప్పేందుకు టీడీపీ, కాంగ్రెస్‌ ఒక్కటి కావాలని నిర్ణయించాయి. చెరో రెండున్నరేళ్లు అధికారాన్ని పంచుకోవాలని భావించాయి. అయితే, చివరి క్షణంలో రెండు పార్టీల మధ్య అవగాహన కుదరడం, అప్పటికే సమయం మించిపోవడంతో ఎన్నిక వాయిదా తప్పలేదు. రంగారెడ్డి జిల్లా జడ్పీ ఇచ్చేందుకు కాంగ్రెస్‌ సుముఖత వ్యక్తం చేసిందని ఎర్రబెల్లి దయాకరరావు తెలిపారు. కాంగ్రెస్‌ నుంచి సమాచారం ఆలస్యంగా రావడంతో ఎన్నిక వాయిదా పడిందన్నారు.