కరువు మేఘాలు కమ్ముకున్నాయా?

కష్టాల్లో ఖరీఫ్‌
రాష్ట్రం మీద అంటే ఇతిమిద్దంగా నిర్ధారించ లేకపోతున్నారు. ఎందుకంటే విత్తనాలు విత్తిన దుక్కులు ఆకాశం వైపు ఆశగా చూస్తుంటే అమ్మో ఈసారి కూడా వరుణుడు పగపట్టాడా? అని అనిపించకమానదు. రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించి పక్షం రోజులు దాటినా సరైన వానలు పడి నేల తల్లికి సేదతీర్చలేకపోయాయి. అస్సాం లాంటి రాష్ట్రాల్లో వరద నీటిని చూస్తుంటే వానలకేమీ కరువులేదులే అనిపిస్తోంది. దేశ వ్యాప్తంగా ఇప్పటికే 26 శాతం కంటే తక్కువ వర్షపాతం నమోదైందంటే ఆందోళన కలిగించేలా ఉందని రైతులు అంటుంటే, వాతావరణ అధికారులు మాత్రం గగ్గోలు పెట్టాల్సిన పనిలేదని జూలై 15 వరకు రుతుపవనాలు పుంజుకోనిపక్షంలో అప్పుడు ఆందోళన చెందాలని అంటున్నారు. జూన్‌ 1-20 మధ్య కాలంలో దేశ వ్యాప్తంగా మామూలుగా 90.6 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 67.4 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. ఇక మన రాష్ట్రంలో పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. ఖరీఫ్‌ సీజన్‌లో 200 లక్షల ఎకరాల్లో పంటలు వేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 5 శాతం అంటే 12 లక్షల ఎకరాల్లో విస్తీర్ణంలో కూడా సాగు కాలేదు. రాబోయే కాలంలో రుతుపవనాలు మరింత మందగిస్తే ‘ ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక’ రూపకల్పనకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. నీటి కోసం కుంటలు, చెరువులు జలాశయాలు నోళ్లు తెరుచుకున్నాయి. తుంగభద్ర జలాశయంలో నీటి మట్టం గణనీయంగా తగ్గిపోయింది. దీంతో తుంగభద్ర కాల్వలకు జూలైలో నీటి విడుదల గగనమే అంటున్నారు. గత ఏడాది ఈ ప్రాజెక్టులో ఈ సమయానికి నీటి మట్టం 1605.8 అడుగులు ఉండగా, ఈసారి 1580.24 అడుగులకు పడిపోయింది. జల విద్యుత్‌ ఉత్పత్తిలో ప్రధానమైన శ్రీశైలంలో గత ఏడాది 804.9 అడుగులనీరు ఉండగా, 53.2 టీఎంసీలు మాత్రమే ఉంది. నీటి మట్టం 799 అడుగులకు పడిపోయింది. నీటి నిలువ డెడ్‌ స్టోరేజీ కంటే తక్కువగా ఉండడంతో విద్యుత్‌ ఉత్పత్తి సైతం కష్టసాధ్యంగా మారింది. రాష్ట్ర రైతన్నకు గుండెకాయ లాంటి నాగార్జునసాగర్‌లో సైతం నీరు డెడ్‌ స్టోరేజీలోనే ఉంది. నీటి మట్టాల్లో ప్రగతిలేక పోయినప్పటికీ అదును దాటి సాగు చేస్తే ఆశించిన దిగుబడి రాదనే దృష్టితో డెడ్‌ స్టోరేజీ నుంచి నారుమళ్ల కోసం నీటి విడుదలకు ప్రభుత్వం సమాయత్తమవగా, తెలంగాణ ప్రజలు తాగే నీటిని సీమాంధ్రుల సాగుకు పారిస్తారా? అంటూ టీఆర్‌ఎస్‌ అడ్డుకోవడంతో ఇప్పుడు ‘ప్రాంతీయ రగడ’ ప్రారంభమైంది. దాదాపు కృష్ణా డెల్టాలో 13 లక్షల హెక్టార్లలోని నారుమళ్లు నీటి చుక్క అందక నేల వాలుతున్నాయి. వేలాది రూపాయలతో వేసిన నారుమళ్లను బతికుంచుకునేందుకు బిక్కచిక్కిన రైతన్నకు వరుణుడు ఇంత వరకు భరోసా ఇవ్వలేదు. ఆకాశంలో నల్లని మేఘాలు కమ్ముకోవటం అంతలోనే టాటా చెప్పటం గత నెల రోజుల నుంచి రైతన్న చూస్తున్నాడు. కొండంత ఆశతో ఖరీఫ్‌కు సిద్ధమైన కర్షకుడి కష్టాలు కాలమే సమాధానం చెప్పాలి.