పట్టాలు తప్పిన ఎక్స్‌ప్రెస్‌ రైలు

– ఏడుగురి మృతి, 30మందికి గాయాలు
– యూపీలో ఘటన
లక్నో, అక్టోబర్‌10(జ‌నంసాక్షి) : యూపీలో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. పట్టాలు తప్పడంతో ఏడుగురు మృతిచెందగా, మరో 30మందికి తీవ్రగాయాలయ్యాయి.. పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా పట్టణం నుంచి న్యూఢిల్లీకి వెళ్లే న్యూ ఫరక్కా ఎక్స్‌ప్రెస్‌ రైలు పట్టాలు తప్పింది. ఉత్తరప్రదేశ్‌లోని హర్‌చందాపూర్‌ వద్ద బుధవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో రైలు పట్టాలు తప్పినట్టు ఉత్తర రైల్వే డివిజనల్‌ మేనేజర్‌ సతీష్‌ కుమార్‌ వెల్లడించారు. ఇంజిన్‌ సహా ఐదు బోగీలు పట్టాలు తప్పాయని చెప్పారు. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, 30 మందికి పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రమాదంలో గాయపడిన వారికి తక్షణ వైద్య సహాయం అందించేందుకు డాక్లర్ల బృందంతో కూడిన వ్యాన్‌ లక్నో నుంచి ఘటనా స్థలానికి వెళ్లింది. అలాగే మొఘల్‌సరాయిలోని దీన్‌ దయాల్‌ ఉపాధ్యాయ జంక్షన్‌లో హెల్ప్‌లైన్‌ నంబర్స్‌ ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన మార్గంలో వెళ్లాల్సిన రైళ్లను దారి మళ్లించారు. ఘటనా స్థలం వద్ద సహాయక చర్యలను రైల్వే మంత్రి పియూష్‌ గోయల్‌ పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు అధికారులకు ఫోన్లు చేసి సమాచారం అడిగి తెలుసుకున్నారు. మరోవైపు, రైల్వే బోర్డు చైర్మన్‌ అశ్వని లొహాని ఘటనా స్థలానికి చేరుకుంటున్నారని సంబంధిత అధికారులు వెల్లడించారు. ప్రమాదంలో మరణించినవారి కుటుంబాలకు ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ రూ.2 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ.50వేల తక్షణ సాయంగా అందిస్తు?న్నారు.