ఆరావళిపై ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీం స్టే
` కొత్తకమిటీతో పర్వతాల అధ్యయనానికి ఆదేశం
న్యూఢల్లీి(జనంసాక్షి):ఆరావళి పర్వత శ్రేణుల్లో మైనింగ్ వివాదంపై సిజెఐ జస్టిస్ సూర్యకాంత నేతృత్వంలో సోమవారం విచారణ సందర్భంగా కీలక నిర్ణయం ప్రకటించింది. గతంలో ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కు తీసుకుంది. ఇటీవల ఆరావళి కొండలకు ఆమోదించిన నిర్వచనాలకు సంబంధించిన కొన్ని వివరణలు అవసరమని సుప్రీం కోర్టు సోమవారం పేర్కొంది, అదే సమయంలో ఈ అంశంపై గత నెలలో జారీ చేసిన తీర్పుపై స్టే విధించింది. గతంలో అధికారులతో కూడిన కమిటీ చేసిన సిఫార్సుల పర్యావరణ ప్రభావాన్ని అధ్యయనం చేయడానికి నిపుణుల కమిటీ ఏర్పాటు చేస్తామని కోర్టు పేర్కొంది. ఆరావళి కొండల నిర్వచనంపై దాఖలైన సమస్యపై సుమోటో కేసులో కోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. 100 విూటర్లలోపు ఎత్తు ఉన్న ఆరావళి పర్వతాల వద్ద మైనింగ్‌కు గతంలో అనుమతులు ఇచ్చింది సుప్రీంకోర్టు. తాజాగా గతంలో ఇచ్చిన ఆదేశాలపై స్టే విధిస్తూ నేడు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. పర్యావరణపరంగా పలు రాష్టాల్రకు రక్షణ కవచంగా ఉన్న ఆరావళి పర్వతాలపై కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిర్వచనానికి సుప్రీంకోర్టు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. అయితే ఈ కొత్త నిర్వచనం జాతీయస్థాయిలో దుమారం రేపుతోంది. ఈ క్రమంలో తాజాగా సుప్రీంకోర్టు స్పందించింది. గత నెల తాను ఇచ్చిన ఆదేశాలను సోమవారం నిలిపివేసింది. ‘కోర్టు ఆదేశాలు, కమిటీ సిఫార్సులు నిలిపివేయడం అవసరమని మేం భావిస్తున్నాం. కొత్త కమిటీ ఏర్పాటయ్యేవరకు ఈ స్టే అమల్లో ఉంటుంది‘ అని ధర్మాసనం పేర్కొంది. కొత్త నిపుణుల బృందాన్ని ఏర్పాటుచేయాలని ఆదేశించడంతో పాటు కేంద్ర ప్రభుత్వం, సంబంధిత రాష్టాల్రకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జనవరి 21కి వాయిదా వేసింది.దేశంలోనే అతిపురాతన పర్వతశ్రేణి ఆరావళి. ఇక్కడ అక్రమంగా పొందిన అనుమతులతో అడ్డగోలుగా మైనింగ్ జరుగుతోందని ఎప్పటినుంచో ఆందోళన ఉంది. ఇలాంటి సమయంలో 100 విూటర్లు… అంటే 328 అడుగుల కంటే ఎక్కువ ఎత్తున్నవి మాత్రమే పర్వతాలంటూ కేంద్రం కొత్త నిర్వచనం చెప్పింది. 100 విూటర్ల కంటే తక్కువ ఎత్తులో ఉన్న కొండల్లో మైనింగ్‌కు అనుమతించింది. దీనివల్ల హరియాణా, రాజస్థాన్, గుజరాత్, దిల్లీకి ముప్పు తప్పదని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆరావళి పర్వత శ్రేణులు ఉన్న రాష్టాల్రు కొత్తగా మైనింగ్ లీజులేవీ ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిషేధం విధించింది. గుజరాత్ నుంచి జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్) వరకూ విస్తరించి ఉన్న ఆరావళి పర్వత శ్రేణుల సమగ్రతను పరిరక్షించేందుకు, గనుల అక్రమ తవ్వకాలను అడ్డుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్న సంగతి తెలిసిందే. విచారణ సందర్భంగా తాత్కాలిక దరఖాస్తుదారుల ప్రవర్తనపై సీజెఐ తీవ్ర అసంతృప్తి చెందారు. ఆరావళి పర్యతాలపై క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని, పర్యావరణ ముప్పునకు పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని కమిటీకి సూచించింది. ఈ కేసును జనవరి 21న వివరణాత్మకంగా విచారణ చేపట్టాలని కోర్టు ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు.
కారుణ్య నియామకం హక్కు కాదు.. తక్షణ భరోసా
` ఉన్నత న్యాయస్థానం
న్యూఢల్లీి(జనంసాక్షి):ప్రభుత్వ ఉద్యోగుల మరణానంతరం వారి కుటుంబ సభ్యులకు కల్పించే కారుణ్య నియామకాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. కారుణ్య నియామక ప్రాతిపదికన ఒకసారి ఉద్యోగాన్ని అంగీకరించిన తర్వాత, తమకు అర్హత ఉన్నా అంతకంటే ఉన్నత పదవి కావాలని కోరుతూ దరఖాస్తు చేసుకోవడానికి వీల్లేదని కోర్టు స్పష్టం చేసింది.తమిళనాడు పట్టణ పంచాయతీల్లో స్వీపర్లుగా పనిచేస్తూ మరణించిన ఇద్దరు వేర్వేరు ఉద్యోగుల కుమారులకు (ఎం.జయబల్, ఎస్.వీరమణి) వారి తండ్రుల మరణానంతరం 2007, 2012 సంవత్సరాల్లో స్వీపర్లుగానే ఉద్యోగాలు లభించాయి. వారు ఉద్యోగంలో చేరే సమయంలో ఎలాంటి అభ్యంతరం తెలపకుండా ఆ కొలువుల్లో చేరారు. అయితే, సుమారు 3 నుంచి 9 ఏళ్ల తర్వాత తమకు జూనియర్ అసిస్టెంట్ పోస్టుకు కావాల్సిన అర్హతలు ఉన్నాయని, అప్పట్లో అవగాహన లేక తక్కువ స్థాయి ఉద్యోగంలో చేరామని పేర్కొంటూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు వారికి అనుకూలంగా తీర్పునివ్వగా, దానిని సవాలు చేస్తూ దాఖలైన అప్పీల్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.
సుప్రీంకోర్టు తీర్పులోని ముఖ్యాంశాలు
కారుణ్య నియామకం అనేది రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 16 (సమానత్వ హక్కు)కు ఒక మినహాయింపు మాత్రమే. కుటుంబ పెద్దను కోల్పోయి ఆర్థిక సంక్షోభంలో ఉన్న కుటుంబానికి తక్షణ భరోసా ఇవ్వడమే దీని ఉద్దేశం. ఇది ఒక హక్కు కాదు లేదా కెరీర్ అభివృద్ధి కోసం ఇచ్చే అవకాశం కాదు. అభ్యర్థికి ఉన్నత పదవికి కావాల్సిన విద్యార్హతలు ఉన్నప్పటికీ ఖాళీలు, ప్రభుత్వ నిబంధనల ప్రకారమే తదుపరి నియామకం జరుగుతుంది. అర్హత ఉంది కదా అని ఉన్నత పదవిని డిమాండ్ చేసే హక్కు అభ్యర్థికి ఉండదు.ఉద్యోగంలో చేరిన చాలా ఏళ్ల తర్వాత (3`9 ఏళ్లు) కోర్టును ఆశ్రయించడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ‘వేరే ఒకరికి నిబంధనలకు విరుద్ధంగా ఉన్నత పదవి ఇచ్చారు కాబట్టి, మాకూ ఇవ్వాలి’ అనే వాదనను కోర్టు తోసిపుచ్చింది. ఒక అధికారి చేసిన తప్పును మరొకరికి వర్తింపజేయమని కోర్టులు ఆదేశించలేవని చెప్పింది. తప్పును పునరావృతం చేయలేమని స్పష్టం చేసింది.
న్యాయ నిపుణుల విశ్లేషణ
ఈ తీర్పుపై న్యాయ నిపుణులు స్పందిస్తూ, ఇది ప్రభుత్వ నియామక ప్రక్రియల సమగ్రతను కాపాడుతుందని పేర్కొన్నారు. కారుణ్య నియామకాలు కేవలం మానవతా దృక్పథంతో చేసేవని, వీటిని సీనియారిటీ పెంచుకోవడానికి లేదా ఉన్నత పదవులు అనుభవించడానికి వాడుకోలేమని ఈ తీర్పు ద్వారా స్పష్టమైందని అభిప్రాయపడ్డారు. మద్రాస్ హైకోర్టు ఇచ్చిన పాత తీర్పును కొట్టివేస్తూ, పిటిషన్లను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. దీంతో కారుణ్య నియామకం పొందిన వారు భవిష్యత్తులో ఉన్నత పదవుల కోసం ఇలాంటి క్లెయిమ్స్ చేయడానికి అవకాశం లేకుండా పోయింది.
కుల్దీప్ సింగ్ సెంగార్ బెయిల్ రద్దు
` ఉన్నావ్ అత్యాచార కేసులో సుప్రీం ఉత్తర్వులు
` అతడికి మరణశిక్షపడేవరకు నా పోరాటం ఆగదు..
` ఉన్నావ్ అత్యాచార బాధితురాలు
న్యూఢల్లీి(జనంసాక్షి): ఉన్నావ్ అత్యాచార కేసులో సుప్రీమ్ ధర్మాసనం కీలక నిర్ణయం తీసుకుంది. 2017లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ అత్యాచార కేసులో.. బీజేపీ బహిష్కృత నేత కుల్దీప్ సింగ్ సెంగార్‌కు ఢల్లీి హైకోర్టు ఇటీవల బెయిల్ మంజూరు చేసింది. దీన్ని సవాల్ చేస్తూ ఇద్దరు న్యాయవాదులు సుప్రీం కోర్టులో దాఖలు చేశారు. మరోవైపు ఇదే విషయమై.. సీబీఐ కూడా సర్వోన్న న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తూ స్పెషల్ లీవ్ పిటిషన్లు వేసింది. కుల్దీప్ బయటకు వస్తే కేసుపై ప్రభావం పడే అవకాశముందని సీబీఐ పేర్కొంది.ఈ వ్యాజ్యంపై సీజేఐ సూర్యకాంత్, న్యాయమూర్తులు జేకే.మహేశ్వరి, జస్టిస్ అగస్టీన్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం.. సోమవారం విచారణ చేపట్టింది. బాధితురాలి భద్రతకు సంబంధించిన అంశాలతో సీబీఐ ప్రస్తావించిన అంశాలను ధర్మాసనం పరిశీలించింది. ఈ మేరకు ఢల్లీి హైకోర్టు ఇచ్చిన తీర్పు ఉత్తర్వులను నిలిపివేయడంతో పాటు నిందితుడు కుల్దీప్ సెంగార్‌కు నోటీసులు జారీ చేసింది. బెయిల్ రద్దు పిటిషన్‌పై నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని సెంగార్‌ను ఆదేశించింది.ఉత్తర్ ప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలో 2017లో 17ఏళ్ల ఓ బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. మాజీ ఎమ్మెల్యే, నాటి బీజేపీ నేత కుల్దీప్ సెంగార్ ఈ కేసులో ప్రధాన నిందితుడిగా తేలాడు. అయితే.. ఈ కేసు విచారణలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. 2018లో ఈ కేసును సీబీఐ విచారణ చేపట్టింది. ఆ తర్వాత యూపీ ట్రయల్ కోర్టు, ఢల్లీి కోర్టులకు మారింది. 2019 డిసెంబర్‌లో కుల్దీప్ దోషిగా తేలడంతో అతనిపై జీవితఖైదు విధించింది న్యాయస్థానం. అయితే.. తాజాగా ఈ కేసులో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. సెంగార్‌కు పోక్సో చట్టం వర్తించదని.. ఢల్లీి హైకోర్టు ఇటీవల షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
‘అతడికి మరణశిక్షపడేవరకు నా పోరాటం ఆగదు..
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ అత్యాచార ఘటనలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సెంగర్ జైలు శిక్షను సస్పెండు చేస్తూ దిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సోమవారం సుప్రీంకోర్టు స్టే విధించింది. దీనిపై బాధితురాలు విూడియాతో మాట్లాడారు. సెంగర్‌కు ఉరిశిక్ష పడేవరకు తన పోరాటం ఆగదని వెల్లడిరచారు. అప్పుడే తన తండ్రికి, తనకు న్యాయం జరుగుతుందన్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానంపై అపార విశ్వాసం ఉందని వ్యాఖ్యానించారు 2017లో కుల్దీప్ సింగ్ సెంగర్ ఉత్తర్‌ప్రదేశ్ లోని ఉన్నావ్ ప్రాంతానికి చెందిన ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు అభియోగాలు నమోదయ్యాయి. ఆగస్టు 1, 2019న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అత్యాచారం కేసు, సంబంధిత ఇతర కేసులను ఉత్తరప్రదేశ్‌లోని ట్రయల్ కోర్టు నుంచి దిల్లీ హైకోర్టుకు బదిలీ చేశారు. ఈ కేసుపై ఇటీవల విచారణ జరిపిన దిల్లీ హైకోర్టు సెంగర్ శిక్షను నిలిపివేస్తున్నట్లు వెల్లడిరచింది. కోర్టు తీర్పునకు వ్యతిరేకంగా బాధితురాలు, మహిళా సంఘాల నేతలు నిరసన చేపట్టారు. ఈ తీర్పుపై బాధితురాలి తరఫు న్యాయవాదులు, సీబీఐ అధికారులు సుప్రీంను ఆశ్రయించగా తాజాగా ఊరట లభించిన సంగతి తెలిసిందే.
సెంగర్ కుమార్తె బహిరంగ లేఖ..
మరోవైపు.. తన తండ్రికి న్యాయం కావాలని కోరుతూ సెంగర్ కుమార్తె ఇషిత ఎక్స్ వేదికగా బహిరంగ లేఖ విడుదల చేశారు. తన తండ్రి ఎదుర్కొంటోన్న విచారణ కారణంగా తన కుటుంబానికి బెదిరింపులు వస్తున్నాయని పేర్కొన్నారు. ఒక కూతురిగా ఎంతో అలసిపోయానని, ఇంకా చిన్న ఆశ ఏదో మిగిలివుందని రాసుకొచ్చారు.


