చిట్టి నాయుడి పాలనలో ప్రతి ఒక్కరికి బాధలే
మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన చిట్టి నాయుడి పాలనలో ప్రతి ఒక్కరి బాధ పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలు జరుగుతున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్వీ సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.ఎన్నో ప్రాణాత్యాగాలతో ఏర్పడ్డ రాష్ట్రం ఇది. మీ తాగ్యాలతో పునీతమైన నేల ఈ తెలంగాణ నేల. ఈ పదేండ్లలో నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో పని చేశాం. నీళ్లల్లో సంపూర్ణమైన విజయం సాధించాం. కాళేశ్వరం వంద శాతం పూర్తయింది. పాలమూరు – రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టులు 95 శాతం పూర్తయ్యాయి. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీరు ఇచ్చి దశాబ్దాల తాగునీటి గోసను సమూలంగా తుడిచిపెట్టాం అని కేటీఆర్ తెలిపారు.
ఎవరికి ఏ కష్టం వచ్చినా తెలంగాణ భవన్‌కే..
నిధుల విషయానికి వస్తే.. 2014లో తలసరి ఆదాయంలో తెలంగాణ 14వ స్థానంలో ఉండే. గతేడాది కేసీఆర్ దిగిపోయే నాటికి తలసరి ఆదాయంలో నంబర్ వన్ స్థానానికి ఎదిగాం. అన్ని వర్గాల కుటుంబాల్లో ఒక ఆర్థిక భరోసా నింపామని కేటీఆర్ గుర్తు చేశారు. రాష్ట్రంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా తెలంగాణ భవన్‌కు వస్తున్నారు.. 10 జిల్లాల నుంచి ఆశా కార్యకర్తలు వచ్చి తమ బాధలు చెప్పుకున్నారు. మా జీతం రూ. 1500 ఉంటే.. అడగకముందే రూ. 9900 చేసిన మహానుభావుడు కేసీఆర్ అని ఆశా కార్యకర్తలు తెలుపుతున్నారు. మాకు ఆశ పెట్టి మోసం చేశారని ఆవేదన చెందారు. 9 వేలు ఏంది.. 18 వేలు ఇస్తామని చెప్పి పత్తా లేకుండా పోయారు. మా కోసం మాట్లాడండి అని కోరారు. సందర్భానుసారంగా సమావేశాలు నిర్వహించి చిట్టి నాయుడిని వణికించి, న్యాయం చేస్తామని ఆశా కార్యకర్తలకు భరోసా ఇచ్చినట్లు కేటీఆర్ పేర్కొన్నారు.
95 శాతం రిజర్వేషన్లకు తూట్లు..
గ్రూప్-1 వాయిదా కోసం అశోక్ నగర్‌లో నిన్న రాత్రి అభ్యర్థులు రోడ్డెక్కారు. రిజర్వేషన్ల అమలు విషయంలో అన్యాయం జరుగుతుంది. 95 శాతం రిజర్వేషన్లకు తూట్లు పొడుతున్నారు. మాకు ఉద్యోగాలు రాకుండా చిట్టి నాయుడు మోసం చేస్తున్నారని అభ్యర్థులు ఆరోపించారు. 60 శాతం రిజర్వేషన్లను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు కల్పించేవారు. మిగతా 40 శాతం ఓపెన్ కోటాలో జనరల్ కేటగిరిలో కూడా మెరిట్‌లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు అవకాశం కల్పించేవారు. కానీ ఇవాళ దాన్ని కూడా తుంగలో తొక్కారు. జీవో 55ను రద్దు చేసి జీవో 29ని అమలు చేస్తున్నారు. పరీక్ష రాసేందుకు మాకు అభ్యంతరం లేదు. 3 లక్షల మందిలో 30 వేల మందికి మేం క్వాలిఫై అయ్యాం.. కానీ పరీక్ష రాసిన తర్వాత.. కాంగ్రెస్ ప్రభుత్వం లోపభూయిష్ట ఉత్తర్వులు తప్పని పరీక్షలను రద్దు చేస్తే మళ్లీ రాయాల్సిన పరిస్థితి వస్తదని గ్రూప్-1 అభ్యర్థులు అంటున్నారు.
రైతులు తిట్టని తిట్టు తిడుతున్నారు..
సీఎం రేవంత్ రెడ్డి మూర్ఖపు విధానాల వల్ల గాంధీ భవన్, బీజేపీ ఆఫీసు వైపు జనాలు చూడడం లేదు. చలో తెలంగాణభవన్ అని ఇటు వైపు వస్తున్నారు. హైడ్రా బాధితులు కూడా వచ్చారు. చిట్టి నాయుడి పాలలో ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు. రైతులు తిట్టని తిట్టు తిడుతున్నారు. ఆడబిడ్డల పెళ్లిళ్లకు తులం బంగారం ఇవ్వలేదు. బతుకమ్మ చీర దిక్కు లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు బతుకమ్మ చీరలు, క్రిస్మస్ కానుక, రంజాన్ తోఫా వచ్చేవి అని ఆడబిడ్డలు బాధపడే పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని కేటీఆర్ తెలిపారు.