పేద విద్యార్థులు చదువుకునే గురుకులాల అద్దెలు చెల్లించేందుకు పైసల్లేవా
రాష్ట్ర వ్యాప్తంగా అద్దె భవనాల్లో నడుస్తున్న గురుకుల పాఠశాలలకు వాటి యజమానులు తాళాలు వేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు.ఢిల్లీకి మూటలు పంపేందుకు పైసలు ఉన్నాయి.. కమిషనర్లు ఇచ్చే బడా కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపులకు వేల కోట్లు ఉన్నాయి. కానీ పేద విద్యార్థులు చదువుకునే గురుకులాల అద్దెలు చెల్లించడానికి పైసల్లేవా..? అని కాంగ్రెస్ సర్కార్‌ను కేటీఆర్ నిలదీశారు. సిగ్గు సిగ్గు.. ఇది గురుకులాలు శాశ్వతంగా మూసివేసే కుట్ర లాగా కనబడుతున్నది అని కేటీఆర్ పేర్కొన్నారు.గత 9 నెలలుగా ప్రభుత్వం కిరాయి చెల్లించనందుకుగాను నిరసనగా మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలకు, వసతి గృహాలకు భవనాల యజమానులు తాళాలు వేసిన విషయం తెలిసిందే. దీంతో దసరా సెలవుల తర్వాత స్కూళ్లకు వచ్చిన విద్యార్థులు, ఉపాధ్యాయులు బయట పడిగాపులు కాస్తున్నారు. తుంగతుర్తి, బెల్లంపల్లి, తాండూరు, వరంగల్, భూపాలపల్లి, హుజూర్‌నగర్, భువనగిరిలోని రెసిడెన్షియల్ పాఠశాలలు, కాలేజీలు, వసతి గృహాలకు భవనాల యజమానులు తాళాలు వేశారు. వెంటనే బకాయిలన్నింటినీ చెల్లించాలని రాష్ట్ర గురుకుల విద్యాలయ ప్రైవేట్ భవనయాజమాన్య సంఘం డిమాండ్ చేసింది.