‘పద్మావతి’తో ఇబ్బందే

– క్లీన్‌చిట్‌ ఇచ్చేముందు ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకోండి
–  కేంద్రానికి యూపీ ప్రభుత్వ లేఖ
– దీపికా నీ ముక్కు కోస్తాం.. మమ్మల్ని రెచ్చగొట్టొద్దు!
– రాజ్‌పూత్‌ కర్ణిసేన హెచ్చరిక
లక్నో, నవంబర్‌16(జ‌నంసాక్షి) : సంజయ్‌ లీలీ భన్సాలీ లేటెస్ట్‌ మూవీ పద్మావతి మూవీ రిలీజైతే అది తీవ్ర శాంతి భద్రతల సమస్యగా మారొచ్చని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం కేంద్రాన్ని హెచ్చరించింది. సినిమా విడుదల
రోజు పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగే ప్రమాదం ఉందంటూ కేంద్ర సమాచార శాఖకు యూపీ ¬ంశాఖ ఓ లేఖ రాసింది. సినిమాకు క్లీన్‌చిట్‌ ఇచ్చే ముందు ప్రజల ఆందోళన, వాళ్ల మనోభావాలను కూడా దృష్టిలో ఉంచుకోవాలని సూచించింది. సీబీఎఫ్‌సీ ముందు మూవీ మేకర్స్‌ సినిమాను ప్రదర్శించనున్న నేపథ్యంలో ఈ లేఖ రాస్తున్నట్లు యూపీ ప్రభుత్వం స్పష్టంచేసింది. ఇప్పటికే సినిమా రిలీజ్‌ను వ్యతిరేకిస్తూ దిష్టిబొమ్మల దహనాలు, ర్యాలీలు, ప్రదర్శనలు జరుగుతున్నాయని ఆ లేఖలో యూపీ పేర్కొన్నది. అటు సినిమాను ప్రదర్శించే థియేటర్ల యజమానులకు కూడా బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయని అందులో చెప్పింది. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని సీబీఎఫ్‌సీకి జాగ్రత్తలు పాటించాల్సిందిగా సూచించాలని యూపీ ప్రభుత్వం కోరింది. అంతేకాదు ఈ నెల 22, 26, 29 తేదీల్లో జరగనున్న మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు డిసెంబర్‌ 1నే రానున్నాయని, అదే రోజు సినిమా రిలీజ్‌ అయితే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలని సూచించింది.
దీపికా.. నీ ముక్కు కోసేస్తాం..!
పద్మావతి మూవీ రిలీజ్‌ను నిరసిస్తూ ఇప్పటికే డిసెంబర్‌ 1న భారత్‌ బంద్‌ ప్రకటించిన రాజ్‌పుత్‌ కర్ణిసేన.. తాజాగా ఈ సినిమాలో టైటిల్‌ రోల్‌ పోషిస్తున్న దీపికా పదుకొనేను బెదిరించింది. మమ్మల్ని రెచ్చగొట్టొద్దు. శూర్పనక ముక్కులాగా దీపికా పదుకొనే ముక్కు కూడా కోసేస్తాం. వాస్తవాలను తప్పుదోవ
పట్టిస్తాడని పేరున్న సంజయ్‌ లీలా భన్సాలీ ఈ మూవీని అలాగే చిత్రీకరించాడు. సినిమాకు దుబాయ్‌ నుంచి పెట్టుబడులు అందాయి. సినిమా రిలీజ్‌ను కచ్చితంగా అడ్డుకుంటాం అని ఆ గ్రూప్‌ నేత లోకేంద్ర సింగ్‌ కల్వి హెచ్చరించారు. దేశం దిగజారిపోతున్నదన్న దీపికా కామెంట్స్‌పై ఆయన ఇలా స్పందించాడు. దేశం కాదు విూరు అలా దిగజారిపోయేలా చేస్తున్నారు. మహిళలను అవమానపరచొద్దని దీపికాను కోరుతున్నాం. ఈ సినిమాలో ఒంటిపై కొన్ని దుస్తులతోనే డ్యాన్స్‌ చేయడం కనిపించింది. భారతీయ మహిళను ఇలా ఎలా చూపించగలుగుతారు అని కల్వి ప్రశ్నించారు. సినిమాకు అండర్‌ వరల్డ్‌ డాన్స్‌ ఆర్థిక సాయం చేశారని కూడా ఆయన ఆరోపించారు. సినిమా విడుదలైతే తీవ్ర పరిణామాలు ఉంటాయని, తాము లక్షల్లో ఏకమై సినిమాను అడ్డుకుంటామని ఆయన స్పష్టంచేశారు.