ఓటుకు ఐదొందల నోటు.

 పరకాల నియోజకవర్గంలో తెలంగాణ వ్యతిరేక పార్టీలకు ఓటమి తప్పదనే భయం పట్టుకున్నది. ఈ ఓటమి నుంచి ఎలాగైనా బయటపడాలని కాంగ్రెస్‌, వైఎస్సార్‌ కాంగ్రెస్‌, తెలుగుదేశం తదితర పార్టీలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. తెలంగాణవాదం బలంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో గెలవడం సాధ్యం కాదని తెలుసుకున్న ఆయా పార్టీలు ఓటర్లను మభ్య పెట్టేందుకు, ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగానే పెద్ద మొత్తంలో డబ్బు, మద్యం, చీరలు తదితర వస్తువలు పంపిణీ చేస్తున్నారు. నియోజకవర్గంలో పెద్దఎత్తున నోట్ల పంపిణీ జరుగుతోందనే ప్రచారం జోరుగా సాగుతున్న క్రమం లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ
పార్టీ అభ్యర్థి కొండా సురేఖ నోట్లు పంచుతూ అడ్డంగా దొరికిపోయారు. సీమాంధ్ర నుంచి వచ్చిన నల్ల డబ్బులను పంచుతున్నప్పుడు ఓ టీవీ కెమెరాకు చిక్కారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం పరకాల మండలం నార్లాపూర్‌ గ్రామంలో సురేఖ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె కొంతమంది ఓటర్లకు కరపత్రాలతోపాటు ఐదు వందల రూపాయల నోట్లు  పంపిణీ చేశారనే  అభియోగంపై పోలీసులు ఆమెపై కేసు నమోదు  చేసినట్లు సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ కిరణకుమార్‌ తెలిపారు. అదే విధంగా టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత డాక్టర్‌ శ్రవణ్‌ సురేఖపై అనర్హత వేటు వేయాలని ఈసీకి ఫిర్యాదు చేశారు.