కాంగ్రెస్‌వి ఉత్తిమాటలు

` వాళ్లు అధికారంలోకి వస్తే 6 నెలలకో సీఎం
` అనిశ్చితి,దుస్థితి ఖాయం..
` కాంగ్రెస్‌, బిజెపి రెండూ దొందూ దొందే..
` తెలంగాణకు నిధులు ఎలాగూ ఇవ్వరు..
` కనీసం మర్యాదైనా చూపండి
` తెలంగాణపై పదే పదే అక్కసు ఎందుకు?
` మోదీ వ్యాఖ్యలపై కేటీఆర్‌ మండిపాటు
హైదరాబాద్‌(జనంసాక్షి): మోదీ సర్కార్‌ తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసిందని, అభివృద్ధిని అడ్డుకుందని మంత్రి కెటిఆర్‌ ఆరోపించారు. మరోవైపు బీఆర్‌ఎస్‌ 24 గంటలు కరెంట్‌ ఇస్తుందని చెబితే, పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి మనం 48 గంటలు కరెంట్‌ ఇస్తామని చెబుతాం అంటున్నారని సెటైర్లు వేశారు. ఖమ్మం జిల్లాకు చెందిన నేతలు హైదరాబాద్‌ లోని తెలంగాణ భవన్‌ లో బీఆర్‌ఎస్‌ లో చేరారు. వారికి కండువా కప్పి మంత్రి కేటీఆర్‌ బీఆర్‌ఎస్‌ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలపై నిప్పులు చెరిగారు. తెలంగాణ భారత్‌ లో విలీనం అయిన సందర్భాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్‌ 17న సీఎం కేసీఆర్‌ అధికారికంగా త్రివర్ణ పతాకం ఎగురవేశారు. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మత విధ్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. మతం పేరిట చిచ్చుపెట్టి ఆ మంటల్లో చలి కాచుకునే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. నరేంద్ర మోదీ, బీజేపీ గత 9 ఏళ్లకు పైగా దేశంతో పాటు తెలంగాణకు ఎంతో అన్యాయం చేసిందని విమర్శించారు. రాష్ట్రం ఏర్పడిన వెంటనే నిరంకుశ ఆలోచన విధానంతోనే భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన 7 మండలాలను ఏపీలో కలిపి అన్యాయం చేశారన్నారు. కరెంట్‌ సమస్యలు ఉంటే, సీలేరును తీసుకెళ్లి పక్క రాష్టాల్రకు విద్యుత్‌ ఇచ్చింది మోదీ సర్కార్‌. విభజన చట్టంలో పేర్కొన్న ఏ హావిూని నెరవేర్చలేదని, నీటి వాటాలు తేల్చలేదు. విద్యుత్‌ సమస్యలు, పరిశ్రమల ఏర్పాటుపై నిర్ణయం తీసుకోలేదన్నారు. ఇల్లెందులో బయ్యారంలో ఉక్కు కర్మాగారం స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ద్వారా ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హావిూకి నీళ్లొదిలారని గుర్తుచేశారు. విూరు జన్‌ ధన్‌ ఖాతాలు తెరవండి.. విదేశాల్లో కుబేరులు దాచుకున్న నల్లధనాన్ని దేశానికి తీసుకొచ్చి.. రూ.15 లక్షలు ఖాతాల్లో వేస్తారంటూ ప్రధాని మోదీ గొప్ప గొప్ప మాటలు, డైలాగ్స్‌ చెప్పారంటూ ఎద్దేవా చేశారు. కానీ ఎన్నికల హావిూల్లో చెప్పకుకున్నా కేసీఆర్‌ రైతుల ఖాతాల్లో 73 వేల కోట్లు జమ చేశారు. ఏడాది 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ప్రధాని మోదీ హావిూ ఇచ్చారు, అంటే 9 ఏళ్లలో 18 కోట్ల ఉద్యోగులు ఇవ్వడం దేవుడెరుగు, ఉన్న ఉద్యోగాలను పోగొట్టారని విమర్శించారు. కేవలం తన స్నేహితుడికి కంపెనీలు, ప్రాజెక్టులు కట్టబెట్టి ఏకపక్షంగా వ్యవహరించారని చెప్పారు. కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డికి దమ్ము, ధైర్యం ఉంటే ఇక్కడ ఉపవాస దీక్షలు చేపట్టడం కాదని, ఢల్లీికి వెళ్లి మోదీతో పోరాటం చేసి తెలంగాణకు నిధులు తీసుకురావాలని సూచించారు. యూపీఏ హయాంలో 400 ఉన్న సిలిండర్‌ ధరలను రూ.1200 చేసిన ఘనత మోదీకి దక్కిందన్నారు. సిలిండర్‌ ధర రూ.400 కావడానికి ఆనాడు మన్మోహన్‌ సింగ్‌, కాంగ్రెస్‌ ప్రభుత్వం కారణమని లెక్కలేనని తిట్లు తిట్టారు మోదీ, కానీ నేడు అంతకు మూడిరతలు చేసిన మోదీని ప్రజలు ఏమనాలో చెప్పాలన్నారు. డాలర్‌ కు రూపాయి విలువ క్షీణిస్తుందని ఆనాడు లొల్లి లొల్లి చేసిన మోదీ, బీజేపీలు నేడు అంతకుమించి క్షీణించినా నోరు మెదపకుండా కూర్చున్నారంటూ మండిపడ్డారు. గూడురు నారాయణ రెడ్డి అనే వ్యక్తి ఏదో సినిమా తీసి సమాజానికి ఏం మెస్సేజ్‌ ఇస్తున్నారని ప్రశ్నించారు. చేతకానితనం వల్లే అభివృద్ధి చేయలేక మత విధ్వేషాలతో పబ్బం గడుపుతున్నారు. బుల్లెట్‌ రైలన్నారు, ఆర్థిక వ్యవస్థలో మూడో స్థానంలో ఉంటామని చెప్పారు. కానీ ఏదీ సాధ్యం కాలేదన్నారు. కాంగ్రెస్‌ నేడు ఒక్క ఛాన్స్‌ అడుతుంది, కానీ గతంలో 11 సార్లు ప్రజలు విూకు ఛాన్సిచ్చారు. అప్పుడు ఎందుకు కరెంట్‌, సాగు, తాగునీరు ఎందుకు ఇవ్వలేదని సూటిగా ప్రశ్నించారు. ఇప్పుడు మాత్రం ఒక్కసారి ఛాన్స్‌ ఇస్తే అన్నీ చేసేస్తామని చెబితే నమ్మే స్థితిలో ప్రజలు లేరన్నారు. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రంలో 600 పింఛన్‌ ఉంటే, ఇప్పుడు చాన్స్‌ ఇస్తే రూ.4000 ఇస్తామని చెబుతున్నారు. గతంలో రూ.200 ఇవ్వలేనొళ్లు ఇప్పుడు కొత్త డ్రామాలకు తెరలేపారంటూ మండిపడ్డారు.పెద్దావిడ కుడుతుంటే సూది పడిపోయింది. అప్పుడు కంటి వెలుగు లేదు కదా, ఆమెకు సూది దొరకలేదు. దాంతో పక్కకు చూస్తే భద్రాద్రి రాముడు కనిపించాడు. దేవుడా నాకు సూది దొరికేలా చేస్తే 5 కిలోల చక్కెర, బెల్లం ఇస్తానని అత్త అన్నది. ఇది విన్న కోడలు ఇంట్లోంచి బయటకు వచ్చి అయ్యో 50 పైసల సూది కోసం ఎంత పనిచేశావు అత్తా అని అడిగింది. ఆ సూది దొరికేదుందా, నేను దేవుడికి చేసేది ఉందా అని అన్నదని కేటీఆర్‌ అనగానే చప్పట్లతో మార్మోగిపోయింది. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే 5 ఏళ్లకు 5 మంది సీఎంలు వస్తారు, పొరపాటున కాంగ్రెస్‌ కు ఓటేస్తే తెలంగాణ సంకనాకి పోవడం ఖాయమన్నారు. కాంగ్రెస్‌ ఇచ్చిన 6 గ్యారంటీల విలువ లెక్కిస్తే రాష్ట్ర బడ్జెట్‌ కంటే ఎక్కువ ఉందని ప్రజలు చెబుతున్నారని గుర్తుచేశారు. రెండు నెలల కిందట కర్ణాటకలో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌, అక్కడ ఎస్సీ, ఎస్టీల కు ఇవ్వాల్సిన నిధులను పక్కదారి పట్టించిందని ఆరోపించారు. ఇప్పటికే కర్ణాటకలో పవర్‌ హాలిడే మొదలైందని డిప్యూటీ సీఎం శివకుమార్‌ చెప్పారని తెలిపారు. వీటికి అదనంగా కరెంట్‌ ఛార్జీలు పెంచుతున్నారని చెప్పారు.  తలసరి ఆదాయంలో దేశంలో అగ్ర స్థానంలో నిలిచింది తెలంగాణ. దేశంలో ఇంటింటికి నల్లా పెట్టిన ప్రభుత్వం తెలంగాణ సర్కార్‌. పర్యావరణం, పట్టణ అభివృద్ధి, ఐటీ సెక్టార్‌, బెస్ట్‌ మునిసిపాలిటిలలో జాతీయ స్థాయిలో అవార్డులు కొల్లగొట్టింది తెలంగాణ అని చెప్పారు. రోడ్డు వేస్తామనో, జిల్లాకో మెడికల్‌ కాలేజీ ఇస్తామనో అభివృద్ధికి సంబంధించి ఒక్కటంటే ఒక్క హావిూ ఇవ్వలేదంటూ కాంగ్రెస్‌ 6 గ్యారంటీలపై కేటీఆర్‌ నిప్పులు చెరిగారు. కేసీఆర్‌ రూ.2000 ఇస్తే, మేం రూ.4000 అని చెబుతున్నారు. కాంగ్రెస్‌ నేతలు చర్చ పెట్టుకోగా.. బీఆర్‌ఎస్‌ 24 గంటలు కరెంట్‌ ఇస్తుందని చెబితే, పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి లేచి మనం 48 గంటలు కరెంట్‌ ఇస్తామని చెబుతాం అంటున్నారని సెటైర్లు వేశారు. కరెంట్‌, నీళ్లు ఇలా ఏ బాధల్లేవని.. ఆ గట్టునుంటారా, ఈ గట్టుకొస్తారా విూరే అర్థం చేసుకోవాలన్నారు. ఓటుకు 2, 3 వేలు ఇస్తే ఖమ్మంలో గెలిచేస్తామని కాంగ్రెస్‌ నేతలు చెప్పుకుంటున్నారు. అయితే కాంగ్రెస్‌ డబ్బులు ఇస్తే కచ్చితంగా తీసుకోండి, ఓటు మాత్రం అభివృద్ధి చేసిన వాళ్లకే వేయాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు.
మోదీ వ్యాఖ్యలపై కేటీఆర్‌ మండిపాటు
పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో తెలంగాణపై మోదీ చేసిన వ్యాఖ్యల పట్ల కేటీఆర్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణకు మూటలు ఎలాగూ ఇవ్వరు.. కనీసం మర్యాదైనా చూపండని ఘాటుగా వ్యాఖ్యానించారు. తెలంగాణకు ఏం చేశారో చెప్పేందుకు.. మోదీ పాలనలో ఒక్క విషయమైనా లేదని ఎద్దేవా చేశారు. సందర్భంగా మోదీ చేసిన ప్రసంగం పై కేటీఆర్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ‘‘తెలంగాణ మీద.. ప్రధాని మోదీకి పదే పదే అక్కసు ఎందుకు. రాష్ట్రం ఏర్పడి పదేళ్లు అవుతున్నా ఎందుకీ వివక్ష? తెలంగాణ అంటేనే గిట్టనట్లు.. మా పుట్టుకను ప్రశ్నించడం పద్ధతేనా? పదే పదే తల్లిని చంపి బిడ్డను తీశారని మోదీ అంటున్నారు. అజ్ఞానం, అహంకారంతో ఇంకెన్నిసార్లు మా అస్తిత్వాన్ని అవమానిస్తారు. తెలంగాణకు ఏం చేశారో చెప్పేందుకు.. మీ పాలనలో ఒక్క విషయమైనా లేదు. అందుకే పదేపదే విషం చిమ్ముతున్నారని’’ ట్విటర్‌లో మంత్రి కేటీఆర్‌ ధ్వజమెత్తారు. తెలంగాణ ఏర్పాటును మోదీ అవమానించటం ఇదే తొలిసారి కాదని.. చారిత్రక వాస్తవాల పట్ల మోదీ నిర్లక్ష్యానికి ఇది అద్దం పడుతోందని కేటీఆర్‌ అన్నారు. స్వరాష్ట్రం కోసం తెలంగాణ ప్రజలు 60 ఏళ్లు పోరాడారని గుర్తు చేశారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను జరుపుకోలేదని చెప్పడం.. అవాస్తవమన్నారు. పార్లమెంటులో కాంగ్రెస్‌ను విమర్శించే ప్రయత్నంలో తెలంగాణను అవమానిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల త్యాగాలు, భావోద్వేగాలను మోదీ పరిగణించాలని హితబోధ చేశారు. ‘‘వడ్లు కొనండని అడిగితే నూకలు బుక్కమని.. మా రైతులని కించపర్చింది మీ కేంద్రమంత్రి కాదా. ఆవు చేలో మేస్తే.. దూడ గట్టున మేస్తదా.. మీలాగే మీ మంత్రులు. కోటి ఆశలు, ఆకాంక్షలతో పురుడుపోసుకున్న కొత్త రాష్ట్రానికి సహకరించకపోగా.. ఆది నుంచి కక్షను పెంచుకొని.. వివక్షనే చూపిస్తున్నారు కదా. ఏడు మండలాలు గుంజుకొని.. లోయర్‌ సీలేరు ప్రాజెక్టును లాక్కొని పురిట్లోనే మీరు చేసిన తొలిద్రోహాన్ని మర్చిపోం. నీతి ఆయోగ్‌ చెప్పినా నీతి లేకుండా మిషన్‌ కాకతీయ, భగీరథ నిధులు ఆపేశారు. కృష్ణా నీటి వాటాలు తేల్చకుండా పదేళ్లు దగా చేశారు. కాజీపేట ఫ్యాక్టరీని గుజరాత్‌కు తరలించుకుపోయారు. దశాబ్దాల కలను నాశనం చేశారు. 157 మెడికల్‌ కాలేజీల్లో ఒక్కటీ ఇవ్వలేదని అన్నారు. పద్నాలుగు సంవత్సరాలు పోరాడి.. దేశాన్ని ఒప్పించి మెప్పించి సాధించుకున్న స్వరాష్ట్రం పట్ల ఎందుకంత చులకన భావం అని ప్రధాని మోదీని మంత్రి కేటీఆర్‌ నిలదీశారు. ప్రజాస్వామ్య దేవాలయంలో ప్రతిసారి పనిగట్టుకొని.. తమ ఆత్మగౌరవాన్ని గాయపర్చి ఎందుకు ఆనందిస్తున్నారన్నారు. ఇలా బయ్యారం బొగ్గు గనులు, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, సింగరేణి ప్రైవేటీకరణ వంటి విషయాలపై మంత్రి కేటీఆర్‌ ప్రధానిని ట్విటర్‌ వేదికగా ప్రశ్నించారు. తెలంగాణలో డబుల్‌ డిజిట్‌ సీట్లు రావు : ఈడీ, ఐటీ, సీబీఐలను ఎన్డీయే కూటమిలో చేర్చుకొని.. ప్రతిపక్షాలపై ఉసిగొల్పి ప్రభుత్వాలను పడగొట్టడమే పనిగా పెట్టుకున్న బీజేపీకి పొద్దున లేచి ప్రజాస్వామ్య సుద్దులు చెప్పడం విచిత్రమని ఎద్దేవా చేశారు. డబుల్‌ ఇంజన్‌ నినాదంతో ఊదరగొట్టే భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో డబుల్‌ డిజిట్‌ సీట్లు కూడా రావని జోస్యం చెప్పారు. డిపాజిట్లు పోగొట్టుకోవడంలో మీరు మళ్లీ సెంచరీ కొట్టడం పక్కానని కేటీఆర్‌ అన్నారు. పార్లమెంటు సాక్షిగా ప్రధాని క్షమాపణలు చెప్పాలి : పార్లమెంట్‌ లో ఇచ్చిన విభజన హామీలకు పాతరేసి అబద్ధాల జాతర చేస్తామంటే సహించబోమని, భరించలేమని అన్నారు. ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని దగా చేసి మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేసినప్పుడు మోసం చేశారని మండిపడ్డారు. తెలంగాణ పుట్టుకనే అవమానించిన బీజేపీకు ఇక్కడ పుట్టగతులు ఉండవని తెలుసుకోవాలని కేటీఆర్‌ సూచించారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం ఆపాలని.. అదే పార్లమెంట్‌ సాక్షిగా బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ద్వేషం కాదు దేశం ముఖ్యమన్న కేటీఆర్‌.. దేశం అంటే రాష్ట్రాల సమాహారం అని గుర్తు చేశారు.