న్యూయార్క్‌ సిటీ మేయర్‌గా మామ్‌దానీ

ఖురాన్‌ చేతపట్టి ప్రమాణం చేసిన జోహ్రాన్‌
న్యూయార్క్‌(జనంసాక్షి):అమెరికాలోని న్యూయార్క్‌ సిటీ మేయర్‌గా జోహ్రాన్‌ మామ్‌దానీ బుధవారం రాత్రి ప్రమాణ స్వీకారం చేశారు. చరిత్రాత్మకమైన మన్‌హట్టన్‌ సబ్‌వే స్టేషన్‌ వద్ద ప్రమాణ స్వీకారం చేశారు. ఖురాన్‌ గ్రంధంపై చేయి వేసి ఆయన ప్రమాణం చేశారు. మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేపట్టడాన్ని గౌరవంగా, జీవితకాల అవకాశంగా భావిస్తున్నట్లు మామ్‌దానీ తెలిపారు. న్యూయార్క్‌ అటార్నీ జనరల్‌ లెటిటా జేమ్స్‌ ప్రమాణం చేయించారు. న్యూయార్క్‌ సిటీకి తొలి ముస్లిం మేయర్‌గా మామ్‌దానీ నిలిచారు. ఓల్డ్‌ సిటీ హాల్‌ సబ్‌వే స్టేషన్‌ వద్ద ప్రమాణస్వీకార కార్యక్రమం జరగడం గమనార్హం. భారతీయ మూలాలు ఉన్న మామ్‌దానీ ఆఫ్రికాలో జన్మించారు. న్యూయార్క్‌ సిటీకి మేయర్‌గా అతిపిన్న వయస్కుడిగా రికార్డు క్రియేట్‌ చేశారు. మామ్‌దానీ వయసు 34 ఏళ్లు. ఫ్రీ చైల్డ్‌కేర్‌, ఫ్రీ బస్సులు లాంటి ఎన్నికల హావిూలు చేశారాయన. ఉగాండా రాజధాని కంపాలాలో మామ్‌దానీ జన్మించారు. ఫిల్మ్‌మేకర్‌ విూరా నాయర్‌, మహమూబ్‌ మామ్‌దానీ దంపతులకు ఆయన పుట్టారు. జోహ్రాన్‌ ఏడేళ్ల వయసు ఉన్నప్పుడు కుటుంబం న్యూయార్క్‌కు వలస వెళ్లింది. 2018లో అమెరికా పౌరుడిగా ఆయనకు గుర్తింపు వచ్చింది. డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థుల తరపున రాజకీయ ప్రచారం నిర్వహించారు. జోహ్రాన్‌ భార్య రమా దువానీ.