ఐదవ రోజుకు చేరిన ఆమరణ నిరాహార దీక్ష

కడప, జూలై 20: ప్రజా సమస్యల పరిష్కారం కోసం టిడిపి ఆధ్వర్యంలో జరుగుతున్న ఆందోళన పట్ల ప్రభుత్వం ఏ మాత్రం స్పందించకపోవడం దురదృష్టకరమని ఆ పార్టీ ఎమ్మెల్యే పరిటాల సునీత చెప్పారు. జిల్లాలో రైతుల సమస్యలు, విద్యుత్‌ సమస్య, సిమెంట్‌ ధరల తగ్గింపు తదితర అంశాలపై తెలుగుదేశం పార్టీ నాయకులు కలెక్టరేట్‌ వద్ద చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష శుక్రవారం నాటికి ఐదవ రోజుకు చేరింది. దీక్షా శిబిరాన్ని సునీత సందర్శించి వారి ఆందోళనకు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రజా సమస్యల పట్ల ప్రభుత్వం ఏ మాత్రం స్పందించడం లేదని ఆరోపించారు. టిడిపి ప్రజా ప్రతినిధులు ఐదు రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేదని దుయ్యబట్టారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని అన్నారు.