‘ఆయుష్‌’ను హత్యచేసిన సీఎం నితీశ్‌

హిజాబ్‌ లాగినందుకు విధుల్లో చేరకుండా వైద్యురాలి నిరసన
డిసెంబర్‌ 31తో గడువు విధించినా రాని డాక్టర్‌ నుస్రత్‌ పర్వీన్‌
ముఖ్యమంత్రి చర్యతో వేరేప్రాంతానికి వెళ్లిపోయిన బాధితురాలి కుటుంబం!
పాట్నా(జనంసాక్షి) : బీహార్‌ లో జరిగిన ఉద్యోగ నియామక పత్రాల స్వీకరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ ఓ వైద్యురాలి హిజాబ్‌ తొలగించడంపై పెద్దఎత్తున వివాదం నెలకొన్న విషయం విదితమే. ఆ ఘటనతో ఇబ్బందిపడిన సదరు వైద్యురాలు నుస్రత్‌ పర్వీన్‌ ఇంకా విధుల్లో చేరలేదని స్థానిక అధికారులు వెల్లడిరచారు. నియామక పత్రాలు అందుకున్న వైద్యులు పోస్టింగ్‌లో చేరడానికి ఇచ్చిన గడువు బుధవారంతో ముగిసినా సబల్‌ పూర్‌ ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో విధుల్లో చేరాల్సిన ఆమె నుంచి ఎటువంటి సమాచారం లేదని అధికారులు తెలిపారు. రిపోర్టు చేయకపోతే ఆమె అపాయింట్‌మెంట్‌ రద్దు చేయాల్సి ఉంటుందన్నారు. కాగా హిజాబ్‌ వివాదం తర్వాత పర్వీన్‌ కుటుంబం పట్నా నుంచి కోల్‌కతాకు మారినట్లు తెలిసింది. అయితే సీఎం నితీశ్‌ హిజాబ్‌ లాగిన సందర్భంలో నిశ్చేష్టురాలిగా ఉండిపోయిన డాక్టర్‌ నుస్రత్‌ పర్వీన్‌.. ఆయన చర్యతో తీవ్రంగా ఇబ్బంది పడినట్టు తెలిసింది. ఈ ఘటన తర్వాత, ఆమె బయటకు వెళ్లకుండా, మీడియాతో మాట్లాడకుండా ఆమె భర్త ఆజ్ఞాపించినట్లు తెలుస్తోంది. పర్వీన్‌ విధులకు హాజరు కాలేదని సబల్‌పూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సర్జన్‌గా పనిచేస్తున్న విజయ్‌ కుమార్‌ సైతం తెలిపారు. వైద్యులు తమకు కేటాయించిన కేంద్రాలలో బాధ్యతలు స్వీకరించడానికి ముందు సివిల్‌ సర్జన్‌ కార్యాలయంలో నివేదించాలని ఆయన పేర్కొన్నారు.
అసలేం జరిగిందంటే..
డిసెంబర్‌ 15న పాట్నాలోని ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ నివాసంలో కొత్తగా ఎంపికైన ఆయుష్‌ వైద్యులకు నియామక పత్రాలను అందజేసే కార్యక్రమం చేపట్టగా.. ఉద్యోగానికి ఎంపికైన ముస్లిం మహిళ హిజాబ్‌ ధరించి హాజరయ్యారు. ఆమెకు నియామక పత్రాన్ని అందజేసిన తర్వాత ముఖ్యమంత్రి ఆ మహిళ ధరించిన హిజాబ్‌ గురించి అడిగి, దానిని తీసివేయమని సూచించారు. ఆ వెంటనే ఆయనే స్వయంగా దానిని తొలగించారు. దీంతో అక్కడున్న కొందరు నవ్వడంతో ఆమె కలత చెందారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కాగా ముఖ్యమంత్రి తీరుపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించాయి. తదనంతరం ముఖ్యమంత్రి చర్యకు నిరసనగానే వైద్యురాలు ఉద్యోగంలోకి రాలేదని సర్వత్రా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.