ఇస్రో మరో అరుదైన ఘనత


` స్పేడెక్స్‌ డీ డాకింగ్‌ ప్రక్రియ విజయవంతం
న్యూఢల్లీి (జనంసాక్షి):అంతరిక్ష ప్రయోగాల్లో భాగంగా ఉపగ్రహాలను నింగిలోనే అనుసంధానం చేసే మిషన్‌ను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చేపట్టిన విషయం తెలిసిందే. భవిష్యత్‌లో చేపట్టబోయే భారీ అంతరిక్ష యాత్రలకు అవసరమైన ఈ కీలక పరిజ్ఞానాన్ని ఒడిసిపట్టిన ఇస్రో ఆ దిశగా మరో అడుగు వేసింది. తాజాగా స్పేడెక్స్‌ డీ డాకింగ్‌ ప్రక్రియ విజయవంతంగా నిర్వహించింది. దీనిపై అంతరిక్ష సంస్థకు కేంద్రమంత్రి జితేంద్రసింగ్‌ శుభాకాంక్షలు తెలియజేశారు.’’ఈ విజయం ప్రతి భారతీయుడిలో ఉత్సాహాన్ని నింపుతుంది. నమ్మశక్యం కాని డీ డాకింగ్‌ ప్రక్రియను స్పేడెక్స్‌ శాటిలైట్లు పూర్తి చేశాయి. భారతీయ అంతరిక్ష స్టేషన్‌, చంద్రయాన్‌`4, గగన్‌యాన్‌ సహా భవిష్యత్‌ ప్రయోగాలకు మార్గాన్ని సుగమం చేసింది’’ అని మంత్రి ఎక్స్‌ వేదికగా రాసుకొచ్చారు. ఉపగ్రహాలను నింగిలోనే అనుసంధానించే మిషన్‌లో భాగంగా ఇస్రో.. గతేడాది డిసెంబర్‌ 30న ఛేజర్‌, టార్గెట్‌ జంట ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపించింది. పలు ప్రయత్నాల అనంతరం చివరకు జనవరి 16న డాకింగ్‌ ప్రక్రియ (ూజూజీఆవచీ) విజయవంతంగా చేపట్టింది. దీంతో ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా భారత్‌ నిలిచింది. ఈ ప్రక్రియ విజయవంతం కావడంతో ఈ ప్రయోగాలను పునఃప్రారంభించేందుకు సిద్ధమైంది. మార్చి 15 నుంచి స్పేడెక్స్‌ ప్రయోగాలు చేపట్టనున్నట్లు ఇస్రో చీఫ్‌ వి.నారాయణన్‌ ఇటీవల వెల్లడిరచారు.