ఎటిఎం కార్డులు ఇవ్వడానికి ఆంధ్రబ్యాంకు మేనేజర్ అభ్యంతరం
ఖమ్మం, జూలై 24 : మా బ్యాంకులో ఖాతా తెరవండి అంటూ బ్యాంకులు పోటీ పడుతుంటే పాల్వంచ పట్టణంలోని కేటిపిఎస్ కాలనీలోని ఆంధ్రబ్యాంకు శాఖలో ఖాతాలు తెరిచిన వినియోగదారులు ఎటిఎం కార్డులు కావాలని అడిగితే మాత్రం మేనేజర్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. పాల్వంచలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న 20 మందికి పైగా విద్యార్థులు కేటిపిఎస్ శాఖ ఆంధ్రబ్యాంకులో అకౌంట్లు తెరిచారు. విద్యార్థులకు స్కాలర్షిప్లు వచ్చే అవకాశం ఉండడంతో ఎటిఎం కార్డు కావాలని బాధిత ఖాతాదారులు బ్యాంకు మేనేజర్‌ను కోరినా పట్టించుకోకపోగా ఎటిఎం కార్డులు ఇవ్వనని నిరాకరిస్తున్నట్లు బాధితులు వాపోతున్నారు. ఈ సమస్యపై బ్యాంకు ఎదుట బాధితులు ఆందోళన నిర్వహించనున్నట్లు తెలిపారు.