కాంగ్రెస్‌వి మోసపు హామీలు

` ఆపార్టీకి  అధికారమిస్తే అంతే సంగతులు
` మళ్లీ ఆశీర్వదిస్తే జిల్లాగా మిర్యాలగూడ
` యాదాద్రిపై ఆటోలను అనుమతిస్తాం
యాదాద్రి(జనంసాక్షి):రాబందుల లెక్క రైతులను పీక్కతిన్నోళ్లు మనకు అవసరమా? అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. 55 ఏళ్లలో సాధ్యం కానిది ఈ 9 ఏళ్లలో భారాస చేసి చూపించిందన్నారు. ఆలేరు భారాస అభ్యర్థి గొంగిడి సునీతకు మద్దతుగా యాదగిరిగుట్టలో మంత్రి కేటీఆర్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. డిసెంబర్‌ 3న గొంగిడి సునీత ఆలేరు ఎమ్మెల్యేగా మూడోసారి గెలవబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. 2014లో యాదగిరిగుట్ట ఎట్లుండే ఇప్పుడు ఎట్లుందో ఆలోచించి ప్రజలు ఓటు వేయాలని కోరారు. ‘‘యావత్‌ ప్రపంచం చర్చించుకునే విధంగా సీఎం కేసీఆర్‌ యాదగిరిగుట్టను అభివృద్ధి చేశారు. యాదగిరిగుట్ట అభివృద్ధిలో కొందరికి అన్యాయం జరిగింది వాస్తవమే. కొండపైకి ఆటోలు వెళ్లేలా డ్రైవర్లకు డిసెంబర్‌ 3 తర్వాత శుభవార్త చెబుతాం. కాంగ్రెస్‌ హయాంలో ప్రజలు కరెంట్‌ కష్టాలతో ఇబ్బందులు పడ్డారు. కాంగ్రెస్‌ ఇచ్చింది ఉచిత కరెంట్‌ కాదు.. ఉత్తుత్తి కరెంట్‌. వరిధాన్యం పండిరచడంలో ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా నంబర్‌ వన్‌గా ఉంది. తాగు, సాగునీటి కష్టాలు లేవు.
డిసెంబర్‌ 3 తర్వాత కొత్త రేషన్‌ కార్డులు, కొత్త పింఛన్లు వస్తాయి. అలాగే 4 కొత్త పథకాలు ప్రకటిస్తాం. 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డల కోసం ‘సౌభాగ్యలక్ష్మీ’, ఆసరా పెన్షన్‌లను రూ.5 వేలు, వంటగ్యాస్‌ సిలిండర్‌ను రూ.400కే ఇస్తాం. తెల్లరేషన్‌ కార్డుదారులకు సన్నబియ్యం ఇవ్వబోతున్నాం. భూమిలేని పేదలకు రూ.5 లక్షల కేసీఆర్‌ బీమా కల్పిస్తాం. అసైన్డ్‌ భూములను రెగ్యులరైజ్‌ చేయడంతో పాటు సమ్మక్క సారక్క పేర్లపై మహిళా సంఘాలు ఏర్పాటు చేస్తాం. గొంగిడి సునీతను మళ్లీ గెలిపిస్తే మాదాపూర్‌, రఘునాథపురాలను మండలాలుగా ప్రకటిస్తాం. ఆలేరును రెవెన్యూ డివిజన్‌గా ప్రకటిస్తాం. యాదాద్రి కొండపైకి ఆటోలను అనుమతిస్తాం. దాతరుపల్లి వద్ద టూరిజం పార్కుతోపాటు పారిశ్రామిక కారిడార్‌ తీసుకువస్తాం’’ అని కేటీఆర్‌ హావిూ ఇచ్చారు.కాంగ్రెస్‌ నాయకులకు 24 గంటల విద్యుత్‌ సరఫరా కనపించడం లేదంటూ మిర్యాలగూడ ప్రచార ర్యాలీలో మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు. వారికి ఏసీ బస్సులు వేసి బిర్యానీ పెట్టి తిప్పి చూపిద్దామని ఎద్దేవా చేశారు. గతంలో మిర్యాలగూడ ఎట్లుండేది.. ఇప్పుడు ఎట్లుందో చూడాలన్నారు. ఇక్కడకి వచ్చిన ప్రజలని చూస్తుంటే భారాస విజయోత్సవ ర్యాలీలా ఉందన్నారు. ‘‘11 సార్లు అధికారంలో ఉన్నా.. కాంగ్రెస్‌ ఏ మాత్రం అభివృద్ధి చేయలేదు. కొత్త జిల్లాలు ఎప్పుడు ఏర్పాటు చేసినా మిర్యాలగూడను జిల్లాగా చేస్తాం. దామరచర్లలో రూ.30 వేల కోట్లతో పవర్‌ ప్లాంట్‌ను కడుతున్నాం. రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే.. కారు గుర్తుకు మళ్లీ ఓటేసి గెలిపించాలి’’ అని కేటీఆర్‌ కోరారు.

 

 

తాజావార్తలు