కలెక్టర్‌ ఎదుట డ్వాక్రా మహిళ ఆత్మహత్యాయత్నం

ఏలూరు కలెక్టరేట్‌లో కలకలం
ప్రజావాణిలో దుశ్చర్య
ఏలూరు, జూలై 30 : పశ్చిమగోదావరి జిల్లాకు మహిళా కలెక్టర్‌గా ఉన్న డాక్టర్‌ వాణిమోహన్‌ ఎదుటే అధికారుల తీరును నిరసిస్తూ డ్వాక్రా మహిళ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టింది. ఎప్పటి లాగే ఈ సోమవారం కూడా ఏలూరు కలెక్టరేట్‌లో జరిగే ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్‌ సమక్షంలో బాధిత మహిళ పొంతల్‌శెట్టి లక్ష్మి ఈ దుశ్చర్యకు ఒడిగట్టింది. దాంతో ప్రజావాణిలో పాల్గొన్న అధికారులు వారికి సమస్యలపై అర్జీలు ఇచ్చుకోవడానికి వచ్చిన ప్రజలు కలవరపాటుకు గురయ్యారు. ఊహించని పరిణామంతో కలెక్టర్‌తో పాటు జిల్లా రెవెన్యూ అధికారి మోహన్‌రాజ్‌ సహ జిల్లా అధికారులంతా ఈ చర్యతో అవాక్కయ్యారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన లక్ష్మిని హుటాహుటిన 108 వాహనంలో ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటోంది. జిల్లా అధికార యంత్రాంగాన్నే నిశ్ఛేష్టులను చేసిన ఈ సంఘటనకు దారితీసిన వివరాలిలా ఉన్నాయి. లక్ష్మి స్వగ్రామం తాడెపల్లిగూడెం సమీపంలోని పెంటపాడు. ఈమె ఐకేపీ కేంద్రానికి నిర్వాహకురాలిగా పనిచేస్తోంది. గత ఖరీఫ్‌ సీజన్‌లో రైతులు పండించిన ధాన్యాన్ని ఐకేపీ కేంద్రాలు కొనుగోలు చేశాయి. దేశ వ్యాప్తంగా పశ్చిమ గోదావరి జిల్లా మహిళలు రైతుల ధాన్యాన్ని గిట్టుబాటు ధరకు కొనుగోలు చేశారని సీఎం నుంచి మంత్రులు, అధికారులు ప్రచారంతో ఊదరగొట్టారు. అయితే జిల్లాలో కొన్ని ఐకేపీ కేంద్రాలలో రైతులకు చెల్లింపులకు చేయకుండా లక్షలాది రూపాయల సొమ్మును కొన్ని చోట్ల మిల్లర్లు, మరికొన్ని చోట్ల అధికారులు పక్కదోవ పట్టించారన్న ఆరోపణలు వచ్చాయి. పెంటపాటు ఐకేపీ కేంద్రంలో కూడా ఇలాగే జరిగింది. ఈ కేంద్రంలో ధాన్యం కొనుగోలుకు సంబంధించిన రైతులకు ఇవ్వాల్సిన 30 లక్షల రూపాయల సొమ్ము పక్కదారి పట్టింది. ఐకేపీ కేంద్రాలపై ఆజమాయిషీ వహించే డీఆర్‌డీఏ అధికారులు తనపై ఒత్తిడి తెచ్చి ఈ డబ్బు కట్టించారని, ఆ తరువాత సొమ్మును తిరిగి చెల్లించే ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీని ఖాతరు చేయడంలేదని లక్ష్మి కొన్ని సార్లు ఆందోళనకు దిగింది. గతంలో రెండు సార్లు ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టింది. కలెక్టరేట్‌ ఎదుట ఆమరణ దీక్షకు కూడా చేపట్టింది. దాంతో బెంబేలెత్తిన అధికారులు ఎక్కడ తమ బాగోతం బట్టబయలు అవుతుందన్న భయంతో ఆమెకు 5 లక్షలు చెల్లించారు. మిగిలిన 25 లక్షలు ఇవ్వాల్సిందిగా తాను కోరినా పట్టించుకోకపోవడంతో వడ్డీ వ్యాపారుల వేధింపులు తాళలేక లక్ష్మి ఇలా కలెక్టరేట్‌లోనే ఆత్మహత్య చేసుకోబోయింది. ఈ సంఘటన అనంతరం కలెక్టర్‌ వాణిమోహన్‌ డీఆర్‌డీఏ పీడీ రామకృష్ణ, డీఆర్‌ఓ మోహన్‌రాజ్‌తో సమావేశమై సమస్య పరిష్కార నిమిత్తం చర్చలు జరిపారు. ఈ సమావేశంలో ఏ నిర్ణయం తీసుకున్నారో తెలియాల్సి ఉంది.