ఫ్యూచర్‌ సిటీతో కొత్త జిల్లాకు ఛాన్స్‌

` గ్రేటర్‌ పరిధిలో జిల్లాల విభజన
` కసరత్తు చేస్తోన్న ప్రభుత్వం
హైదరాబాద్‌,జనవరి1(జనంసాక్షి):హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థను పునర్విభజించిన తరహాలోనే గ్రేటర్‌ పరిధిలో జిల్లాలను మార్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కొత్తగా ఏర్పాటైన ఫ్యూచర్‌సిటీ పోలీస్‌ కమిషనరేట్‌, పునర్విభజించిన హైదరాబాద్‌, సైబరాబాద్‌, మల్కాజిగిరి పోలీస్‌ కమిషనరేట్ల హద్దులు.. జిల్లాల సరిహద్దులు ఒకే విధంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు అనుగుణంగా కొన్ని మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. దీనిని బట్టి మరో కొత్త జిల్లా ఏర్పడే అవకాశం ఉంది. కొత్తగా ఏర్పాటైన ఫ్యూచర్‌సిటీ కమిషనరేట్‌ పరిధికి సమానంగా ఒక కొత్త జిల్లాను ఏర్పాటు చేయనున్నారని తెలిసింది. వీటికి సంబంధించిన డ్రాప్ట్‌ నోటిఫికేషన్‌ కొద్ది రోజుల్లో విడుదల చేయనున్నట్టు సమాచారం. గ్రేటర్‌ పరిధిలో కొద్దిరోజుల క్రితం వరకు 3 పోలీస్‌ కమిషనరేట్లు, మూడు జిల్లాలున్నాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధి నాలుగు పోలీస్‌ కమిషనరేట్లుగా మారిన నేపథ్యంలో మూడు జిల్లాల పరిధిని కూడా మార్చాలంటూ సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించినట్టు తెలిసింది. హైదరాబాద్‌, మల్కాజిగిరి జిల్లాల సరిహద్దులను మార్చేందుకు రెవెన్యూశాఖ ఉన్నతాధికారులు వివరాలు సేకరిస్తున్నారని సమాచారం. హైదరాబాద్‌ జిల్లాలో మార్పులు.. చేర్పులు చోటుచేసుకోనున్నాయి. జిల్లాలో 16 మండలాలున్నాయి. ఇందులో తిరుమలగిరి, మారేడ్‌పల్లి మండలాలను మల్కాజిగిరి జిల్లాలోకి మార్చనున్నారు. అవిూర్‌పేట మండలంలోని బేగంపేట ప్రాంతాన్ని కూడా మల్కాజిగిరి జిల్లాలో భాగం చేయనున్నారు. హైదరాబాద్‌ జిల్లాల సరిహద్దు మండలాలుగా బండ్లగూడ, బహదూర్‌పురలుండగా… ఇకపై రాజేంద్రనగర్‌, శంషాబాద్‌ మండలాలకు విస్తరించనుంది. ఈ మండలాల్లో జీహెచ్‌ఎంసీ పరిధి ఎంత వరకు ఉంటుందో.. అంతవరకు మాత్రమే హైదరాబాద్‌ జిల్లా పరిధిలోకి రానుంది. మేడ్చల్‌`మల్కాజిగిరి జిల్లా ప్రస్తుతం సైబరాబాద్‌, మల్కాజిగిరి పోలీస్‌ కమిషనరేట్ల పరిధిలో ఉంది. పునర్విభజన అనంతరం మల్కాజిగిరి కమిషనరేట్‌ పరిధి ఎంతవరకు ఉందో… జిల్లా అంతవరకు విస్తరించనుంది. మేడ్చల్‌`మల్కాజిగిరి జిల్లాలో రంగారెడ్డి జిల్లాలోని సరూర్‌నగర్‌, హయత్‌నగర్‌ మండలాలు విలీనం కానున్నాయి. మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎల్బీనగర్‌(రంగారెడ్డి జిల్లా), కంటోన్మెంట్‌(హైదరాబాద్‌ జిల్లా) శాసనసభ నియోజకవర్గాలు మేడ్చల్‌ జిల్లా పరిధిలోకి రానున్నాయి. మల్కాజిగిరి పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం ఉండగా… అది జీహెచ్‌ఎంసీ పరిధి దాటి ఉండడంతో ఈ మండలంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. రంగారెడ్డి జిల్లా పరిధి విస్తృతంగా ఉండడం, జిల్లా పరిధిలో ఐటీ సంస్థలు, పరిశ్రమలు, గేటెడ్‌ కమ్యూనిటీలుండడంతో అర్బన్‌, రూరల్‌ జిల్లాలుగా విభజించనున్నారు. సైబరాబాద్‌ పోలీస్‌ కమిషరేట్‌ పరిధి మొత్తాన్ని అర్బన్‌ జిల్లాగా, ఫ్యూచర్‌సిటీ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిని రూరల్‌ జిల్లాగా విభజించనున్నారు. షాద్‌నగర్‌, శంషాబాద్‌ రూరల్‌ మండలం, చేవెళ్ల, ఆమనగల్లు, కేశంపేట, తలకొండపల్లి, మాడ్గుల, యాచారం, మంచాల, కందుకూరు, మహేశ్వరం మండలాలను రూరల్‌ జిల్లాగా ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.