రూ.వెయ్యి కోట్ల కిక్కు

` నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణలో భారీగా మద్యం అమ్మకాలు
హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణలో నూతన సంవత్సరం సందర్భంగా భారీగా మద్యం విక్రయాలు జరిగాయి. మూడు రోజుల్లో దాదాపు రూ.వెయ్యి కోట్లు విలువైన మద్యం విక్రయాలు జరిగినట్టు ఆబ్కారీ శాఖ అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. 2024 డిసెంబర్‌ నెల చివరి మూడు రోజుల్లో రూ.736 కోట్లు విలువైన మద్యం విక్రయాలు జరగ్గా…. 2025 డిసెంబర్‌ చివరి మూడు రోజుల్లో రూ.980 కోట్లకుపైగా విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్లు ఆబ్కారీ శాఖ చెబుతోంది. నూతన మద్యం విధానంలో భాగంగా కొత్తగా లైసెన్స్‌లు పొందిన దుకాణదారులు డిసెంబర్‌ నుంచి మద్యం దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారు.రాష్ట్రంలోని మొత్తం 3,620 మద్యం దుకాణాలు, దాదాపు 1,100 బార్‌లు, పబ్‌లు, క్లబ్‌లు కలిసి డిసెంబర్‌ నెలలో రూ.4,920 కోట్ల విలువైన మద్యాన్ని డిపోల నుంచి కొనుగోలు చేశారు. డిసెంబరు 25 నుంచి నిన్నటి వరకు మద్యం విక్రయాలు విలువ రూ.1,350 కోట్లకుపైగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. డిసెంబరు 29న రూ.280 కోట్లు, 30న రూ.380 కోట్లు, 31న రూ.315 కోట్లకుపైగా విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. ఈ మూడు రోజుల్లోనే దాదాపు రూ.1000 కోట్లు విలువైన మద్యం విక్రయాలు జరగడం గమనార్హం. మొత్తం 8.30 లక్షల కేసుల లిక్కర్‌, 7.78 లక్షల కేసుల బీరు అమ్మకాలు జరిగాయి.