ఆ భూమి మా కొద్దు
` ప్రభుత్వం కేటాయించిన ఐదెకరాల భూమిని తిరిగివ్వనున్న ఖర్గే కుటుంబం
బెంగళూరు(జనంసాక్షి):కర్ణాటక లో ముడా స్కాం ప్రకంపనలు సృష్టిస్తున్న వేళ.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కుటుంబం కీలక నిర్ణయం తీసుకుంది.ఖర్గే కుటుంబానికి చెందిన సిద్ధార్థ విహార్ ట్రస్ట్‌కు గతంలో కర్ణాటక ఇండస్ట్రియల్ ఏరియాస్ డెవలప్‌మెంట్ బోర్డ్ (కేఐఏడీబీ) కేటాయించిన ఐదు ఎకరాల భూమిని తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించుకున్నట్లుగా సమాచారం.ప్రస్తుతం మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) స్కాంపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఖర్గే కుటుంబం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.రాహుల్ ఖర్గే నేతృత్వంలోని సిద్ధార్థ విహార్ ట్రస్ట్‌కు గతంలో కర్ణాటక ప్రభుత్వం బగలూరులోని హైటెక్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ పార్క్ హార్డ్‌వేర్ సెక్టార్‌లో ఐదుకరాల భూమిని మంజూరు చేయడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండిరచాయి. ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేస్తోందని భాజపా నేత అమిత్ మాలవీయ విమర్శించారు.కర్ణాటక ప్రభుత్వం ఐదెకరాల భూమిని సిద్ధార్థ విహార్ ట్రస్టుకు కేటాయించింది. ట్రస్ట్‌లో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, ఆయన అల్లుడు రాధాకృష్ణ, కుమారుడు రాహుల్ ఖర్గే మొదలైన వారు ట్రస్టీలుగా ఉన్నారు. అయితే ఈ స్థలం కేటాయింపులో అవకతవకలు, అవినీతి జరిగిందని ఆరోపిస్తూ దినేష్ కల్లహల్లి అనే వ్యక్తి కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్‌కు అధికారికంగా ఫిర్యాదు చేశారు. కాగా ఈ విషయంపై కర్ణాటక పరిశ్రమల శాఖ మంత్రి ఎంబీ పాటిల్ మాట్లాడుతూ రాహుల్ ఖర్గే దరఖాస్తు ప్రకారం అర్హతలు పరీక్షించిన తరువాతే మెరిట్ ఆధారంగా భూమి కేటాయించినట్లు పేర్కొన్నారు.కొంత కాలంగా కర్ణాటక రాజకీయాల్లో ముడా స్కామ్ కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంలో చిక్కుకున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మనీలాండరింగ్ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.