ఏ ముల్క్‌కా నూర్‌ హై !


ముల్కనూరు స్త్రీ శక్తి దేశానికే ఆదర్శం
సహకారానికే కొత్త భాష్యం చెప్పిన
ముల్కనూరు సహకార సంస్థలు
గవర్నర్‌ నరసింహ్మ

భీమదేవరపల్లి(కరీంనగర్‌ జిల్లా), సెప్టెంబర్‌ 14 (జనంసాక్షి): ముల్కనూర్‌లోని సంస్థలు సహకారానికే కొత్త బాష నేర్పాయాని, ముల్కనూర్‌లోని స్త్రీశక్తి దేశానికి ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ ప్రశంసించారు. జిల్లాలోని భీమదేవరపల్లి మండలంలో శుక్రవారం ఆయన పాలడైరీ సహకార సంస్థ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో బీపీఎల్‌ (బిలో పావర్టి లైన్‌) కుటుంబాలు లేకుండా చూడాలనేదే తన కల అని రాష్ట్ర గవర్నర్‌ఇ.ఎన్‌.ఎల్‌ నర్సింహన్‌ అన్నారు. రాష్ట్రం అభివృద్థి చేందినప్పుడే పేదరికం తగ్గు తుందని అన్నారు. పరస్పర సహకారంతోనే అభివృద్ధి సాధ్యపడుతుందని, ములుకనూరు మహిళా డైరీ స్పూర్తితో ముందుకు సాగాలని అన్నారు. వీరి స్పూర్తితో రాష్ట్రంలోని ఇతర జిల్లాలో సహకార రంగం విస్తరించాలని అన్నారు. పేదరికం సంపూర్ణంగా తొలగిపోయినప్పుడే వారి సంక్షేమం కొరకు ప్రభుత్వం ఇస్తున్న రాయితీలను ఆతర అభివృద్ధి కార్యక్రమాలకు మరలించే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. ముల్కనూరు సహకార సంఘం దేశంలోని మహిళలకు ఆదర్శవంతంగా నిలవాలని అన్నారు. రాష్ట్రంలోని అన్ని సహకార సంఘాల రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు. ధాన్యం ఉత్పత్తులను పెంచే విధంగా కృషి చేస్తే ప్రతిఒక్కరూ ఆర్థికంగా ఎదగడమే కాక దారిద్య్రరేఖకు దిగువన ఉన్న పేదలు ఆర్థికంగా ఎదుగుతారని అన్నారు. సహకార సంఘాల ద్వారా విద్యార్థులు మరింత ముందుకు వెళ్ళిన నాడు నిరుద్యోగ సమస్య ఉండదని అన్నారు. సహకార సంఘాల ద్వారా కాలేజీలు, వైద్యశాలలు ఏర్పాటు చేసినట్టయితే నిరుద్యోగ సమస్య ఉండబోదని గవర్నర్‌ తెలిపారు. శ్రీశక్తి సహకారంతో పాలఉత్పత్తి కేంద్రాలు 15గ్రామాలకు విస్తరించడంతో ఆయా ప్రాంతాల్లోని మహిళలు ఆర్థికంగా లాభాల బాటలో ముందుంటారని అన్నారు. జిల్లాలో పాల ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేసే దృక్పథంతో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని సూచించారు. సహకారసంఘం సంస్థను అభివృద్ధికి తీసుకువచ్చిన ఘనత స్థానిక ఎమ్మెల్యే ప్రవీణ్‌ రెడ్డిదేనని అంటూ ఆయనను గవర్నర్‌ అభినందించారు. మరో మారు ఇక్కడికి తాను వచ్చి ఈ ప్రాంత ప్రజలను వారు చేసే పనులను పరిశీలిస్తానని అన్నారు. జిల్లా ఇన్‌ఛార్జీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో కరీంనగర్‌ జిల్లా రైతులు ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలుస్తారని అన్నారు. దేశంలోనే రాష్ట్రం 68శాతం పంటలు పండించడంలో అగ్రభాగాన నిలిచిందని అన్నారు. మిగతా దేశాలతో పోలిస్తే మనరాష్ట్రం వ్యవసాయ రంగంలో ముందుందని అన్నారు. ప్రభుత్వం రైతులకు ఆర్టీకల్చర్‌తో పాటు మహిళలకు మిల్లర్ల మిషన్లు ఏర్పాటుకు ఆరువేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నదని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చోరవ వల్లనే ఇది జరుగుతున్నదని అన్నారు. మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ సహకార సొసైటీల ద్వారానే ఇతర సొసైటీలు కూడా ముందుకు వెళ్ళాలని అన్నారు. సహకార బ్యాంకు జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ వందల కోట్ల రూపాయల లాభాలు సహకార బ్యాంకుకు వచ్చాయని అన్నారు. స్వశక్తి మహిళలు, పాల వ్యాపారంతో పాటు రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేసి ఆర్థికంగా లాభ పడుతుండడాన్ని ఆయన అభినందించారు.