పెండిరగ్‌ రైల్వే ప్రాజెక్టులకు నిధులు ఇవ్వండి

` కాజీపేట కేంద్రంగా డివిజన్‌ ఏర్పాటు చేయాలి
` రైల్వేశాఖ మంత్రి అశ్విన్‌ వైష్ణవ్‌కు రాష్ట్ర మంత్రులు వినతి
హైదరాబాద్‌(జనంసాక్షి):రాష్ట్రంలోని పెండిరగ్‌ ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విన్‌ వైష్ణవ్‌కు రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, సీతక్క, కొండా సురేఖ, వరంగల్‌ ఎంపీ కడియం కావ్య విజ్ఞప్తి చేశారు. కాజీపేటలో కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని కోరారు. కాజీపేట కేంద్రంగా డివిజన్‌ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. మహబూబ్‌ నగర్‌ జిల్లా దివిటిపల్లిలో జరిగే కార్యక్రమానికి హాజరవుతున్న ఆయనను శనివారం శంషాబాద్‌ విమానాశ్రయంలో రాష్ట్ర మంత్రలు కలిశారు. దాదాపు అరగంట సేపు రాష్ట్రంలోని పెండిరగ్‌ ప్రాజెక్టులపై చర్చించారు. మంత్రుల విజ్ఞప్తిపై అశ్విన్‌ వైష్ణవ్‌ సానుకూలంగా స్పందించారు. అనంతరం మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఎంపీ కడియం కావ్య విజ్ఞప్తి మేరకు వరంగల్‌ కు రింగ్‌ రోడ్డు ఇస్తామని మంత్రి ఒప్పుకున్నారని చెప్పారు. కాజీపేట రైల్వే డివిజన్‌ ఏర్పాటు చేయాలని కోరినట్టు చెప్పారు. వికారాబాద్‌ రైల్వేలైన్‌ పెండిరగ్‌లో ఉందని, డోర్నకల్‌-భద్రాచలం రైల్వే లైన్‌ పెండిరగ్‌ లో ఉందని చెప్పారు. నస్కల్‌-హసన్‌ పర్తి- చింతలపల్లి లైన్‌ గురించి అడిగామన్నారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ.. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వరంగల్‌ ను అభివృద్ధి చేస్తామని మాటలతో కోటలు కట్టింది తప్ప పని చేయలేదన్నారు. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. దశాబ్దాల కాలంగా పెండిరగ్లో ఉన్న రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ రైల్వే డివిజన్‌ సహా తదితర అంశాలపై విజ్ఞప్తి చేశామని చెప్పారు. బీజేపీ తరఫున కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలని కోరారు. వరంగల్‌ లో ఎయిర్‌ పోర్టు అందుబాటులోకి వస్తే అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ.. కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని చెప్పారు. రైల్వే డివిజన్‌ గా మార్చాలన్న అంశాన్నీ ప్రస్తావించామని ఆమె చెప్పారు. కాకతీయ టెక్ట్సైల్‌ పార్కుకు కావలసిన విధంగా రైలు మార్గాలను ఏర్పాటు చేయాలని రైల్వే అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. వరంగల్‌ ఎయిర్పోర్ట్‌ ,టెక్ట్సైల్‌ ఇండస్టీ మధ్య కావలసిన రైల్వే లైన్‌ పై పార్లమెంటు సమావేశాల్లో చర్చించనున్నట్టు కావ్య చెప్పారు.