కృష్ణయ్య మైనార్టీల మీద విషమేల ?

ఓబీసీ రిజర్వేషన్లలో మైనార్టీలకు ఉప కేటాయింపుపై బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌ కృష్ణయ్య మరోమారు విషం గక్కారు. ఓబీసీ రిజర్వేషన్లలో మైనార్టీలకు ఉప కేటాయించడంపై అన్ని రాజకీయ పార్టీలు తమ వైఖరిని స్పష్టం చేయాలంటూ కృష్ణయ్య ఇరుకున పెట్టాలని చూస్తున్నారు. బీసీ కోటాను తగ్గించి మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పిస్తే ఏ రాజకీయ పార్టీ కూడా ఎందుకు నోరుమెదపడం లేదని ప్రశ్నిస్తూ ఆయన పార్టీలను ‘పార్టీ’ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కృష్ణయ్యకు తమ సంక్షేమమే తప్ప ఇతరుల సంక్షేమం పట్టదు. మైనార్టీల విషయంలో ఆయనది ద్వంద్వ వైఖరి. సమస్యలు ఎదురైనప్పుడు, రాజకీయావసరాల సందర్భంగా బీసీ, మైనార్టీలంటూ మైనార్టీలను మిళితం చేసే కృష్ణయ్య మైనార్టీలకు కొంత ప్రయోజనం కలిగే అంశాల్లో మాత్రం తమకు అన్యాయంటూ గగ్గోలు పెడుతున్నారు. కృష్ణయ్య వైఖరి మతతత్వ పార్టీలకన్నా అత్యంత ప్రమాదకరమైనది. ఆయన చేసేదంతా వితండ వాదనే. వంకర బుద్ధే. ముస్లిం మైనార్టీలను ఆయన ససేమిరా బీసీలుగా గుర్తించరు?. ముస్లిం మైనార్టీలను  మనుషులుగా గుర్తించేందుకు కృష్ణయ్యకు మనసొప్పదు. ఆయన దృష్టిలో వారు ద్వితీయ శ్రేణి పౌరులే. అందుకే ఆయనకు ముస్లిం మైనార్టీలంటే చుల, హేయభావం. ఈ కారణంగానే ఆయన ముస్లిం మైనార్టీలకు ఓబీసీ రిజర్వేషన్లలో ఉప కోటా కేటాయింపు సుతరామూ ఇష్టం లేదు. అందుకే ఈ గగ్గోలు.అన్ని కులాలకు, మతాలకు ఇచ్చినట్లుగానే ముస్లిం మైనార్టీలకు రిజర్వేషన్లు ఇవ్వాలి. ఈ విషయంలో కృష్ణయ్య అభ్యంతరమెందుకు? ముస్లిం,మైనార్టీలు రిజర్వేషన్లు సాధించుకునేందుకు కృష్ణయ్య కరుణా కటాక్షాలు అవసరం లేదు. దాన్ని ఎలా సాధించుకోవాలే ముస్లిం, మైనార్టీలకు తెలుసనే విషయాన్ని ఆలస్యంగానైనా ఆ పెద్ద మనిషి గుర్తిస్తే మరీ మంచిది. దాన్ని సాధించుకునేందుకు అవసరమైతే సత్యాగ్రహమో, సాయుధపోరు ఎంచుకుంటరు.