అడవిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం

తలమడుగు: మండలంలోని దేవాపూర్‌ అటవీ ప్రాంతంలో సోమవారం ఉదయం మహిళ మృతదేహం కనిపించడం తీవ్ర కలకలం రేపుతోంది. వివాహిత ఎవరు ఎక్కడి నుంచి వచ్చింది అనేది పోలీసులకు ఇప్పటికీ అంతుచిక్కడం లేదు. సంఘటన స్థలాన్ని పరిశీలిస్తే ఆ మహిళను గుర్తు తెలియని అగాంతకులు వేరే ప్రాంతం నుంచి తీసుకొచ్చి ఇక్కడ అత్యాచారం చేసి హతమార్చినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె తల నుంచి తీవ్ర రక్తస్రావం కావడంతో రాళ్లతో కొట్టిచంపినట్లు పోలీసులు భావిస్తున్నారు. శవం కుల్లిపోయి గుర్తుపట్టలేనటువంటి స్థితిలో ఉండటంతో ఈ సంఘటన మూడు, నాలుగు రోజుల కిందట జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఒంటిపై లేత ఎరుపురంగు చీర, కాళ్లకు మెట్టలు ఉన్నాయి. ఆదివారం సాయంత్రం దేవాపూర్‌ గ్రామానికి చెందిన పలువురు ఎడ్లకాపరులు, రైతులు తమ వ్యవసాయ పనులు ముగించుకొని చీకటిపడే సమయంలో ఇంటికి తిరిగి వస్తుండగా ఈ మృతదేహాన్ని చూసి ఆందోళనకు గురయ్యారు. సమాచారాన్ని వెంటనే గ్రామ పెద్దల సహకారంతో పోలీసులకు చేరవేస్తారు. గ్రామస్థుల సమాచారం మేరకు వివరాలను నమోదుచేసుకున్న పోలీసులు సోమవారం ఉదయం సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. గుర్తు తెలియని మహిళగా కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు ప్రారంహహభించారు. కాగా తమ ప్రాంతంలో వివాహిత మృతదేహం లభ్యం కావడంతో సమీప గ్రామాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.