కరీంనగర్‌లో కొకైన్‌ గరళం

విక్రయిస్తూ పట్టుబడ్డ బువకులు
నిందితుల్లో ఇకరు మైనరు కాగా ,మిగతా ఇద్దరు 2ఏళ్ల లోపువారే
తల్లి దండ్రుల్లో ఆందోళన, దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు
వేములవాడ / కరీంనగర్‌, ఆగస్టు 2, (జనంసాక్షి) :
నిన్నా మొన్నటి వరకు రాజధానిలో మాత్రమే లభించి, అక్కడి యువతను మాత్రమే తన మత్తులో ముంచుతూ వారి జీవితాలను చిత్తు చేస్తున్న అత్యంత ప్రమాదకర మాదక ద్రవ్యమైన కొకైన్‌ ఇప్పుడు మెల్లమెల్లగా హైదరాబాద్‌ దాటుతోంది. హైదరాబాద్‌లో అధికా రుల దాడులు ఎక్కువ కావడం, కొకైన్‌ విక్రేతలు వారానికోసారి పట్టుబడుతున్న నేపథ్యంలో మాదక ద్రవ సరఫరా ముఠాలు ప్రస్తుతం రాష్ట్రంలోని జిల్లాల వైపు దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తున్నది. ముఖ్యంగా నైజారియా దేశం నుంచి మన దేశంలోకి అక్రమంగా సప్లయి అవుతున్న కొకైన్‌, మొన్నటి వరకు హైదరాబాద్‌ శివార్లలోని క్లబ్బుల్లో, పబ్బుల్లో మాత్రమే విక్రయించేవారు. కానీ, కొకైన్‌ వ్యాపారులు అక్కడ తమ ఆగడాలు సాగడం లేదని తెలుసుకుని, రూటు మార్చి జిల్లాల్లో తమ వ్యాపారాన్ని జరిపేందుకు సిద్ధపడ్డట్లు విశ్వసనీ యంగా తెలిసింది. ఈ సమాచారానికి బలం చేకూరేలా గురువారం కరీంనగర్‌ జిల్లాలో ముగ్గురు యువకులు జిల్లా కేంద్రంలో కొకైన్‌ విక్రయిస్తూ పోలీసులకు
చిక్కారు. వీరి నుంచి సుమారు 2 గ్రాముల కొకైన్‌ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల్లో ఇద్దరి వయస్సు 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండగా, మరో యువకుడు మైనర్‌ కావడం గమనార్హం. ఈ ముగ్గురిని పోలీసులు కరీంనగర్‌ మెజిస్ట్రేట్‌ వద్దకు తీసుకెళ్లారు. కానీ, మెజిస్ట్రేట్‌ సెలవులో ఉండడంతో జిల్లా కేంద్రానికి దగ్గరలో ఉన్న వేములవాడ కోర్టుకు రాత్రి తీసుకువచ్చారు. మెజిస్ట్రేట్‌ వెంకటేశ్‌ కుమార్‌ ఎదుట హాజరు పర్చారు. మెజిస్ట్రేట్‌ నిందితుల్లోని మైనర్‌ యువకుడికి బెయిలు మంజూరు చేయగా, మరో ఇద్దరిని రిమాండ్‌కు తరలించాలని ఆదేశించారు. రాత్రి కావడంతో పోలీసులు ఇద్దరు నిందితులను కరీంనగర్‌లోని టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అనంతరం వారిని జిల్లా సబ్‌ జైలుకు పంపనున్నట్లు వివరించారు. అయితే, నిందితుల దగ్గర దొరికిన కొకైన్‌ విలువ లక్షల్లో ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా, జిల్లా కొకైన్‌ దొరకడం ఇదే మొదటి సంఘటన కావడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. పోలీసులు కూడా తల్లిదండ్రులు తమ పిల్లలపై ఓ కన్నేసి ఉంచాలని, రాత్రిళ్లు తిరుగకుండా జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు. కొకైన్‌ జీవితం నాశనం అవుతుందని, ఇలాంటి మాదక ద్రవ్యాలతో యువత అప్రమత్తంగా ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ వాటి జోలికి వెళ్లకూడదని హితవు పలుకుతున్నారు. ఏదేమైనా మొదటిసారి కొకైన్‌ లాంటి అత్యంత ప్రమాదకర, ఖరీదైన మాదకద్రవ్యం దొరకడం జిల్లాలో తీవ్ర చర్యనీయాంశమైంది.