మాసాయిపేటలో మృత్యుశకటం

COVER25C1C3C5C4

16 మంది చిన్నారులు మృతి

చిదిమేసిన స్వప్నం

ఆరిపోయిన ఆశాజ్యోతులు

బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యం.. కాపలా లేకపోవడం.. పసిమొగ్గలకు శాపం

గాయపడ్డ 21 మంది

విద్యార్థులకు యశోదలో చికిత్స

క్షతగాత్రులకు సీఎం కేసీఆర్‌ పరామర్శ

మృతుల కుటుంబాలకు రూ.7 లక్షల ఎక్స్‌గ్రేషియా

గుండె ఆగిన తండ్రి

ప్రధాని దిగ్భ్రాంతి

పార్లమెంట్‌లో రైల్వే మంత్రి ప్రకటన

రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియాపై ఎంపీ జితేందర్‌రెడ్డి అభ్యంతరం

మెదక్‌/హైదరాబాద్‌, జూలై 24 (జనంసాక్షి) :

ఆశల దీపాలు ఆరిపోయాయి. స్వప్న సౌధాలు ధ్వంసమయ్యాయి. చిట్టి చేతులు చలనాన్ని కోల్పోయాయి. చిరునవ్వులు మూగబోయాయి. చిట్టిపొట్టి పలుకులు.. కేరింతలు.. తుళ్లింతలు ఆ ఇళ్లల్లో కానరావు. పెను ప్రమాదం ఆ కుటుంబాల్లో చెరిపేయలేని పెను దు:ఖాన్ని మిగిల్చింది. ప్రభుత్వం, విద్యాసంస్థ నిర్లక్ష్యం 16 కుటుంబాల్లో తీరని శోఖాన్ని నింపింది. మరో 21 కుటుంబాల్లో తీరని వేదనమిగిల్చింది. చిరనవ్వులతో స్కూలు బస్సెక్కిన చిన్నారులు కానరాని లోకాలకు వెళ్లిపోయారు. మృత్యువు రూపంలో దూసుకొచ్చిన నాందెడ్‌ ప్యాసెంజర్‌ రైలు స్కూలు బస్సును ఢీకొట్టింది. దాదాపు కిలోమీటర్‌ దూరం ఈడ్చుకెళ్లడంతో విద్యార్థుల శరీరాలు మాంసపు ముద్దలుగా మారాయి. అక్కడికక్కడే 13 మంది మృతి చెందగా చికిత్స పొందుతూ ఏడుగురు మృత్యువాత పడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు స్పందించి ఉంటే.. సమయానికి సహాయక చర్యలు అంది ఉంటే మృతుల సంఖ్య ఇంతగా ఉండేది కాదు. దాదాపు గంటన్నర పాటు అక్కడికి అంబులెన్స్‌లు చేరుకోలేదు. విషయం తెలిసి తరలివచ్చిన స్థానికులే బస్సులో చిక్కుకున్న పిల్లలను బయటకు తీశారు. వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. తెలంగాణ ప్రభుత్వం సత్వరమే స్పందించింది. సహాయక చర్యలను ముమ్మరం చేయడంతో పాటు గాయపడిన వారిని మెరుగైన వైద్యం అందించేందుకు యశోద ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించాలని మంత్రులు హరీశ్‌రావు, పద్మారావు, జగదీశ్‌రెడ్డి, మహేందర్‌రెడ్డిలను ఆదేశించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ శర్మ, డీజీపీ అనురాగ్‌ శర్మలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రమాదంపై కేసీఆర్‌ విచారణకు ఆదేశించారు. ప్రమాదానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

అక్కడికక్కడే 13 మంది మృతి

మెదక్‌ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద గురువారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. పాఠశాల బస్సును రైలు ఢీకొనడంతో 13 మంది చిన్నారులు మృత్యువాత పడ్డారు. 38 మంది చిన్నారులతో బయల్దేరిన బస్సు మాసాయిపేట రైల్వే లెవెల్‌ క్రాసింగ్‌ వద్దకు చేరుకుంది. ఇదే సమయంలో వేగంగా దూసుకొచ్చిన నాందేడ్‌ ప్యాసెంజర్‌ రైలు బస్సును ఢీకొట్టింది. దాదాపు కిలోవిూటర్‌ మేర బస్సును ఈడ్చుకెళ్లింది. 13 మంది విద్యార్థులు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మరో ఏడుగురు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో, చికిత్సపొందుతూ కన్నుమూశారు. మృతదేహాలన్నీ చెల్లాచెదురయ్యాయి. ఘటనా స్థలంలో 13మంది, చికిత్స పొందుతూ ఏడుగురు మృత్యువాత పడ్డారు. 15 మందికి తీవ్ర గాయాలు కాగా.. ముగ్గురు చిన్నారులు సురక్షితంగా బయటపడ్డారు. తీవ్రంగా గాయపడిన వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. తొలుత కొంపల్లిలోని బాలాజీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తరలించారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. యశోదా ఆస్పత్రిలో మొత్తం 21 మంది విద్యార్థులు చికిత్స పొందుతున్నారు.

అంతులేని నిర్లక్ష్యం..

తూప్రాన్‌కు చెందిన కాకతీయ టెక్నో స్కూల్‌లో చుట్టుపక్కల గ్రామాల విద్యార్థులు చదువుతున్నారు. వారు రోజూ ఉదయం బస్సులో స్కూలుకెళ్లి, సాయంత్రం తిరిగివస్తుంటారు. రోజులాగే గురువారం ఉదయం కూడా బయల్దేరారు. బస్సు ఇస్లాంపూర్‌ నుంచి మాసాయిపేట రైల్వే గేటు వద్దకు చేరుకోగానే.. వేగంగా వచ్చిన రైలు ఢీకొట్టింది. రైల్వే లెవెల్‌ క్రాసింగ్‌ వద్ద గేటు లేకపోవడం, కాపలా లేకపోవడం వల్లే ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. రైల్వే అధికారుల నిర్లక్ష్యం, బస్సు డ్రైవర్‌ అలక్ష్యం అభం శుభం తెలియని పసిపిల్లల ప్రాణాలను బలిగొంది. గేటు ఏర్పాటు చేయాలని చాలారోజులుగా స్థానికులు మొర పెట్టుకుంటున్నా.. రైల్వే అధికారులు స్పందించ లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గేట్లు ఏర్పాటు చేసి ఉంటే ఇప్పుడీ ప్రమాదం జరిగేదే కాదని మండిపడ్డారు. చిన్నారుల మృతికి ఎవరూ బాధ్యత వహిస్తారని వారు ప్రశ్నించారు.

చెల్లాచెదురుగా మృతదేహాలు

ప్రమాద స్థలంలో భయంకర పరిస్థితి నెలకొంది. బస్సు నుజ్జునుజ్జు కాగా.. విసిరేసినట్లుగా మృతదేహాలు పడిపోయాయి. దాదాపు రెండు విూటర్ల దూరంలో మృతదేహాలు పడి ఉన్నాయి. వేగంగా వచ్చి ఢీకొట్టడంతో చిన్నారుల లేలేత శరీరాలు నుజ్జునుజ్జయ్యాయి. తనువులు మాంసపు ముద్దలుగా మారాయి.  మల్లెపూవుల్లాంటి తెలుపు దుస్తులు రక్తంతో పూర్తిగా ఎరుపెక్కాయి. స్కూల్‌ బ్యాగులు, పుస్తకాలు చెల్లాచెదురయ్యాయి. ఎంతో ప్రేమతో అమ్మ పెట్టిన టిఫిన్‌ బాక్స్‌లు, వాటర్‌ బాటిళ్లు దూరంగా ఎగిరిపడ్డాయి. వేడి వేడి అన్నం ఇంకా చల్లారకముందే.. గమ్యస్థానం చేరుకోక ముందే.. చిన్నారులు చిదిమి’పోయారు’. విగతజీవిలుగా మారారు.

కన్నీటి సంద్రం

తల్లిదండ్రుల రోదనతో ఆ ప్రాంతం కన్నీటి సంద్రమైంది. టాటా.. బైబై.. అంటూ బస్సెక్కిన పిల్లలు విగత జీవులుగా మారడంపై తల్లిదండ్రులు షాక్‌ చెందారు. అప్పటివరకూ కళ్ల ముందు ఉత్సాహంగా తిరిగిన చిన్నారులు మాంసపు ముద్దలుగా మారడం చూసి దిగ్భాంతికి గురయ్యారు. రక్తపు మడుగులో తమ పిల్లలను చూసి కన్నీరుమున్నీరయ్యారు. ఉత్సాహంగా బయల్దేరిన చిన్నారులు ఇలా అర్ధంతరంగా తనువు చాలించడంపై కన్నవారు బంధువులు రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. అక్కడి పరిస్తితి ప్రతీ ఒక్కరి హృదయాలను కదిలించింది.

క్షణాల్లోనే ఈ ఘోరం జరిగిపోయింది. ప్రమాదస్థలిలో మరుభూమిని తలపించే దృశ్యాలే.. ఎవరినీ కదిలించినా కన్నీటి రోదనలే.. పెదవి పెగలడం లేదు.. కన్నీళ్లు తప్పా మాటలు బయటకు రావడం లేదు. విసిరి పాడేసినట్లు, మాంసపు ముద్దలుగా మారిన తనువులు అంతులేని నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యాలు.. నుజ్జునుజ్జయిన బస్సులో చిక్కి బిక్కుబిక్కుమంటూ చూస్తున్న బాలుడు.. ఇనుప ముక్కల నడుమ నలిగిపోయిన ఓ చిన్నారి.. నోట్లోంచి రక్తం ఓడుతూ మృత్యువుతో పోరాడుతున్న విద్యార్థి.. తల పగిలి తల్లడిల్లుతున్న మరో పాప.. ఇదీ ఘటనా స్థలంలో కనిపించిన విషాదరకర దృశ్యం.. కళ్ల వెంట నీరు పెట్టించే హృదయ విదారక చిత్రం.

విషాద ఛాయలు..

ప్రమాద స్థలంలో అంతులేని విషాదం నెలకొంది. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లు, మృత్యువాత చెందడంతో వారి కుటుంబాల్లో దిగ్భ్రాంతి నెలకొంది. అప్పుడే చిట్టిపొట్టి మాటలు చెప్పి బస్సెక్కిన చిన్నారి అచేతనంగా పడి ఉండడం చూసి తల్లి తల్లడిల్లిన తీరు చూసే వారిని కన్నీరు పెట్టించింది. మారాం చేసినా బలవంతంగా బస్సు ఎక్కించానని రోదిస్తున్న తల్లి ఓవైపు.. ఇష్టమైన కూర వండి టిఫిన్‌ పెట్టించానంటూ బోరున విలపిస్తున్న ఓ అమ్మ మరోవైపు.. నవ్వుతూ వీడ్కోలు చెబుతూ బస్సు ఎక్కిన కూతురు తుది వీడ్కోలు తీసుకుందని కన్నీరుమున్నీరైన మరో కన్నతల్లి.. ఇదీ సంఘటనా స్థలంలో కనిపించిన హృదయవిదారక దృశ్యాలు.. గుండెలు పిండేసే విషాద ఛాయలు..

కన్నుమూసిన తోబుట్టువులు..

ఒకే కుటుంబానికి చెందిన తోబుట్టువులు చనిపోవడంతో వారి కుటుంబాల్లో అంతులేని విషాదం నెలకొంది. అక్కాతమ్ముడు, అన్నాచెల్లెళ్లు మృత్యువాత పడడంతో వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. షాక్‌తో కుప్పకూలిపోయారు. మృతుల వివరాలు ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు.. ఇస్లాంపూర్‌కు చెందిన భువన, విష్ణు, చింతల సుమన్‌, గొల్ల మహేశ్‌, వంశీ, కిష్టాపూర్‌కు చెందిన అక్కాతమ్ముడు రజియా, వహీద్‌, గుండేటిపల్లికి చెందిన అన్నాతమ్ముడు చింతల చరణ్‌, చింతల దివ్య, విద్య, వెంకటాయపల్లి వరుణ్‌, శృతి, బస్సు డ్రైవర్‌ భిక్షపతి, క్లీనర్‌ ధనుష్‌కోటి మృత్యువాత పడ్డారు. కిష్టాపూర్‌కు చెందిన అక్కాతమ్ముడు రజీయా, వజీద్‌ మృత్యువాత పడడంతో వారి తండ్రి గుండెపోటుతో కుప్పకూలిపోయాడు.

గంటన్నర తర్వాత సహాయక చర్యలు

సహాయక చర్యల్లోనూ అంతులేని నిర్లక్ష్యం కనిపించింది. ప్రమాదం జరిగిన తర్వాతా అధికారుల్లోనూ హుటాహుటిన స్పందన కనిపించలేదు. ఉదయం 9 గంటల సమయంలో ప్రమాదం జరిగితే 10.30 గంటల తర్వాత కానీ సహాయక చర్యలు ప్రారంభం కాలేదు. ప్రమాదాన్ని ప్రత్యక్షంగా చూసిన వారు హుటాహుటిన 108కు, రైల్వేశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. కానీ, అధికారులు, అంబులెన్స్‌లు రావడానికి గంటకు పైగా సమయం పట్టింది. దీంతో స్థానికులే సహాయక చర్యలకు ఉపక్రమించారు. అప్పటికే అక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకున్న చుట్టుపక్కల గ్రామాల వారు.. సహాయక చర్యల్లో పాల్గొన్నారు. స్వయంగా జేసీబీలను తెప్పించి బస్సులో చిక్కుకున్న విద్యార్థులను బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన చిన్నారులను హుటాహుటిన హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. గంటన్నర తర్వాత తీరిగ్గా రైల్వే అధికారులు అక్కడికి చేరుకోవడంపై స్థానికులు, విద్యార్థి సంఘాలు మండిపడ్డాయి. రైల్వే శాఖ నిర్లక్ష్యం వల్లే 20 మంది బలైపోయారని నిలదీశారు.

నిర్మానుష్య ప్రాంతం కావడంతో వినిపించని పిల్లల అరుపులు

గంటన్నర వరకు సమాచారం కరువు

మెదక్‌ జిల్లాలో రైలు ప్రమాదం సంభవించిన మాసాయిపేట చాలా నిర్మానుష్యమైన ప్రాంతం కావడంతో దాదాపు గంటన్నర సేపు ఎవరికీ పిల్లల ఆర్తనాదాలు వినిపించలేదు. వీరి ఆర్తనాదాలు వినిపించకపోవడంతో సహాయక చర్యలు చేపట్టడంలో ఆలస్యం అయినట్లు తెలుస్తోంది. పిల్లల్లో చాలామందికి చేతులు విరిగి. కాళ్లు మెలి తిరిగిపోయి పరిస్థితి అంతా హృదయవిదారకంగా మారింది. పిల్లల అరుపులు ఆగిపోయి శోషతో పడిపోయారు.  బాధితులంతా 5 నుంచి 12 సంవత్సరాల లోపువారేనని మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి తెలిపారు. ప్రతిరోజూ ఇదే ప్రాంతం విూదుగా బస్సు వెళ్తుందని, కానీ లెవెల్‌ క్రాసింగ్‌ వద్ద గేటు మాత్రం ఏర్పాటు చేయట్లేదని ఆయన అన్నారు. విధులకు ఆలస్యంగా వచ్చిన డ్రైవర్‌.. తొందరగా వెళ్లాలనే హడావుడిలో రైలు వచ్చేలోగానే ట్రాక్‌ దాటి వెళ్లిపోవాలనుకున్నాడని, ఈలోపు బస్సు అక్కడ ఇరుక్కుపోయి ఇంజన్‌ ఆగిపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మళ్లీ అతడు ఇంజన్‌ స్టార్ట్‌ చేసేలోపే రైలు వచ్చి బస్సును ఢీకొందని అన్నారు. అసలు బస్సుతో పాటు వచ్చినది కాకతీయ స్కూలు డ్రైవరేనా లేదా ఎవరైనా ప్రైవేటు డ్రైవర్‌ వచ్చారా అన్న విషయం కూడా ఇంకా నిర్ధారణ కాలేదు. డ్రైవర్‌ ఏమాత్రం అప్రమత్తంగా వ్యవహరించినా ఇంత ఘోర ప్రమాదం జరిగి ఉండేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే డ్రైవర్‌ ఆ సమయంలో ఫోన్‌లో మాట్లాడుతున్నారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

తల్లిదండ్రుల రోదనలు

బస్సు ప్రమాదంలో మరణించిన చిన్నారుల తల్లిదండ్రుల రోదనలతో ఘటనా స్థలం ¬రెత్తింది. ఘటనా స్థలంలోనే  తల్లితండ్రులు స్పృహ తప్పి పడిపోయారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారులంతా 7వ తరగతి లోపువారేనని సమాచారం. ప్రమాద సమయంలో బస్సులో 38మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నారు. మెదక్‌ జిల్లా వెల్దుర్థి మండలం మాసాయిపేటలో వద్ద లెవెల్‌ క్రాసింగ్‌ గేట్‌ వద్ద జరిగిన ప్రమాదంలో 20 మంది విద్యార్థులు మృతి చెందడంతో తమ పిల్లల ఆచాఊకీ కోసం వారు పడ్డ వేదన వర్ణనాతీతం.

రెగ్యులర్‌ డ్రైవర్‌ కాదు

ఎప్పుడూ వచ్చే బస్సు డ్రైవర్‌ విధుల్లోకి రాకపోవటంతో అతని స్థానంలో విద్యార్థులను తీసుకు వచ్చేందుకు స్కూల్‌ యాజమాన్యం  స్థానికంగా ఉన్న ఓ ట్రాక్టర్‌ డ్రైవర్‌ను పంపించినట్లు సమాచారం. భిక్షపతి అనే ఈ డ్రైవర్‌ తొందరగా వెళ్లాలన్న  మడావిడిలో బస్సును తోలడంతో ఈ దుర్ఘటన జరిగిందని తెలుస్తోంది. దీనికితోడు ఆ సమయంలో అతను ఫోన్‌ మాట్లాడుతున్నాడని సమాచారం. బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు చెబుతున్నారు. రైలు రాదనే ధీమాతో డ్రైవర్‌ భిక్షపతి బస్సును ముందుకు తీసుకు వెళ్లినట్లు తెలుస్తోంది.ప్రమాదం జరిగినప్పుడు బస్సులో మొత్తం 38 మంది ఉన్నారు. వారిలో 13 మంది అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడి పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ మరో ఏడుగురు ప్రాణాలు విడిచారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాగా ఈ సంఘటన నుంచి కేవలం ముగ్గురు చిన్నారులు మాత్రమే సురక్షితంగా బయట పడ్డారు.

గ్రామస్తుల ఆగ్రహం

జిల్లాలో జరిగిన రైలు ప్రమాదంలో మాసాయిపల్లి గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామస్తులు రహదారిని దిగ్బంధించడంతో దాదాపు మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ స్తంభించింది. గురువారం ఉదయం వెల్దుర్తి మండలం మాసాయిపల్లి వద్ద పాఠశాల బస్సును రైలు ఢీకొన్న ఘటనలో 25 మంది మృతి చెందిన ఘటన గ్రామస్థులను తీవ్రంగా కలచివేసింది. దీనికి రైల్వే అధికారులదు బాధ్యతన్నారు. రైల్వే గేట్‌ వద్ద ప్రమాదం జరిగిందనే సమాచారం అందిన వెంటనే భారీ సంఖ్యలో ప్రజలు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. దాంతో 44వ జాతీయ రహదారి వద్ద ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. సుమారు 5 కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్‌ స్తంభించింది. పలుమార్లు అధికారులకు విజ్ఞప్తి చేసినా పట్టించకోక పోవడంపై అధికారులను నిలదీశారు. ప్రమాద స్థలానికి చేరుకున్న రైల్వే అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. ప్రమాద ఘటనపై కారణమైన అధికారుల నిర్లక్ష్యంపై నిరసన వ్యక్తం చేస్తూ స్థానికులు రాస్తారోకో నిర్వహించారు. రైలు ఢీకొన్న ప్రమాద స్థలం వద్ద స్థానికులు ఆందోళనకు దిగారు. ఘటనాస్థలంలో రైల్వే అధికారులను అడ్డుకుని నిరసన తెలిపారు. ప్రమాదం స్థలం పక్కనే ఉన్న నేషనల్‌ హైవేపై ధర్నాకు దిగడంతో అటు, ఇటూ ఐదు కిలోవిూటర్ల మేర ట్రాఫిక్‌ స్తంభించింది. పరిసర గ్రామాల నుంచి వేలాది మంది ప్రమాదస్థలానికి చేరుకుంటున్నారు.

ఆలస్యమే అసలు కారణం

రోజూ సమయానికి వచ్చే నాందేడ్‌ ప్యాసెంజర్‌ రైలు ఆలస్యం కావడం.. పసిమొగ్గల ప్రాణాల మీదకు తెచ్చింది. నిర్ణీత సమయానికి రైలు ప్రయాణం సాగి ఉంటే.. ఈ దుర్ఘటన జరిగేదే కాదు. నిర్ణీత షెడ్యూల్‌ కంటే రైలు నాలుగు గంటలు ఆలస్యమైంది. ఆ సమయంలో రైలు వచ్చే అవకాశం లేదని భావించిన డ్రైవర్‌ బస్సును పట్టాలపైకి తేవడం, అదే సమయంలో రైలు వచ్చి ఢీకొట్టడంతో ఘోరం జరిగిపోయింది. మరోవైపు బస్సు డ్రైవర్‌ కూడా విధులకు ఆలస్యంగా రావడం కూడా ప్రమాదానికి కారణమైంది. కాకతీయ టెక్నో స్కూల్‌ బస్సు రోజులాగే బయల్దేరింది. డ్రైవర్‌ ఆలస్యంగా రావడం, సమయానికి పిల్లలను స్కూలుకు చేర్చాలన్న ఉద్దేశ్యంతో డ్రైవర్‌ భిక్షపతి వేగంగా బస్సును నడిపించారు. అయితే, రైలు వచ్చే లోపు గేటు దాటి వెళ్లొచ్చని భావించి ట్రాక్‌పైకి రావడం, అదే సమయంలో రైలు వచ్చి ఢీకొట్టడం క్షణాల్లో జరిగిపోయింది. లెవెల్‌ గేటు వద్దకు రాగానే రైలు వస్తున్నట్లు గమనించిన డ్రైవర్‌.. రైలు వచ్చే లోపు ట్రాక్‌ దాటి వెళ్లిపోవాలని అనుకున్నాడని.. ఈలోపు బస్సు అక్కడ ఇరుక్కుపోయి ఇంజిన్‌ ఆగిపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మళ్లీ అతడు ఇంజిన్‌ స్టార్ట్‌ చేసేలోపు రైలు వచ్చి బస్సును ఢీకొట్టిందని చెప్పారు. మరోవైపు, రెగ్యులర్‌ డ్రైవర్‌ కాకుండా గురువారం కొత్త డ్రైవర్‌ వచ్చాడని బాధితులు తెలిపారు. రెగ్యులర్‌ డ్రైవర్‌ రాకపోవడంతో భిక్షపతిని పంపించినట్లు తెలుస్తోంది. అతనికి బదులు రెగ్యులర్‌ డ్రైవర్‌ వచ్చి ఉంటే ప్రమాదం జరగకపోయేదని తల్లిదండ్రులు బోరున విలపించారు.

ఘటనా స్థలంలో ఉద్రిక్తత

మాసాయిపేట రైలు దుర్ఘటన ప్రాంతం అంతులేని ఆవేదనకు, ఆగ్రహావేశాలకు వేదికగా మారింది. ఉదయం ప్రమాదం జరిగిన నుంచి ఆ ప్రాంతమంతా అరణ్య రోదనతో మార్మోగింది. చిన్నారుల అరుపులు, ఆర్తనాదాలతో దద్దరిల్లింది. ప్రమాద విషయం తెలిసి అక్కడకు తల్లిదండ్రుల రోదనలతో ఘటనా స్థలం కన్నీటి సంద్రమైంది. విషాదకర, గంభీర వాతావరణం నెలకొంది. మృతి చెందిన చిన్నారులను చూసి తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు. ఆ ప్రాంతమంతా హృదయవిదారకంగా మారిపోయింది. మరోవైపు అక్కడికి చేరుకున్న వేలాది మందితో ఘటనా స్థలం కిక్కిరిసిపోయింది. జాతీయ రహదారి నెంబర్‌ 44 పూర్తిగా స్తంభించింది. దాదాపు ఐదు కిలోవిూటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ప్రమాదానికి కారణమైన రైల్వే శాఖ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ప్రజలు, విద్యార్థి సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. రాకపోకలను

నిలిపివేశారు. సహాయక చర్యలను చేపట్టడానికి వచ్చిన రైల్వే అధికారులను అడ్డుకున్నారు.

రూ.5 లక్షల పరిహారం : హరీశ్‌రావు

బాధిత కుటుంబాలను తప్పకుండా ఆదుకుంటామని హరీశ్‌రావు ఈ సందర్భంగా ప్రకటించారు. మృతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు వెల్లడించారు. అలాగే క్షతగాత్రుల వైద్యానికి అయ్యే ఖర్చును కూడా ప్రభుత్వమే భరిస్తుందన్నారు. వారం రోజుల్లో రైల్వే గేటు ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. ప్రమాదానికి రైల్వే నిర్లక్ష్యమే కారణమని హరీశ్‌రావు స్పష్టం చేశారు. ఘటనకు పూర్తి బాధ్యత రైల్వేదేనని రైల్వే గేటు పెట్టమని స్థానికులు చాలాసార్లు మొత్తుకున్నా వినిపించుకోలేదని మండిపడ్డారు. కాపలా ఉంచినా ప్రమాదం తప్పేదని చెప్పారు. తెలంగాణలో ప్రమాదకరంగా ఉన్న అన్ని ప్రాంతాల్లో రైల్వే గేట్లు ఏర్పాటు చేయాలని రైల్వే జీఎంను కోరినట్లు తెలిపారు. అవసరమైతే రాష్ట్ర తరఫున కూడా డబ్బు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని వివరించారు. బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యం కూడా ఉందని.. రెగ్యులర్‌ డ్రైవర్‌ కాకుండా తాత్కాలిక డ్రైవర్‌ వచ్చాడని చెబుతున్నారని తెలిపారు. దీనిపై విచారణకు ఆదేశించామని, నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. మృతదేహాల తరలింపును అడ్డుకోవద్దని ఆందోళనకారులకు విజ్ఞప్తి చేయడంతో వారు ఆందోళన విరమించారు.

వారంలోగా గేట్లు ఏర్పాటు చేయాలి : సీఎం కేసీఆర్‌

రైలు ప్రమాద ఘటనపై డీజీపీ, సీఎస్‌తో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. మెదక్‌ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద జరిగిన రైలు ప్రమాద ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మెదక్‌ ప్రమాద ఘటనలో 26 మంది విద్యార్థులు మృతి చెందారని ప్రభుత్వం ప్రకటించింది. 12 మంది విద్యార్థులకు తీవ్రంగా గాయాలయ్యాయని, మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నట్లు పేర్కొంది. రైల్వే జీఎంపై సీఎం కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రాసింగ్‌ల వద్ద గేట్లు ఏర్పాటు చేయకపోవడంపై కేసీఆర్‌ సీరియస్‌ అయ్యారు. వారంలోగా రాష్ట్రంలోని అన్ని క్రాసింగ్‌ల వద్ద గేట్లు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ఈ ఘటనపై ఆయన తీవ్రంగా కలత చెందారు. చిన్నారలు మృతితో ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. క్షతాగ్రులయిన పిల్లలకు ఎంత ఖర్చయినా వైద్యం అందించాలన్నారు. ఇందుకు వెనకాడవద్దని ఆదేశించారు. ఆయన ఎప్పిటికప్పుడు పరిస్థితిని సవిూక్షించి అధికారలను పురమాయించారు. అలాగే మంత్రులను యశోదాకు పంపి పరిస్థితిని సవిూక్షించారు. అలాగే  ప్రమాదంలో గాయపడిన వారిని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పరామర్శించారు. యశోద ఆస్పత్రికి చేరుకున్న సీఎం చిన్నారులకు మెరుగైన వైద్యాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు.  క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. సహాయక చర్యలపై జిల్లా అధికారులతో కేసీఆర్‌ ఎప్పటికప్పుడు సవిూక్షించారు. సహాయకచర్యలు పర్యవేక్షించాల్సిందిగా మంత్రులను ఆదేశించారు. ఘటనాస్థలికి వెళ్లిన హరీశ్‌రావు మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. కాంగ్రెస్‌, తెదేపా, వైకాపా నేతలు పలువురు ఘటనాస్థలికి వెళ్లి బాధితులను పరామర్శించారు.

ఘటనపై ప్రధాని మోడీ సంతాపం

ఎక్స్‌గ్రేషియాపై లోక్‌సభలో టిఆర్‌ఎస్‌ ఎంపీల ఆందోళన

న్యూఢిల్లీ :  మెదక్‌ జిల్లా మాసాయిపేట వద్ద  జరిగిన ఘోర రైలు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేశారు. రైలు ప్రమాద ఘటనా వివరాలను ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు. కేబినెట్‌ సమావేశం జరుగుతున్న సమయంలో ప్రమాదం విషయం తెలియడంతో క్షతగాత్రులకు మెరుగైన సహాయం అందించాల్సిందిగా కేంద్ర మంత్రి సదానందగౌడను ప్రధాని మోదీ ఆదేశించారు. మాసాయిపేట స్కూలు బస్సు ప్రమాదంపై లోక్‌సభ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. బాధిత కుటుంబాలకు సంతాపం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం అందించనున్నట్లు రైల్వే మంత్రి సదానందగౌడ సభలో ప్రకటించారు. అయితే, రూ.2లక్షలు చాలా తక్కువ అని.. కనీసం పది లక్షలు చెల్లించాలని టీఆర్‌ఎస్‌ ఎంపీలు డిమాండ్‌ చేశారు. అందుకు మంత్రి అంగీకరించక పోవడంతో ఎంపీలు సభలో ఆందోళనకు దిగారు. దీంతో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. మెదక్‌ జిల్లా వల్దూరు మండలం మాసాయిపేట రైల్వే గేటు వద్ద జరిగిన ప్రమాదంలో 20 మందికి పైగా విద్యార్థులు దుర్మరణం చెందారు. మృతులంతా 12 ఏళ్లలోపు చిన్నారులే. ఈ ఘటనపై రైల్వే మంత్రి సభలో ఓ ప్రకటన చేశారు. ప్రమాదం పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కాపలా లేని రైల్వే క్రాసింగ్‌ వద్ద పాఠశాల బస్సును రైలు ఢీకొట్టిందని చెప్పారు. బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ఆయన ప్రకటించారు. ఇప్పటివరకు 20 మంది విద్యార్థులు చనిపోయారని తెలిపారు. 23 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. గాయపడిన వారికి రూ.లక్ష, స్వల్పంగా గాయపడిన వారికి రూ.20 వేల చొప్పున అందజేస్తామన్నారు.

ఇది అత్యంత దారుణఘటన అని అభివర్ణించారు. ఇదిలావుంటే మెదక్‌ జిల్లా రైలు ప్రమాదంపై టీఆర్‌ఎస్‌ ఎంపీ జితేందర్‌రెడ్డి గురువారం ఉదయం లోక్‌సభలో ప్రస్తావించారు. అయితే జీరో అవర్‌ నడుస్తున్నందున దీనిపై చర్చ జరగడం కుదరదని స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ స్పష్టం చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రమాదంపై ప్రకటన చేయనున్నట్లు రైల్వే మంత్రి సదానంద గౌడ ప్రకటించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా భద్రతా చర్యలు తీసుకుంటామని రైల్వేమంత్రి సభలో తెలిపారు. రైలు ప్రమాదంలో మృతి చెందిన చిన్నారుల కుటుంబాలకు రైల్వే మంత్రి సదానందగౌడ రూ.2లక్షలు నష్టపరిహారాన్ని ప్రకటించారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారికి రూ.లక్ష పరిహారాన్ని అందిస్తామని వెల్లడించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని స్పష్టం చేశారు. మరోవైపు రైల్వే మంత్రి ప్రకటనపై లోక్‌సభలో టీఆర్‌ఎస్‌ ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రకటించిన నష్ట పరిహారంపై నిరసన వ్యక్తం చేశారు. మాసాయిపేట రైలు ప్రమాద మృతులకు రెండు లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించడాన్ని టీఆర్‌ఎస్‌ ఎంపీలు తీవ్రంగా తప్పుబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిందని కేంద్ర ప్రభుత్వం పది లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని ఎంపీలు డిమాండ్‌ చేశారు. దీనిపై స్పందించిన రైల్వే మంత్రి రైల్వే శాఖ రెండు లక్షల ఎక్స్‌గ్రేషియా మాత్రమే చెల్లిస్తుందని, మిగితాది రెవెన్యూ శాఖ సహాయం చేస్తుందని తెలిపారు. రైల్వే మంత్రి అలా ప్రకటించడంతో టీఆర్‌ఎస్‌ ఎంపీలు లోక్‌ సభలో ఆందోళనకు దిగారు.

మెదక్‌ జిల్లా దుర్ఘటనపై సోనియా, రాహుల్‌ దిగ్భ్రాంతి

మెదక్‌ జిల్లా మాసాయిపేట వద్ద జరిగిన ప్రమాదంలో పలువురు పిల్లలు ప్రాణాలు కోల్పోవడం పట్ల కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

ఒకే కుటుంబంలో ఇద్దరేసి మృతి

అది ఊహకందని విషాదం.. ఊహించే లోపు క్షణాల్లో జరిగిన ఘోరం.  ముద్దులొలికే బుజ్జాయిలు మాంసపు ముద్దలుగా మారారు.. వస్తానమ్మా అంటూ వెళ్లిన వారు ఇక రారని తెయిడంతో తల్లిదండ్రుల రోదనలు కలచివేసేలా ఉన్నాయి. కొందరి శవాలు రైలు పట్టాలపై చెల్లాచెదరుగా పడ్డారు… ఘటనా స్థలం మరుభూమిగా మారింది. ఆ ప్రాంతం అంతా ఇప్పుడు చిందరవందరగా మారింది. చిన్నారుల తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తుంటే ప్రతి ఒక్కరి కడుపులో పేగు మెలిపెట్టినట్లయింది నుజ్జునుజ్జయిన బస్సులో ఇరక్కుని కొంత మంది పిల్లలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరికొందరు ప్రాణాలతో కొట్టు మిట్టాడుతున్న దృశ్యాలు… ఘోరాన్ని చూసిన ఓ తల్లి స్పృహ తప్పి పడిపోయింది…రక్తపు మడుగులో పడి ఉన్న తన కొడుకును చిసి ఓ తండ్రి గుండె ఆగిపోయింది. ఇలాంటి ఘటనలు ఇక్కడ చూసే వారిని కదలించి వేస్తున్నాయి. మెదక్‌ జిల్లాలో జరిగిన రైలు ప్రమాదంలో వళ్లంతా గాయలతో బయటపడ్డ ఓ చిన్నారి అమ్మా… నాకేమయిందమ్మా… అంటూ అమాయకంగా అడుగుతున్న దృశ్యం ప్రతి ఒక్కరి గుండెను పిండేసింది. ఆ చిన్నారి ప్రశ్నకు బదులేమివ్వాలో తెలియక బోరుమని విలపిస్తున్న ఆ తల్లిని చూసి ప్రతి ఒక్కరు కంట తడ్డి పెట్టుకున్నారు. ఇక ఇక్కడికి వచ్చిన వారు సైతం ఘటనాస్థలి చూసి భోరున వఇలపించారు. కన్నీరు పెట్టుకోకుండా ఉండలేకపోయారు.

ఒకే కుటుంబంలో ముగ్గురు పిల్లల దుర్మరణం

మెదక్‌ జిల్లా మాసాయి పేట వద్ద స్కూలు బస్సు ప్రమాదానికి గురై మరణించిన ఘటనలో మరో విషాదం ఉంది. ఒకే కుటుంబానికి చెందిన పిల్లలు కూడా మృత్యువాత పడ్డారు. విద్యార్థులు పలువురు అన్నదమ్ములు, అక్కాతమ్ముళ్లు కావడం గమనార్హం. ఒకే ఇంటికి చెందిన ఇద్దరు, ముగ్గురు చిన్నారులు ఒకేసారి మృత్యువాత పడడంతో ఆ తల్లిదండ్రుల ఆవేదనకు అంతులేకుండా ఉంది. గుండ్రేడిపల్లికి చెందిన యాదగిరి అనే వ్యక్తి ముగ్గురు పిల్లల్లో ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు  ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. మరో రెండు కుటుంబాలు కూడా ఇద్దరేసి పిల్లల్ని కోల్పోయి దిక్కుతోచక అల్లాడుతున్నాయి.

అంతులేని విషాదం

ఆగిన తండ్రి గుండె

మాసాయిపేట ప్రమాద ఘటన ఓ కుటుంబానికి అంతులేని ఆవేదనను, దుఃఖాన్ని మిగిల్చింది. ఇద్దరు చిన్నారులతో పాటు కుటుంబ పెద్దను బలిగొంది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులతో పాటు తండ్రి కూడా మృతి చెందడంతో ఆ కుటుంబం నిండా విషాదంలో మునిగిపోయింది. తన ముద్దులొలికే ఇద్దరు చిన్నారులు ఇక లేరని, తిరిగి రారని తెలిసీ ఆ తండ్రి గుండె తట్టుకోలేక పోయింది. విగత జీవులుగా మారిన పసిమొగ్గలను చూసి, చేదు నిజాన్ని జీర్ణించుకోలేక ఆగిపోయింది. తన కన్న బిడ్డల్ని వెదుక్కుంటూ ఆ తండ్రి కానరాని లోకాలకు తరలి వెళ్లిపోయాడు. తన వారి కోసం పరితపించిన ఆ హృదయం తుదిశ్వాస విడిచింది. గురువారం వెల్దూర్తి మండలం మాసాయిపేట వద్ద జరిగిన ఘోర దుర్ఘటన ఆ కుటుంబాన్ని కోలుకోలేని దెబ్బ తీసింది. కిష్టాపూర్‌కు చెందిన అక్కాతమ్ముడు రజీయా, వాజీద్‌ తూప్రాన్‌లోని కాకతీయ టెక్నో పాఠశాలలో చదువుతున్నారు. రోజులాగే ఉదయం లేచి రెడీ అయి స్కూల్‌కు బయల్దేరారు. తల్లిదండ్రులు దగ్గరుండి మరీ బస్సు ఎక్కించారు. అప్పుడు వారికి తెలియదు ఆ బస్సే మృత్యువవుతుందని! బస్సు బయల్దేరింది. కొద్దిసేపటికే పిడుగులాంటి వార్త అందింది. మాసాయిపేట వద్ద జరిగిన ప్రమాదంలో 20 మందికి పైగా చిన్నారులు మృతి చెందారని.. అందులో తమ పిల్లలు ఇద్దరూ ఉన్నారని. తల్లి కుప్పకూలిపోయింది. బడికి పంపి పది నిమిషాలు కూడా కాకముందే కన్నబిడ్డలూ కడతేరిపోయారన్న బాధ ఆ తండ్రి గుండెను పిండేసింది. చిన్నారుల మరణం తట్టుకోలేని ఆ గుండె ఆగిపోయింది. గుండెపోటు రావడంతో ఆయన కుప్పకూలిపోయారు. కన్నవారు లేని చోట నేనుండలేనంటూ ఆయన కూడా వెళ్లిపోయారు. ఇద్దరు సంతానం మృత్యువాత పడడంతో తండ్రి గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. బంధువులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. ఒకే కుటుంబానికి చెందిన తండ్రి ఇద్దరు పిల్లలు మృత్యువాత పడడం ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. చూసిన వారు, చుట్టుపక్కల వారు, ఈ వార్త విన్న వారు అందరూ కన్నీరు కార్చారు. మౌనంగా రోదించారు. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రావొద్దని మనస్సులోనే దేవుడ్ని వేడుకున్నారు.

ప్రమాదంతో పలు రైళ్ల రద్దు

హైదరాబాద్‌ : మెదక్‌ జిల్లా మాసాయిపేట వద్ద రైలు ప్రమాదం వల్ల పలు రైళ్లు రద్దయ్యాయి. హైదరాబాద్‌- తాండూరు ప్యాసింజర్‌, తాండూరు-హైదరాబాద్‌ ప్యాసింజర్‌, నిజామాబాద్‌- కాచీగూడా ప్యాసింజర్‌ రైళ్లను పూర్తిగా రద్దు చేశారు. కాచీగూడా-నిజామాబాద్‌ 57690, నాందేడ్‌-హైదరాబాద్‌ ప్యాసింజర్‌ రైలు కామారెడ్డి నుంచి నడవనుంది. రైళ్ల రాకపోకల వివరాల కోసం హైదరాబాద్‌ రైల్వేస్టేషన్‌- 04023200865, కాచీగూడ రైల్వేస్టేషన్‌ 040 27550355 సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చని రైల్వే అధికారులు తెలిపారు.

వారం రోజుల్లో గేట్లు ఏర్పాటు : రేల్వే జీఎం శ్రీవాత్సవ

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వారం రోజుల్లోగా కాపలా లేని రైల్వే క్రాసింగ్‌ వద్ద గేట్లు ఏర్పాటు చేస్తామని దక్షిణ మధ్య రేల్వే జీఎం శ్రీవాత్సవ తెలిపారు. గురువారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, ఈ విషయం వెల్లడించారు. అంతకు ముందు మెదక్‌ జిల్లాలో రైలు ప్రమాద ఘటనపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ జీఎం శ్రీవాత్సవతో మాట్లాడారు. ప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా రైల్వే క్రాసింగ్‌ వద్ద గేట్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని కేసీఆర్‌ ఈ సందర్భంగా శ్రీవాత్సవను కోరారు. వారం రోజుల్లోగా రైల్వే క్రాసింగ్‌ వద్ద గేట్లు ఏర్పాటు చేస్తామని శ్రీవాత్సవ తెలంగాణ సీఎం కేసీఆర్‌కు హమీ ఇచ్చారు. ఇదిలావుంటే ఈ ఘటనను సర్కార్‌ తీవ్రంగా పరిగణిస్తోంది. మాసాయిపేట వద్ద జరిగిన ప్రమాదంలో రైల్వే అధికారులపై కూడా కేసులు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఈ విషయాన్ని నర్సాపూర్‌ ఎమ్మెల్యే మదన్‌ రెడ్డి తెలిపారు. ప్రమాదానికి ప్రధాన కారణం అక్కడ లెవెల్‌ క్రాసింగు వద్ద రైల్వే గేటు లేకపోవడమేనని, ట్రాఫిక్‌ ఎక్కువగా లేదన్న కారణంతోనే ఇంతకుముందు ప్రజలు కోరినా కూడా రైల్వే శాఖ అక్కడ గేటు ఏర్పాటుచేయలేదని ఆయన అన్నారు. ఈ విషయమై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. గేటు కావాలంటూ ప్రజలు మూడుసార్లు ధర్నా చేసినా కూడా ఏర్పాటు చేయకపోవడం వల్లే ఈరోజు ఇంత పెద్ద ప్రమాదం సంభవించిందని ఆయన అన్నారు. ఇక హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన తెలంగాణ ¬ం మంత్రి నాయిని నరసింహారెడ్డి తదితరులు కూడా రైల్వేశాఖ అధికారులదే తప్పని, ఇక్కడ గేటు పెట్టించకపోవడం సరికాదని వ్యాఖ్యానించారు. హరీష్‌ రావు కూడా ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. దీనికి రైల్వేశాఖ బాధ్యత వహించాలన్నారు.

ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల వివరాలు :

చింత సుమన్‌ – గుండ్రేటిపల్లి

గొల్ల మహేష్‌ – ఇస్లాంపూర్‌

విద్య- గుండ్రేటిపల్లి

నీరుడు వంశీ – ఇస్లాంపూర్‌

చింతల చరణ్‌- గుండ్రేటిపల్లి

చింతల దివ్య- గుండ్రేటిపల్లి

రజియా- కిష్టాపూర్‌

వహీద్‌- కిష్టాపూర్‌

భువన- ఇస్లాంపూర్‌

వరుణ్‌, శ్రుతి

తుమ్మ విష్ణు- ఇస్లాంపూర్‌

భిక్షపతి – బస్సు డ్రైవర్‌

గణేశ్‌ గౌడ్‌ – క్లీనర్‌