మియామి ఎయిర్‌పోర్ట్‌ పేల్చేస్తానంటూ కాల్స్‌

యువకుడిని అరెస్ట్‌ చేసిన యూపి పోలీసులు

లక్నో,నవంబర్‌3(జ‌నంసాక్షి): ఓ యువకుడిని ఉత్తరప్రదేశ్‌ యాంటీ టెర్రర్‌ స్కాడ్‌ అదుపులోకి తీసుకుంది.

అమెరికాలోని మియామి ఎయిర్‌పోర్టును పేల్చేస్తానని పలుసార్లు ఫోన్‌ చేసి బెదిరింపులకు పాల్పడటమే ఇందుకు కారణమని సమాచారం. నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు ఏటీఎస్‌ ఆఫీసర్‌ ఆసీం అరుణ్‌ తెలిపారు. యువకుడు వెయ్యి డాలర్ల విలువగల బిట్‌కాయిన్లను కొనుగోలు చేశాడు. కాగా ఈ క్రమంలో ఎవరోఒకరు ఇతడిని మోసం చేశారు. దీనిపై యువకుడు ఎఫ్‌బీఐని ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. కాగా ఎఫ్‌బీఐ నుంచి సమాధానం రాలేదు. విసుగుచెంది యువకుడు మియామి ఎయిర్‌పోర్టుకు కాల్‌ చేశాడు. ఏకే-47 రైఫిల్‌, గ్రనేడ్‌, సుసైడ్‌ బెల్ట్‌ బాంబుతో విమానాశ్రయాన్ని పేల్చేందుకు వస్తున్నట్లు ఫోన్‌కాల్‌ చేశాడు. ఇలా అక్టోబర్‌ 2వ తేదీ నుంచి 31వ తేదీ వరకు పలుమార్లు వాయిస్‌ ఓవర్‌ ఇంటర్నెట్‌ ప్రొటోకాల్‌ ద్వారా ఫోన్‌కాల్‌ చేశాడు. ఈ ఫోన్‌ బెదిరింపులపై సమాచారం అందుకున్న యూపీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఐపీ అడ్రస్‌ ఆధారంగా నిందితుడిని గుర్తించి పట్టుకున్నారు. యువకుడు తన నేరాన్ని అంగీకరించాడు.