పుట్టుకనీది.. చావు నీది.. ` బతుకంతా దేశానిది

` తుది శ్వాస వరకు పీడిత ప్రజల పక్షపాతమే..
` అండ జైళ్లో పదేళ్లపాటు నిర్భంధించిన హింసించినా మొక్కవోని దీక్ష
` నేడు సాయిబాబా భౌతిక ఖాయం ఆస్పత్రికి అప్పగింత
` ఆయన నేత్రాలను ఎల్వీప్రసాద్‌ కంటి ఆస్పత్రికి అందజేశాం
` కుటుంబ సభ్యుల ప్రకటన
` సవాళ్లు ఎదురైనా పోరాటం ఆపలేదు: సీఎం స్టాలిన్‌
` సాయిబాబా అకాల మరణం బాధాకరం
` ప్రజా ఉద్యమాలకు తీరని లోటు: సీపీఎం
` దేశవ్యాప్తంగా ఘన నివాళులు అర్పించిన ప్రజాప్రతినిధులు,నాయకులు
హైదరాబాద్‌(జనంసాక్షి):దిల్లీ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్‌, పౌర హక్కుల ఉద్యమకారుడు జీఎన్‌ సాయిబాబా (54) శనివారం రాత్రి హైదరాబాద్‌ నిమ్స్‌లో కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే, ఆయన కోరిక మేరకు భౌతికకాయాన్ని ఆస్పత్రికి అప్పగించనున్నట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు. ఇప్పటికే సాయిబాబా నేత్రాలను ఎల్వీప్రసాద్‌ కంటి ఆస్పత్రికి దానం చేసినట్లు తెలిపారు.సాయిబాబా భౌతిక కాయాన్ని హైదరాబాద్‌లోని జవహర్‌నగర్‌కు తరలించారు. బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు నివాళులు అర్పించిన అనంతరం ఆయన కోరిక మేరకు భౌతికకాయన్ని ఆస్పత్రికి అందజేస్తామని కుటుంబ సభ్యులు ఓ ప్రకటనలో తెలిపారు.మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో 2014లో సాయిబాబాను పోలీసులు అరెస్టు చేశారు. 2017లో ఆయనకు గడ్చిరోలి సెషన్స్‌ కోర్టు జీవితఖైదు విధించడంతో దాదాపు పదేళ్లు పాటు ఆయన జైల్లోనే గడపాల్సి వచ్చింది. ఈ ఏడాది మార్చి 5న బాంబే హైకోర్టు సాయిబాబాను నిర్దోషిగా ప్రకటించడంతో నాగ్‌పూర్‌ జైలు నుంచి విడుదలయ్యారు. మానవహక్కుల ఉద్యమకారుడు, రచయిత, విద్యావేత్తగా సాయిబాబా గుర్తింపు పొందారు.ప్రొఫెసర్‌ జి.ఎన్‌. సాయిబాబా మృతిపట్ల తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ సంతాపం ప్రకటించారు. ఆయన మరణం పౌర హక్కుల ఉద్యమానికి తీరని లోటుగా పేర్కొన్నారు. అణగారిన వర్గాలపై జరిగే అన్యాయాలకు వ్యతిరేకంగా గళం వినిపించారని, తన స్వేచ్ఛకు, ఆరోగ్యానికి ముప్పు వాటిల్లినా అవిశ్రాంతంగా పోరాడారని కొనియాడారు. పౌర హక్కులను కాపాడే క్రమంలో సవాళ్లు ఎదురైనా సాయిబాబా చూపిన ధైర్యసాహసాలు చిరస్థాయిగా నిలుస్తాయని ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు. ఈ క్లిష్ట సమయంలో ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.హక్కుల ఉద్యమకారుడు ప్రొఫెసర్‌ జీ. ఎన్‌. సాయిబాబా అకాల మరణం బాధాకరమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఆయన కుటుంబసభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. దేశంలోని ప్రజా ఉద్యమాలకు సాయిబాబా మరణం తీరని లోటన్నారు. ప్రొఫెసర్‌ సాయిబాబా మృతి పట్ల సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ సంతాపం ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఓ ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా దేశద్రోహ నేరం మోపి 90శాతం అంగవైకల్యంతో ఉన్న సాయిబాబాను ఉపా చట్టం కింద సుదీర్ఘ కాలంగా జైలులో నిర్బంధించిందని మండిపడ్డారు. అర్బన్‌ నక్సలైట్‌గా ముద్రవేసిందన్నారు. జైలులో వున్న సమయంలో ఎన్నిసార్లు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా సరైన వైద్య సౌకర్యం అందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. భాజపా ప్రభుత్వ విధానాలకు, అణచివేతకు వ్యతిరేకంగా పోరాడిన సాయిబాబా దళిత, గిరిజన, వికలాంగుల హక్కుల నేతగా, విద్యావేత్తగా పేరొందారన్నారు. ఆయన మరణం ప్రజా ఉద్యమాలకు తీరని లోటు’’ అని పేర్కొన్నారు.