ఉల్లంఘనలు జరగలేదు

` రాజ్యాంగ బద్ధంగానే మండలి చీఫ్‌ విప్‌ సహా, ఇతర నియామకాలు
` హరీశ్‌.. మీకిది తగదు: మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణ శాసన మండలి చీఫ్‌ విప్‌ సహా, ఇతర నియామకాలు రాజ్యాంగ బద్ధంగానే జరిగాయని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. ఎక్కడా ఉల్లంఘనలు జరగలేదన్నారు.మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రతి విషయాన్ని రాజకీయం చేయడం తగదన్నారు. కేసీఆర్‌ హయాంలో హరీశ్‌రావు శాసనసభ వ్యవహారాల మంత్రిగా ఉన్న సమయంలో ఏం జరిగిందో అందరికీ తెలుసని, అప్పుడు రాజ్యాంగం గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలను ఒక్కొక్కరిగా భారాసలో చేర్చుకున్నారని విమర్శించారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే మండలి ఛైర్మన్‌, సభాపతి నిర్ణయాలు తీసుకుంటారని తెలిపారు. సంప్రదాయం ప్రకారమే ప్రతిపక్ష సభ్యుడికి పీఏసీ ఛైర్మన్‌ పదవి ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. అనర్హత పిటిషన్ల అంశం న్యాయస్థానం పరిధిలో ఉందన్నారు.మండలి చీఫ్‌ విప్‌గా ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డిని ఎలా నియమించారని మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రశ్నించిన సంగతి తెలిసిందే. రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోందని చెప్పేందుకు ఇదొక ఉదాహరణ అని ఆయన అన్నారు. పీఏసీ ఛైర్మన్‌ విషయంలో కూడా ఇలాగే వ్యవహరించారని విమర్శించారు. ఈ నేపథ్యంలోనే మంత్రి శ్రీధర్‌బాబు స్పందించారు.

తాజావార్తలు