విశ్వాసమా..? వివక్షా..?

ఈరెండింటి మధ్యే వివాదం
విశ్వాసానికి చట్టబద్ధత కల్పించిన కేరళ హైకోర్టు
2018 నాటి తీర్పును తప్పుబట్టిన సుప్రీంకోర్టు
లింగ వివక్ష రాజ్యంగ వ్యతిరేకమన్న న్యాయస్థానం
ఈ తీర్పుపై సవిూక్షించాలని పలు పిటిషన్లు
అందుకే విస్తృత ధర్మాసనం ఏర్పాటు
న్యూఢిల్లీ,నవంబర్‌14 (జనంసాక్షి) : శబరిమల ఆలయ వివాదం భక్తుల విశ్వాసం, లింగ వివక్ష మధ్య న్యాయసవిూక్షకు తెరలేపింది. మత విశ్వాసాలతో ముడిపడిఉన్న ఈఅంశంపై దేశ అత్యున్నత న్యాయ స్థానం ఏం తేలుస్తుందని యావత్‌దేశం తీర్పు కోసం ఆశక్తిగా ఎదురుచూసింది. గత ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు అంగీకరించని న్యాయస్థానం సమ్రగంగా విచారించేందుకు విస్తృత ధర్మాసనంకు సిఫార్సుచేయడం వెనక అసలు ఉద్దేశ్యం ఇదేనని భావిస్తున్నారు. శబరిమల ఆలయంలో మహిళల  ప్రవేశంపై కొనసాగుతున్న వివాదం ఈ నాటిది కాదు. మహిళల హక్కులకు, భక్తుల విశ్వాసాలకు, కోర్టు తీర్పులకు, ప్రభుత్వ నిర్ణయాలకు నడుమ ఈ వివాదం ఏళ్లుగా నలుగుతోంది. ఆలయంలోకి 10-50 ఏళ్ల మధ్య వయసు బాలికలు, మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని ఎత్తేస్తూ.. అన్ని వయసుల వారికి ప్రవేశాన్ని అనుమతిస్తూ గత ఏడాది సెప్టెంబరు 28న సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు- కొందరికి మోదాన్ని, మరికొందరికి ఖేదాన్ని మిగిల్చింది. దీనిపై హింసాత్మక నిరసనలు కొనసాగాయి. కేరళలో రాజకీయంగా ఎదగడానికి శ్రమిస్తున్న బిజెపి.. శబరిమల వివాదాన్ని ఓ అస్త్రంగా వాడుతుండటం, దాన్ని నిలువరించేందుకు లెప్ట్‌ఫ్రంట్‌ ప్రభుత్వం ప్రయత్నించడంతో ఇదో రాజకీయ రణక్షేత్రంగానూ మారింది. ఆలయంలోకి ప్రవేశించడానికి పలువురు మహిళలు ప్రయత్నించినప్పటికీ.. ఈ ఏడాది జనవరిలో ఇద్దరు మాత్రమే లోపలికి వెళ్లగలిగారు. కోర్టు తీర్పును శిరసావహించి, ఆలయంలోకి వెళ్లే మహిళలకు భద్రత కల్పించినందుకు కేరళలోని పినరయి విజయన్‌(ఎల్‌డీఎఫ్‌) ప్రభుత్వం విమర్శల్నీ ఎదుర్కొంది. నాటి తీర్పుపై పునస్సవిూక్ష కోరుతూ దాఖలైన 64 పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. తాజాగా గురువారం ఉదయం తీర్పు వెలువరించింది. హరిహర పుత్రుడైన అయ్యప్ప స్వామి ఆజన్మ బ్రహ్మచారి అని.. అందువల్ల ఆయన ఆలయంలోకి రుతు క్రమం వయసులో ఉన్న మహిళల్ని అనుమతించకూడదనేది శతాబ్దాలుగా ఉన్న ఆచారం, విశ్వాసం. అలాంటి మహిళలు వస్తే ఆలయం అపవిత్రమవుతుందని.. శబరిమల ప్రధాన ఆలయం పక్కనే ఉన్న గుడిలోని మాలికాపురత్తమ్మను అగౌరవపరిచినట్లు అవుతుందని
కొందరు నమ్ముతారు. ఈ విశ్వాసానికి చట్టబద్ధత కల్పిస్తూ- ఆలయంలోకి 10-50 మధ్య వయసు మహిళలు ప్రవేశించకుండా 1991లో కేరళ హైకోర్టు నిషేధం విధించింది. దీనిపై వివాదం మొదలైంది. ఆలయంలోకి అన్ని వయసుల మహిళల్నీ అనుమతించాలన్న డిమాండ్‌ ఊపందుకుంది. కేరళలోని పతనంథిట్ట జిల్లాలో.. పశ్చిమ కనుమల్లోని శబరిమల శిఖరంపై ప్రసిద్ధ అయ్యప్ప స్వామి ఆలయం కొలువై ఉంది. సముద్ర మట్టానికి 3 వేల అడుగుల ఎత్తులో, పెరియార్‌ పులుల అభయారణ్యంలో 18 గుట్టల మధ్య ఆలయాన్ని నిర్మించారు. అయ్యప్ప అంటే వృద్ధి అని అర్థం. ఈ ఆలయానికి ఏటా కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధప్రదేశ్‌, తెలంగాణ రాష్టాల్రతో పాటు దేశ విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ఈ గుడిని నవంబరు-డిసెంబరులో మండల పూజలకు, జనవరి 14న మకర సంక్రాంతికి, ఏప్రిల్‌ 14న విషువ పండుగకు, మలయాళ నెలల్లోని ప్రతి మొదటి అయిదు రోజుల సమయంలో భక్తులకు పూజలు చేసుకోవడానికి తెరుస్తారు. కేరళ హైకోర్టు తీర్పును ఇండియన్‌ యంగ్‌ లాయర్స్‌ అసోషియేషన్‌ తరఫున ఆరుగురు మహిళలు 2006లో సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు. భారత రాజ్యాంగం కల్పించిన హక్కులకు అది విఘాతమని వాదించారు. దానిపై విచారించిన సుప్రీంకోర్టు- 2018, సెప్టెంబరు 28న తీర్పు ఇచ్చింది. స్త్రీ పురుషులని వివక్ష చూపడం రాజ్యాంగంలోని 25, 26 అధికరణలకు విరుద్ధమని పేర్కొంటూ నిషేధాన్ని ఎత్తేసింది. మహిళల ప్రవేశానికి అనుమతించింది. ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంలో అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌మిశ్రాతోపాటు జస్టిస్‌ ఆర్‌.ఎఫ్‌.నారిమన్‌, జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ ఎ.ఎం.ఖాన్‌విల్కర్‌లు అనుకూలంగా తీర్పిచ్చారు. ఏకైక మహిళా న్యాయమూర్తి జస్టిస్‌ ఇందూ మల్హోత్రా మాత్రం వ్యతిరేకించారు. సుప్రీంకోర్టు తీర్పుపై మొదట తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేసిన ఆలయ ప్రధాన అర్చకుడు కందారు రాజీవరు… తర్వాత మెత్తబడ్డారు. సనాతన సంప్రదాయాలను గౌరవించాలంటూ హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో గట్టిగా వాదించిన, ఆలయ నిర్వహణ చూస్తున్న ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు సైతం ఆ తర్వాత తీర్పును గౌరవిస్తామంటూ ప్రకటించింది. అయితే…. వేలమంది అయ్యప్ప భక్తులు మాత్రం మహిళల ప్రవేశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదంటూ కేరళతో పాటు, దేశంలోని ఇతర ప్రాంతాల్లో నిరసనలకు దిగారు.