దాడికి పాల్పడింది నేషనల్‌ తౌహీద్‌ జమాత్‌గా గుర్తింపు

కొలంబో,ఏప్రిల్‌22(జ‌నంసాక్షి): శ్రీలంకలో పేలుళ్లకు పాల్పడిన ఉగ్రసంస్థ  నేషనల్‌ తౌహీద్‌ జమాత్‌గా   గుర్తించారు.  ఈస్టర్‌ వేడుకలను రక్తసిక్తం చేసిన ఉగ్రవాదులు ఆ సంస్థ వ్యక్తులే. వీరంతా కూడా లంకేయులే అని ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి రజిత సేనరత్న ఈ విషయాన్ని వెల్లడించారు. దేశంలో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉన్నట్లు ఇంటెలిజెన్స్‌ వర్గాలు ఏప్రిల్‌ 11వ తేదీ కన్నా ముందే.. పోలీసులకు హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. నేషనల్‌ తౌహీద్‌ జమాత్‌.. శ్రీలంకలో ఉన్న రాడికల్‌ ఇస్లామ్‌ గ్రూప్‌. అయితే ఈ సంస్థకు అంతర్జాతీయ లింకులు ఉండి ఉంటాయని భావిస్తున్నారు. ఇంటెలిజెన్స్‌ సమాచారం ఉన్నా.. ఎటువంటి భద్రతా చర్యలు చేపట్టని పోలీసు చీఫ్‌ పూజిత్‌ జయసుందరే రాజీనామా చేయాలంటూ సేనరత్న డిమాండ్‌ చేశారు. ఇప్పటివరకు లంక పోలీసులు 24 మందిని అరెస్టు చేశారు. వారంతా నేషనల్‌ తౌహీద్‌ జమాత్‌కు చెందినట్లు అనుమానిస్తున్నారు. 8 చోట్ల జరిగిన పేలుళ్లలో ఆరు చోట్ల ఈ సంస్థలోనే శిక్షణ పొందిచన వారే ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.