కజికిస్తాన్‌లో ఘోర విమాన ప్రమాదం

టేకాఫ్‌ అయిన వెంటనే కుప్పకూలిన విమానం
14 మంది మృతి..పలువురికి గాయాలు
న్యూఢిల్లీ,డిసెంబర్‌27(జ‌నంసాక్షి): కజకిస్తాన్‌లో ఆల్మాటీ నగరంలో శుక్రవారం ఉదయం ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఆల్‌మటీ ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫ్‌ అయిన బేక్‌ ఎయిర్‌ విమానం కుప్పకూలిపోయింది. విమానాశ్రయానికి సవిూపంలో ఉన్న రెండు అంతస్తుల భవనాన్ని విమానం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో 95 మంది ప్రయాణికులు, ఐదుగురు విమాన సిబ్బంది ఉన్నారు. ఈ ప్రమాదంలో 14 మంది మృతి చెందినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్దారించారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. కొందరు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడినట్లు తెలుస్తుంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. విమానం ఆల్‌మటీ ఎయిర్‌పోర్టు నుంచి కజకిస్థాన్‌ రాజధాని నూర్‌ సుల్తాన్‌కు బయల్దేరిన సమయంలో ప్రమాదం జరిగినట్లు ఎయిర్‌పోర్టు అధికారులు నిర్దారించారు. విమానం కుప్పకూలిన స్థలానికి చేరుకున్న అధికారులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సవిూప ఆస్పత్రులకు తరలించారు. ప్రమాద ఘటనపై దర్యాప్తుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు అధికారులు. ఈ ప్రమాదంపై కజకిస్థాన్‌ ప్రెసిడెంట్‌ క్యాసమ్‌ జోమార్ట్‌ తీవ్ర దిగ్భాం/-రతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రెసిడెంట్‌ ప్రార్థించారు.