ఆ ముగ్గురి హత్యలో.. వైద్య నిష్ణాతుడి హస్తం?ఐఎంఎ నుండి వివరాల సేకరణ : పోలీసులు
నేడో, రేపో అగంతకుడి ఊహాచిత్రాలు విడుదల
నెల్లూరు, జూలై 28 : రెండు రోజుల క్రితం భద్రాచలం-చెన్నయ్ బస్సులో ముగ్గుర్ని దారుణంగా హతమార్చి ఒకరి ప్రాణాపాయ స్థితికి కారణమైన అగంతకుడు వైద్య విభాగానికి చెందినవాడిగా పోలీసులు భావిస్తున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నుంచి వివరాలు తెప్పించుకుని వైద్యుల్లో ఎక్కడైన సైకోగా మారిన వ్యక్తులు ఉన్నారా అన్న విషయంపై విచారణ జరుపుతున్నట్టు జిల్లా ఎస్‌పి బీవీ రమణకుమార్ తెలిపారు. హత్య చేసేందుకు ఉపయోగించిన ఆయుధాన్ని సర్జికల్ బ్లేడుగా గుర్తించడంతో వైద్య వృత్తితో సంబంధం ఉన్న వ్యక్తులే ఇలాంటి చర్యలకు పాల్పడి ఉంటారనేది పోలీసుల అనుమానం. దీనికితోడు హతుల శరీర భాగాల్లో చోటు చేసుకున్న గాయాలను పరిశీలిస్తే అవి డెత్ స్పాట్స్‌గా పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. అంటే ఒక మనిషిని కత్తితో లేదా సర్జికల్ బ్లేడుతో టార్గెట్ చేసినప్పుడు వెనువెంటనే చనిపోవడానికి అవకాశం ఉంది.. భాగాలను ఎంచుకుని హత్యకు పాల్పడ్డట్టు డాక్టర్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడించారు. మానవుని శరీరంలోని పీక భాగంలో ఉన్న అతి సున్నితమైన నరాన్ని తెంచివేయడం సర్జికల్ బ్లేడు ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. అలాగే గుండె క్రింద ఉండే ప్రత్యేక అవయవానికి చిన్న పాటి గాయం చేసినా వెనువెంటనే చనిపోయే అవకాశం ఉందని నివేదికలో వెల్లడించింది. ఆ విధంగా చనిపోయిన నిరంజన్, రాంబాబు, అజయ్ బిశ్వాల్ శరీర భాగాలను పరిశీలిస్తే సర్జికల్ బ్లేడుతో ఆ భాగాలలోనే గాయాలు చేసినట్టు వెల్లడైంది. ఇది ఆపరేషన్ చేసే సమయాల్లో, ఆపరేషన్ చేసే నిపుణులకే సాధ్యమని వైద్యులు ధృవీకరించడంతో ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అదీగాక అగంతకుడు హత్య చేయడానికి ఉపయోగించిన పద్ధతి కూడా విచిత్రంగా ఉన్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఒకే సీటులో కూర్చుని ఉన్న ముగ్గుర్ని క్షణాల్లో ముందు నోరు మూయడం.. పొడవడం.. వంటి చర్యతో బాధితుడు అరిచే అవకాశం లేకుండా పోయిందని పోస్టుమార్టం వెల్లడించింది. అయితే ఈ ప్రక్రియలో తప్పించుకున్న రమేష్ పెద్దగా కేకలు వేయడం వల్లే సంఘటన వెలుగులోకి వచ్చి డ్రైవర్ అప్రమత్తమయ్యారని నివేదిక పేర్కొంది. దీన్ని బట్టి ఆపరేషన్లలో నిష్ణాతుడైన వైద్యుడు లేదా కాంపౌండర్ శాడిస్టుగా మారి ఈ చర్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ కోణంలో 18 గంటల పాటు సత్యవీడు అటవీ ప్రాంతంలో కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించిన పోలీసులు శుక్రవారం సాయంత్రం బాగా పొద్దుపోయాక ఒడిషా ప్రాంతానికి చెందిన మదన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని ఇంటరాగేషన్ చేశారు. అదే సమయంలో ఖమ్మం జిల్లా భద్రాచలం ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల వయస్సు ఉన్న బి.శ్రీను అనే యువకుడ్ని కూడా భద్రాచలంలో శుక్రవారం ఉదయం అరెస్టు చేసి ప్రత్యేక వాహనంలో సాయంత్రానికి తడ పోలీసుస్టేషన్‌కు తరలించి ఇంటరాగేషన్ చేశారు. బస్సు డ్రైవర్ జాన్ చెప్పిన అగంతకుడి బాడీ లాంగ్వేజ్‌ను నేపథ్యంలో ఈ ఇద్దర్ని ప్రశ్నించడం జరిగిందని, ఈ హత్యలకు వారికి ఎటువంటి సంబంధం లేదని గుంటూరు రేంజి ఐజి హరీష్‌కుమార్ గుప్త శుక్రవారం రాత్రి తడ పోలీసుస్టేషన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. చూచాయగా బస్సు డ్రైవర్, సంఘటనలో గాయపడ్డ రమేష్ వెల్లడించిన వివరాల ప్రకారం పోలీసులు అగంతకుడి ఊహా చిత్రాలను రూపొందిస్తున్నారు. బహుశా ఈ రోజు లేదా రేపు గాని అతని ఊహా చిత్రాలు విడుదల చేసే అవకాశం ఉందని విశ్వసనీయంగా తెలిసింది. అయితే దీన్ని ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఊహా చిత్రాలు విడుదల చేసినట్టు చెబుతుండగా.. అధికారులు మాత్రం ధృవీకరించలేదు. ఇదిలా ఉండగా హత్య జరిగిన భీములవారిపాలెం చెక్‌పోస్టు తమిళనాడు సరిహద్దుకు కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉండడం వల్ల తమిళనాడు నుంచి 10 ప్రత్యేక బృందాలు ఆరంబాకం ప్రాంతంలో తీవ్ర గాలింపు చర్యలు చేపట్టాయి. అలాగే వరదయ్యపాలెం చిత్తూరు జిల్లా సరిహద్దు ప్రాంతం కావడం వల్ల చిత్తూరు నుంచి 5 ప్రత్యేక బృందాలు అటవీ ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపడుతున్నాయి. కాగా నెల్లూరు జిల్లాలో 200 పోలీసులతో 20 టీములను ఏర్పాటు చేసిన జిల్లా ఎస్‌పి బీవీ రమణకుమార్, గుంటూరు రేంజ్ ఐజి హరీష్‌కుమార్ తడలోనే మకాం వేసి ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు.