సాధారణ మహిళా ప్రయాణికులను యజమానులను చేస్తాం

` ఓ అన్నగా మాట ఇస్తున్నా.. మహిళల్ని కోటీశ్వరుల్ని చేస్తా
` మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తేనే రాష్ట్రంలో 1 ట్రిలియన్‌ ఆర్థిక వ్యవస్థ సాధ్యమవుతుంది
` మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు ఉండాలని సోనియాగాంధీ కృషి చేశారు
` సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో ఏర్పాటు చేసిన మహిళా శక్తి సభలో సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్‌(జనంసాక్షి): ఆడబిడ్డల ఆశీర్వాదంతో తెలంగాణలో చంద్ర గ్రహణం తొలగిపోయిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో ఏర్పాటు చేసిన మహిళా శక్తి సభలో సీఎం ప్రసంగించారు. ‘‘ఏ మార్పు కావాలని ఆడబిడ్డలు ఆశీర్వదించారో ఆ మార్పు ఇప్పుడు పరేడ్‌ గ్రౌండ్‌లో కనిపిస్తోంది. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తేనే రాష్ట్రం 1 ట్రిలియన్‌ ఆర్థిక వ్యవస్థ అవుతుందని కేబినెట్‌ విూటింగ్‌లో నిర్ణయించాం. ఆడ బిడ్డలు తలచుకుంటే వన్‌ ట్రిలియన్‌ ఆర్థిక వ్యవస్థ సాధన పెద్ద కష్టం కాదు. 65 లక్షల మంది స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్నారు. పాఠశాలల నిర్వహణ, బడి పిల్లలకు కోటి 30లక్షల జతల యూనిఫామ్‌ కుట్టించే పని మహిళలకే అప్పగించాం. జిల్లా కేంద్రాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలు కేటాయించాం. సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి మహిళా సంఘాలకు ఇచ్చాం. ఆర్టీసీలో వెయ్యి ఎలక్ట్రిక్‌ బస్సులకు యజమానులు అవుతున్నారు. మహిళల సంక్షేమం, అభివృద్ధి కోసం సీతక్క, కొండా సురేఖ పనిచేస్తున్నారు. మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు ఉండాలని సోనియాగాంధీ కృషి చేశారు. ఇందిరను అమ్మా అన్నారు.. ఎన్టీఆర్‌ను అన్నా అన్నారు.. నన్ను రేవంతన్న అంటున్నారు. విూతో పేగుబంధం కలిగిన విూ అన్నగా మాట ఇస్తున్నా.. మిమ్మల్ని కోటీశ్వరుల్ని చేస్తా’’ అని సీఎం అన్నారు.

అన్ని రంగాల్లో మహిళల అభివృద్ధి కట్టుబడి ఉన్నాం
` అదానీ, అంబాలనీలతో మహిళలు పోటీ పడే విధంగా తీర్చిదిద్దుతున్నాం
` చాకలి ఐలమ్మ మహిళా వర్సిటీలో రూ.550 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు
` వర్సిటీ విద్యార్థినులు అంతర్జాతీయ వర్సిటీలతో పోటీపడాలని ముఖ్యమంత్రి సూచన
హైదరాబాద్‌(జనంసాక్షి):మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. వ్యాపారరంగంలో అదానీ, అంబానీలతో రాష్ట్ర మహిళలు పోటీ పడే విధంగా తీర్చిదిద్దుతున్నామని ప్రకటించారు. చాకలి ఐలమ్మ మహిళా వర్సిటీలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. హైదరాబాద్‌ కోఠిలోని చాకలి ఐలమ్మ మహిళా వర్సిటీలో పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి శ్రీకారం చుట్టారు. నూతన భవన నిర్మాణాలు, చారిత్రక కట్టడాల పునరుద్ధరణ పనులను ఆయన ప్రారంభించారు. మొత్తం రూ.550 కోట్ల అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలను రేవంత్‌ రెడ్డి నిర్వహించారు. ఇవాళ యూనివర్సిటీకి వచ్చిన ముఖ్యమంత్రి ప్రధాన భవంతిలోని దర్బార్‌హాల్‌ను సందర్శించారు. అక్కడ ఉన్న చాకలి ఐలమ్మ చిత్రపటానికి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఐలమ్మ వర్సిటీ విద్యార్థినులు అంతర్జాతీయ వర్సిటీలతో పోటీపడాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆకాంక్షించారు. మహిళలకు అవకాశం వస్తే నిరూపించుకుంటున్నారని, వారిని ప్రొత్సహించేందుకు తమ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని తెలిపారు. మహిళలు రాణించాలంటే వారు ముందు వారు చదువు కోవాలని ముఖ్యమంత్రి సూచించారు.ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నం, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ, సీఎం సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి, జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ శ్రీలతా రెడ్డి, కార్పొరేషన్‌ చైర్మన్లు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. శంకుస్థాపన అనంతరం ముఖ్యమంత్రి పెరేడ్‌ గ్రౌండ్‌?లో నిర్వహిస్తున్న ఇందిరా మహిళా శక్తి వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లారు.