అధికార యంత్రాంగంపై మంత్రి పితాని గరం

కలెక్టర్‌ తీరుపై ఎమ్మెల్యేల నిరసన
రసాభాసగా సమీక్ష సమావేశం
ఏలూరు, జూలై 31 : పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో కలెక్టర్‌ వాణీమోహన్‌ సమక్షంలోనే రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పితాని సత్యనారాయణ అధికారులపై నిప్పులుచెరిగారు. ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల, గిరిజనుల సంక్షేమం కోసం ఎంతగానో శ్రమిస్తూ పథకాలు అమలు చేస్తున్నా జిల్లా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. కేఆర్‌ పురంలోని ఐటీడీఏ, జిల్లా గ్రామీణ మంచి నీటి విభాగం, పశుసంవర్ధక శాఖలపై మంగళవారం జరిగిన సమీక్ష సందర్భంగా ఆయా శాఖల అధికారులు వహిస్తున్న అలసత్వాన్ని మంత్రి పితానితో పాటు, సమావేశంలో పాల్గొన్న ఏలూరు ఎంపీ సాంబశివరావు సహా పలువురి ఎమ్మెల్యేలకు ఆగ్రహం తెప్పించింది. ఆయా శాఖల అధికారుల వైఫల్యం, ప్రజల కష్టాలపై స్పందించిన మంత్రి పితాని మాట్లాడుతూ జిల్లా అధికార యంత్రాంగం పూర్తి విఫలం చెందిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే రాజేశ్‌కుమార్‌, విపక్ష టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ అధికారుల తీరును తూర్పారబట్టారు. వారితో పాటు ఎంపీ కావూరి కూడా గళం కలపడంతో కలెక్టర్‌ వాణీమోహన్‌ తలపట్టుకోవాల్సి వచ్చింది.
కీలకమైన పథకాల అమలుకు నేతృత్వం వహించేది మీరే కదా అంటూ కలెక్టర్‌ వాణిమోహన్‌ను రాజేశ్‌, ప్రభాకర్‌ సూటిగా ప్రశ్నించారు. పరోక్షంగా అధికారుల బాధ్యతారహిత్యానికి కలెక్టర్‌దే బాధ్యత అన్న వ్యాఖ్యలతో సమావేశంలో దుమారం తలెత్తింది. అధికారులు ఇచ్చిన జవాబులు ఎమ్మెల్యేలకు చికాకు, అసహనాన్ని కలిగించాయి. ఇంత తారా స్థాయిలో మంత్రి విరుచుకుపడడం ఇదే తొలి సారి కావడంతో కలెక్టర్‌ పనితీరుపై జిల్లా యంత్రాంగంలో తీవ్ర చర్చ జరిగింది. జిల్లా యంత్రాంగం పూర్తిగా విఫలమైందన్న మంత్రి పితాని చేసిన వ్యాఖ్యలో అధికారుల్లో ప్రభుత్వానికి పట్టులేకుండా పోయిందన్న వాస్తవానికి అద్ధం పట్టింది. ఈ సమావేశంలో చోటు చేసుకున్న వివాదాస్పద అంశాలపై వివరాలిలా ఉన్నాయి. జిల్లాలో గ్రామీణ ప్రాంత ప్రజల దాహార్తి నివారణకు సంబంధించి జిల్లా గ్రామీణ నీటి సరఫరా విభాగానికి పనుల నిర్వహణ నిమిత్తం ప్రభుత్వం 51 కోట్ల రూపాయలు మంజూరు చేయగా, విడుదలైన ఆరు కోట్ల రూపాయలతో ఒక్క పనికూడా పూర్తి కాలేదని ఎంపీ సాంబశివరావు ధ్వజమెత్తారు. తాము ఇటీవల ఉప ఎన్నికల సందర్భంలో విస్తృతంగా పర్యటించినప్పుడు తమ గ్రామాల్లో మంచి నీటి ఎద్దడిపై ప్రజలు నిలదీశారని, అంతేకాక అనేక ఫిర్యాదులు చేశారని తెలిపారు. బాధ్యత కలిగిన అధికారులు విడుదలైన నిధులను సద్వినియోగం చేయకపోతే ఎలా అని నిలదీశారు. మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు కూడా ప్రజలకు అవసరమైన తాగునీటి సమస్యపై ఏకరువు పెట్టారు. ఎమ్మెల్యే రాజేశ్‌ చింతలపూడి నియోజకవర్గంలో ప్రజల దాహార్తిని నివారణకు సత్యసాయి సేవాసమితి సమర్థంగా పనిచేయడంలేదని ఇందులో పనిచేసే 150 మంది అధికారుల్లో 20 మంది మాత్రమే సక్రమంగా విధులు నిర్వహిస్తున్నారని, ఈ పథకాన్ని పర్యవేక్షించాల్సిన డీఈ ఎక్కడున్నాడో కూడా తెలియడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఈతో మాట్లాడితే తనకే ఉద్యోగులపై సమాచారం లేకుండా పోయిందని సమాధానం ఇస్తున్నారని అసహనం వ్యక్త చేశారు. ఈ పరిస్థితుల్లో ఆర్‌డబ్ల్యూఎస్‌ఈ స్పందిస్తూ ఈ పథకంపై తనకు పర్యవేక్షణ అధికారం లేదని స్పష్టం చేయడంతో మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచినీటి ట్యాంకర్లతో దాహార్తి తీరుస్తామని చెప్పడంతో ఎమ్మెల్యే ప్రభాకర్‌ మండిపడ్డారు. మీరు మాటలు చెప్పి పబ్బం గడుపుకుంటున్నారని మా ఆవేదన అరణ్యరోదనే అయ్యిందని అన్నారు. ఐటీడీఏలో కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా గిరిజనుల సంక్షేమ పనులు చేపట్టడంలో జరిగిన వైఫల్యంపై ఎంపీ కావూరి ధ్వజమెత్తారు. ఐటీడీఏకు పూర్తి స్థాయిలో పీఓ లేకపోవడంలేకనే ఇబ్బందులు తలెత్తుతున్నాయని కలెక్టర్‌ బదులిచ్చారు. జిల్లా పశుక్రాంతి పథకం కింద మంజూరు చేసిన రుణాలపై మంత్రి పితాని అనుమానాలు వ్యక్తం చేయడంతో ఇన్‌చార్జి జేసీ శేషగిరి బాబును విచారణకు ఆదేశించారు. కాలువ గట్లు, మీడియం డ్రైన్లు, చెరువుల గట్లపై చెట్లు పెంచేందుకు పర్మిషన్‌ ఇవ్వాలన్న విషయంపై పరిశీలించాల్సిందిగా కావూరి కలెక్టర్‌కు సూచించారు.