అలయ్‌ బలాయ్‌ స్పూర్తి తెలంగాణ ఉద్యమంలో కీలకం

` సీఎం రేవంత్‌ రెడ్డి
` రేవంత్‌, చంద్రబాబు కలిసి పనిచేసి ఆంధ్రా,తెలంగాణను అగ్రభాగంలో నిలబెట్టాల
` హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ
హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణ సంస్కృతిని నలుదిశలా వ్యాపింపచేయడమే ‘అలయ్‌ బలయ్‌’ ముఖ్య ఉద్దేశమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. పల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి అధ్యక్షతన నిర్వహించిన ‘అలయ్‌ బలయ్‌’ కార్యక్రమానికి ఆయన విశిష్ట అతిథిగా హాజరై మాట్లాడారు.తెలంగాణ ప్రజలకు అతిపెద్ద పండగ దసరా అని చెప్పారు. ఈ పర్వదినాన గుర్తొచ్చేది పాలపిట్ట, జమ్మిచెట్టు అన్నారు. ‘అలయ్‌ బలయ్‌’ అంటే గుర్తొచ్చేది బండారు దత్తాత్రేయ అని చెప్పారు. ఆయన నుంచి వారసత్వంగా తీసుకొని విజయలక్ష్మి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారన్నారు. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకోవడానికి ‘అలయ్‌ బలయ్‌’ స్ఫూర్తిగా పనిచేసిందని చెప్పారు. రాజకీయాలతో సంబంధం లేకుండా దీన్ని నిర్వహిస్తుండటం అభినందనీయమని పేర్కొన్నారు. దత్తాత్రేయ.. తెలంగాణ సంస్కృతిని కాపాడేలా కృషి చేస్తున్నారని కొనియాడారు.
ఆకట్టుకుంటున్న సాంస్కృతిక కార్యక్రమాలు
హైదరాబాద్‌: నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి అధ్యక్షతన ‘అలయ్‌ బలయ్‌’ నిర్వహిస్తున్నారు.దత్తాత్రేయ ఢంకా మోగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కళాకారుల సంప్రదాయ నృత్యాలు, కోలాటం, గిరిజన నృత్యాలు ఆకట్టుకున్నాయి. పోతురాజుల విన్యాసాలు, హైదరాబాదీ సంప్రదాయ మర్ఫా వాయిద్య సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమానికి విశిష్ట అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ముఖ్య అతిథిగా గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ హాజరు కానున్నారు. కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఉత్తరాఖండ్‌ గవర్నర్‌ గుర్మిత్‌ సింగ్‌, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, తెలంగాణ వ్యవసాయ కమిషన్‌ ఛైర్మన్‌ కోదండరెడ్డి పాల్గొన్నారు.ఏటా దసరా మరుసటి రోజు ‘అలయ్‌ బలయ్‌’ కార్యక్రమం నిర్వహిస్తుంటారు. అన్ని పార్టీల నేతలను ఒకే వేదిక పైకి తీసుకువచ్చే లక్ష్యంతో ఏర్పాటు చేస్తారు. ఇక్కడ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించే రీతిలో సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి.
రేవంత్‌ రెడ్డి, చంద్రబాబు కలసిమెలసి పనిచేయాలి : దత్తాత్రేయ
 హైదరాబాద్‌ నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో దసరా సమ్మేళనం`2024 వైభవంగా జరిగింది. అలయ్‌ బలయ్‌ అధ్యక్షురాలు బండారు విజయలక్ష్మి అధ్యక్షతన ఏర్పాటైన కార్యక్రమాన్ని హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ ఢంకా మోగించగా, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు లాంఛనంగా ప్రారంభించారు. సంప్రదాయ నృత్యాలు, కోలాటం, గిరిజన నృత్యాలు, పోతరాజుల విన్యాసాలు, పులి వేషాలు అలయ్‌ బలయ్‌లో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దంపట్టాయి. హైదరాబాదీ సంప్రదాయ మర్ఫా వాయిద్య సంగీతం విశేషంగా ఆకట్టుకుంది.ఈ సందర్భంగా మాట్లాడిన బండారు దత్తాత్రేయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలసిమెలసి రాష్ట్రాల అభివృద్ది కోసం పని చేయాలని అన్నారు. రాజకీయాలకతీతంగా పరస్పరం సహకరించుకుని, ఐకమత్యంతో ముందుకు వెళ్లి, దేశంలోనే తెలంగాణ, ఏపీ రాష్ట్రాలను అగ్రస్థానంలో నిలపాలని దత్తాత్రేయ సూచించారు. రాజకీయాలతో సంబంధం లేకుండా 2005లో అలయ్‌ బలయ్‌ ప్రారంభించామని, ప్రేమ, ఆత్మీయత, ఐఖ్యత చాటి చెప్పాలన్నదే అలయ్‌ బలయ్‌ లక్ష్యమని వివరించారు. ఈసారి కులవృత్తులకు ప్రాధాన్యత ఇస్తూ అలయ్‌ బలయ్‌లో ప్రదర్శించామన్నారు.ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్‌ జిష్టుదేవ్‌ వర్మ, సీఎం రేవంత్‌? రెడ్డి, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఉత్తరాఖండ్‌ గవర్నర్‌ గుర్మిత్‌ సింగ్‌, రాజస్థాన్‌ గవర్నర్‌ హరిబాబు పగాడే, మేఘాలయ గవర్నర్‌ సీహెచ్‌ విజయ శంకర్‌, కేంద్రమంత్రి జి.కిషన్‌ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్‌, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి, ఎమ్మెల్సీ కోదండరాం, నటుడు కోట శ్రీనివాసరావు, తెలంగాణ వ్యవసాయ కమిషన్‌ ఛైర్మన్‌ కోదండరెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, మాజీ ఎంపీ బీబీపాటిల్‌, సీపీఐ నేత, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, మాజీ మంత్రి జానారెడ్డి, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ప్రముఖ గాయకుడు వందేమాతరం శ్రీనివాస్‌, ఎయిమ్స్‌ డైరెక్టర్‌ వికాస్‌ భాటియా, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత వీహెచ్‌ తదితరులు హాజరయ్యారు.ఇలాంటి కార్యక్రమాల ద్వారా అందరూ ఏకం కావాలి : ‘అలయ్‌ బలయ్‌’ సందర్భంగా అందరినీ కలుసుకోవడం ఆనందంగా ఉందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకటయ్యనాయుడు అన్నారు. స్నేహశీలి అయిన బండారు దత్తాత్రేయ ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఓ చక్కని సంప్రదాయాన్ని ఏర్పాటు చేయటం, వారి కుమార్తె విజయలక్ష్మి ఆ సంస్కృతిని కొనసాగించటం అభినందనీయమని కొనియాడారు. ఇలాంటి కార్యక్రమాలు రాజకీయాలకు అతీతంగా, సమైక్యతా భావాన్ని పెంపొందిస్తాయన్నారు.ప్రస్తుత పరిస్థితుల్లో సమైక్యతా వారధుల నిర్మాణం మనందరి సామాజిక బాధ్యతగా పేర్కొన్న ఆయన, ఒకప్పుడు ఐక్యత లేక పరాయి పాలనలో సమస్యలు అనుభవించామన్నారు. ఇప్పుడు పాశ్చాత్య అనుకరణ కారణంగా కుటుంబానికి, సమాజానికి దూరమౌతున్నామని తెలిపారు. ఈ పరిస్థితుల్లో మన భారతీయ సంస్కృతిలో భాగమైన ఇలాంటి కార్యక్రమాల ద్వారా అందరూ ఏకం కావాలన్నారు.ఐక్యంగా ఉండటం అంటే అంతా ఒకే మాట విూద నిలబడటమే కాదు, పక్కవారి ఆలోచనలను, భావాలను గౌరవించటం కూడా అని వెంకయ్య వివరించారు. అలయ్‌ బలయ్‌ సందర్భంగా రాజకీయాలకు అతీతంగా అందరినీ ఒకే వేదిక విూద చూడటం ఎంతో ఆనందంగా ఉంటుందని పేర్కొన్నారు. రాజకీయ విభేదాలు సిద్ధాంతాలకే పరిమితం కావాలని, నేతలు వ్యక్తిగత దూషణలకు దిగితే, అది కార్యకర్తల వరకూ పాకుతుందని, ఇది సమాజ శ్రేయస్సుకు మంచిది కాదని హితవు పలికారు. ఇలాంటి కార్యక్రమాల స్ఫూర్తితో సమాజంలో ఐక్యతా స్ఫూర్తిని, సమష్టి తత్వాన్ని పెంపొందించేందుకు ప్రజాప్రతినిధులు కృషి చేయాలని ఆకాంక్షిస్తున్నట్లు వెంకయ్యనాయుడు అన్నారు.

తాజావార్తలు